మౌనమే ఆయన మంత్రం!

ABN , First Publish Date - 2020-07-10T05:30:00+05:30 IST

ప్రేమ, సేవ, విధేయత, అన్నివేళలా నిజాయతీ... వీటిని పాటించాలి. నిత్యజీవితంలో సత్ప్రవర్తనతో నడుచుకోవాలి. అప్పుడు మానవులు తమలోని భగవంతుడిని దర్శించగలుగుతారు. రోజూ భగవన్నామస్మరణ చేస్తే ఇది సాధ్యమవుతుంది...

మౌనమే ఆయన మంత్రం!

  • నేడు మెహర్ బాబా 95వ మౌన వార్షికోత్సవం


ప్రేమ, సేవ, విధేయత, అన్నివేళలా నిజాయతీ... వీటిని పాటించాలి. నిత్యజీవితంలో సత్ప్రవర్తనతో నడుచుకోవాలి. అప్పుడు మానవులు తమలోని భగవంతుడిని దర్శించగలుగుతారు. రోజూ భగవన్నామస్మరణ చేస్తే ఇది సాధ్యమవుతుంది. ఆచరణపూర్వకంగా ఈ సందేశం ఇచ్చిన మహనీయుడు మెహెర్‌బాబా. నలభై నాలుగేళ్ళపాటు మౌనవ్రతాన్ని అవలంబించిన విశిష్టులు ఆయన. దర్శనమాత్రంతో అభీష్టాన్ని నెరవెర్చే దైవంగా భక్తులు ఆయనను ఆరాధిస్తారు. 


అది 1931వ సంవత్సరం. మెహెర్‌బాబా లండన్‌ పర్యటనకు రాజ్‌పుఠానా అనే ఓడలో వెళుతున్నారు. అప్పటికి ఆరేళ్ళ నుంచీ ఆయన మౌనవ్రతంలో ఉన్నారు. అదే ఓడలో మహాత్మా గాంధీ కూడా ప్రయాణిస్తున్నారు. ఆ సందర్భంలో మహాత్ముడు, మెహెర్‌ బాబా పలుసార్లు సమావేశమయ్యారు. అనేక ఆధ్యాత్మిక విషయాలను బాబాతో గాంధీజీ ముచ్చటించారు. మెహెర్‌ బాబా జీవిత చరిత్ర ‘లార్డ్‌ మెహెర్‌’ గ్రంథం ఈ సంగతులు పేర్కొంటోంది. ఆ సమయంలో, ‘‘మీ సుమధుర వాక్కులు వినాలని ఉంది. పెదవి కదపకుండానే ప్రజలను  ప్రభావితులను చేస్తున్నారు. మీరు పెదవి విప్పి, మౌన విరమణ చేసి త్వరలోనే మాట్లాడాలి’’ అని బాబాను గాంధీ కోరారు. త్వరలోనే మాట్లాడతానని బాబా హామీ ఇచ్చారు. 


మౌనం వీడని మహర్షి!

అయితే 1925 జూలై 10న ప్రారంభించిన మౌన దీక్షను 1969 జనవరి 31న  భౌతిక శరీరం త్యాగం చేసే దాకా అంటే సుమారు 44 ఏళ్ళు మెహెర్‌బాబా కొనసాగించారు. మౌనంలోనే పదమూడు సార్లు అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా తదితర విదేశాలలో పర్యటించారు. ఆయనకు  రెండుసార్లు ఘోర కారు ప్రమాదాలు జరిగాయి. ఆయన కాలికీ, తుంటి ఎముకకూ వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆ బాధను ఆయన మౌనంగా భరించారు. అది చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. 1925 నుంచి 1954 వరకూ ఆంగ్ల అక్షరాలు ఉన్న పలక సహాయంతో బాబా తన మౌనం కొనసాగించారు. ఆపై ఆ అక్షర ఫలకం కూడా వదలి, కేవలం సంజ్ఞలతో సందేశాలు ఇచ్చారు. మౌనంలో ఉండగానే సృష్టి రహస్యాలను వివరించే ‘భగవద్వచనం’, ‘సర్వం-శూన్యం’ అనే అద్భుత ఆధ్యాత్మిక గ్రంథాలను భావితరాల వారి కోసం ఆయన అందజేశారు. 

