రియల్టీలో మళ్లీ జోష్‌

ABN , First Publish Date - 2020-10-31T07:56:23+05:30 IST

కొవిడ్‌-19తో నీరసించిన హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్లో మళ్లీ జోష్‌ కనిపిస్తోంది. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ మార్కెట్‌ చాలా మెరుగ్గా ఉంది. మార్కెట్‌ ప్రస్తుతం స్థిరమైన

రియల్టీలో మళ్లీ జోష్‌

కొవిడ్‌ నుంచి వేగంగా రికవరీ 

కొవిడ్‌-19తో నీరసించిన హైదరాబాద్‌  రియల్టీ మార్కెట్లో మళ్లీ జోష్‌ కనిపిస్తోంది. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ మార్కెట్‌ చాలా మెరుగ్గా ఉంది. మార్కెట్‌ ప్రస్తుతం స్థిరమైన స్థితికి చేరిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ తొలగించినప్పటి నుంచే మార్కెట్లో కదలిక ప్రారంభమైంది. సంఘటిత రంగంలో పెద్దగా ఉద్యోగాలు పోకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. 

 

లాక్‌డౌన్‌ ప్రభావం అంతంతే..

లాక్‌డౌన్‌ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రియల్టీ మార్కెట్‌ కుప్పకూలింది. హైదరాబాద్‌ మార్కెట్లో మాత్రం ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. అప్పట్లోనూ నగరంలో ఆఫీసు లీజింగ్‌, రెసిడెన్షియల్‌ అమ్మకాలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే జరిగాయి. మే నెల నుంచి నిర్మాణాలు జోరందుకున్నాయి. దాంతో అనేక ఆఫీసులు, నివాస గృహ సముదాయాల నిర్మాణం పూర్తయింది.

 

ఆదుకున్న ఆఫీసు స్పేస్‌

కరోనా ముప్పు ఉన్నా జనవరి-జూన్‌ మధ్య కాలంలో హైదరాబాద్‌ మార్కెట్లో ఆఫీస్‌ స్పేస్‌కు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఈ కాలంలో దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఆఫీసు స్పేస్‌లో 30 శాతం ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే అందుబాటులోకి వచ్చింది. ఇదే సమయంలో ఆఫీసు స్పేస్‌ లీజు లావాదేవీల్లో 18 శాతం భాగ్యనగరం చుట్టుపక్కల జరిగాయి. 


ఆకట్టుకుంటున్న ప్రభుత్వ విధానాలు 

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల వ్యాపార విధానాలు స్థానిక రియల్టీ మార్కెట్‌కు కలిసొస్తోంది. ఐటీ రంగం జోరు ఇంకా కొనసాగుతోంది. ఆర్థిక మందగమనం కారణంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు 8 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో హైదరాబాద్‌ ఐటీ ఎగుమతుల్లో 18 శాతం వృద్ధి రేటు నమోదైంది.  


కొత్త పరిశ్రమల రాక 

హైదరాబాద్‌ ఇప్పటికే ఐటీ కేంద్రంగా ఎదిగింది. ఇప్పుడు ఏరోస్పేస్‌, బయోటెక్నాలజీ వంటి కంపెనీలకూ కేంద్రంగా ఎదుగుతోంది. ఇదంతా నగర రియల్టీకి కలిసొస్తోంది. నగరంలో ఉన్న, కొత్తగా ఏర్పడుతున్న మౌలిక సదుపాయాలతో  ప్రవాస భారతీయులు కూడా సొంతింటికి మొగ్గు చూపుతున్నారు.  


హైదరాబాద్‌ కంటే కోల్‌కతాలో చవక

గత ఏడాది వరకు దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌లోనే నివాస గృహాల ధర తక్కువ. ఈ ఏడాది ఆ స్థానాన్ని కోల్‌కతా కొట్టేసింది. భూముల ధర, నిర్మాణ ఖర్చులు పెరగడం ఇందుకు ప్రధాన కారణమని బిల్డర్లు చెబుతున్నారు. 


Updated Date - 2020-10-31T07:56:23+05:30 IST