భారత్‌కు షాక్‌

ABN , First Publish Date - 2021-11-25T08:06:55+05:30 IST

జూనియర్‌ వరల్ద్‌ కప్‌ హాకీని డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ ఓటమితో ప్రారంభించింది. బుధవారం హోరాహోరీగా జరిగిన పూల్‌ ‘బి’ మ్యాచ్‌లో ప్రపంచ 26వ ర్యాంకర్‌

భారత్‌కు షాక్‌

  • తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ చేతిలో ఓటమి
  • జూనియర్‌ వరల్డ్‌ కప్‌ హాకీ


భువనేశ్వర్‌: జూనియర్‌ వరల్ద్‌ కప్‌ హాకీని డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ ఓటమితో ప్రారంభించింది. బుధవారం హోరాహోరీగా జరిగిన పూల్‌ ‘బి’ మ్యాచ్‌లో ప్రపంచ 26వ ర్యాంకర్‌ ఫ్రాన్స్‌ 5-4తో ఫేవరెట్‌ టీమిండియాకు షాకిచ్చింది. దీంతో వైస్‌ కెప్టెన్‌ సంజయ్‌ చేసిన హ్యాట్రిక్‌ గోల్స్‌ ప్రదర్శన వృథా అయింది. ఓ దశలో భారీ ఓటమి ఖాయమనుకోగా..చివర్లో టీమిండియా విజృంభించి వరుస గోల్స్‌తో విజయంపై ఆశలు రేపింది. భారత్‌ తరపున సంజయ్‌ (15, 57, 58 ని.) మూడు గోల్స్‌తో చెలరేగగా.. ఉత్తమ్‌ సింగ్‌ (10 ని.) ఓ గోల్‌ సాధించాడు. ఫ్రాన్స్‌ జట్టులో కెప్టెన్‌ తిమోతి క్లెమెంట్‌ (1, 23, 32ని.) హ్యాట్రిక్‌ గోల్స్‌ చేయగా... బెంజమిన్‌ (7 ని.), సీలెర్‌ (48 ని.) చెరో గోల్‌  నమోదు చేశారు. మ్యాచ్‌ చివరి నిమిషం వరకు ఫ్రాన్స్‌ 5-2తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. కానీ మరో ఆరు నిమిషాల్లో పోరు ముగుస్తుందనగా భారత్‌ దుమ్మురేపింది.


వరుసగా లభించిన రెండు పెనాల్టీ కార్నర్‌లను సంజయ్‌ గోల్స్‌గా మలచి భారత్‌ విజయంపై ఆశలు రేపాడు. కానీ, మ్యాచ్‌ ముగిసే సమయానికల్లా ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించడంలో భారత్‌ విఫలమైంది. ఇక.. తొలిరోజు జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో మలేసియా 2-1తో చిలీపై, పోలెండ్‌ 1-0తో కెనడాపై, జర్మనీ 5-2తో పాకిస్థాన్‌పై, బెల్జియం 5-1తో సౌతాఫ్రికాపై విజయం సాధించాయి. భారత్‌ రెండో మ్యాచ్‌ను గురువారం కెనడాతో ఆడనుంది.

Updated Date - 2021-11-25T08:06:55+05:30 IST