వాస్తవానికి తానెన్నడూ మౌనంగా లేనన్నారు మెహెర్‌ బాబా. నిరంతరం తన ప్రేమికుల హృదయాలతో నేరుగా మాట్లాడుతున్నానన్నారు. ‘‘దేవుడు అన్నిటా, అంతటా, అందరిలోనూ ఉన్నాడు. గత జన్మసంస్కారాల ప్రభావం వల్ల మీలో ఉన్న దేవుణ్ణి మీరు దర్శించలేకపోతున్నారు’’ అని స్పష్టం చేశారు. ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడేననీ, అన్నిమతాల సారం ఇదేననీ, తనకంటూ ప్రత్యేక మతం లేదనీ, తన మతం ‘ప్రేమ’ అని బాబా పలు సందర్భాలలో ప్రకటించారు.


బోధించడానికి రాలేదు!

మెహెర్‌ బాబా 1925 జూలై 10 నుంచి కఠిన మౌనం ప్రారంభించారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 30 సంవత్సరాలు. అంతకు ముందు  ఎదుటివారు సమ్మోహితులయ్యేలా చమత్కారంగా ఆయన మాట్లాడేవారు. స్వయంగా డోలక్‌ వాయిస్తూ, అద్భుతంగా గజల్స్‌ గానం చేసేవారు. అనేక ఆధ్యాత్మిక విషయాలు అనర్గళంగా చెప్పేవారు.  ‘‘బాబా! నువ్వు మౌనం పాటిస్తే,  నువ్వు నిత్యం చెప్పే అనేక ఆధాత్మిక మర్మాలు ఎవరు చెబుతారు? దయచేసి మౌనం వద్దు’’ అని  శిష్యులు పలుమార్లు  విన్నవించారు. అప్పుడాయన ‘‘నేను బోధించడానికి రాలేదు. మేలుకొలపడానికి వచ్చాను!’’ అని స్పష్టంగా  ప్రకటించారు.   


‘‘మనుషులు ఇవ్వాలి, తరువాత తీసుకోవాలి. మొదట మీరు ఇస్తే, తరువాత అన్నీ మీకు వస్తాయి. దానికి బదులు, మొదట అన్నీ తమకే కావాలని మనుషులు అనుకుంటారు. ఆ తరువాతే ఇవ్వడం గురించి ఆలోచిస్తారు. అది సరైన మార్గం కాదు.’’    

‘‘నేను ఏనుగును కావాలనుకుంటున్నాను’ అని ఒక చీమ అంటే ఎలా ఉంటుంది? ‘నేను దేవుణ్ణి చూడాలనుకుంటున్నాను’ లేదా ‘నేను దేవుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాను’ అని అనడం కూడా అలాంటిదే! ఇవన్నీ ఉత్తుత్తి మాటలు. దేవుణ్ణి చూడాలంటే హృదయంలో తపన ఉండాలి.’’

          - మెహెర్‌బాబా


ఈ సారి ఎక్కడివారక్కడే!

మెహెర్‌ బాబాను ఆరాధించేవారు చాలా మంది ప్రతి ఏటా జూలై 10న మౌనం పాటించడానికి మహారాష్ట్రలోని అహ్మద్‌ నగర్‌ సమీపంలో గల మెహెరాబాద్‌లో బాబా సమాధి దగ్గరకు వెళుతూ ఉంటారు. కరోనా సమస్య వల్ల ఈ ఏడాది అక్కడికి ఎవరూ రావద్దని బాబా ట్రస్టు ఆదేశించింది. కాబట్టి ఈసారి బాబా ప్రేమికులు ఎక్కడివారు అక్కడే వుండి బాబా నామస్మరణలో మౌనం పాటిస్తున్నారు. ఇది మెహెర్‌బాబా 95వ వార్షికోత్సవం. ఈ రోజు తన ఆరాధకులు మౌనం పాటించాలన్నది బాబా ఆదేశం.

-డాక్టర్‌ మల్లాది కృష్ణానంద్‌

Updated Date - 2020-07-10T05:30:00+05:30 IST