రాఘవ భూ కబ్జాపై జాయింట్ సర్వే
ABN , First Publish Date - 2022-01-14T09:04:19+05:30 IST
ఆస్తి పంపకం వ్యవహారంలో తలదూర్చి..
ఆక్రమణల నిగ్గుతేల్చే పనిలో రెవెన్యూ, ఫారెస్టు శాఖలు
పాల్వంచ రూరల్, జనవరి 13: ఆస్తి పంపకం వ్యవహారంలో తలదూర్చి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతపాల్వంచకు చెందిన నాగరామకృష్ణ కుటుంబం ఆత్మాహుతి ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు(రాఘవ) అక్రమ ఆస్తులపై వారంరోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాఘవ అరెస్టు తర్వాత అందరి దృష్టి ఆయన చేసిన భూ కబ్జాలపై పడింది. మీడియాలో కూడా ఈ విషయంపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్న క్రమంలో కొన్ని సామాజిక మాధ్యమాల్లో రాఘవ ఆక్రమించిన భూమిగా ప్రచారం అవుతున్న పాల్వంచ మండలం బంగారుజాల గ్రామంలోని పామాయిల్ తోటపై అధికారులు దృష్టి పెట్టారు. ఆక్రమణల నిగ్గు తేల్చేందుకు రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు గురువారం ఆ తోటను సందర్శించారు. సర్వేలో భాగంగా ఆ భూమి అటవీ శాఖ పరిధిలోకి వస్తుందా? లేక రెవెన్యూ పరిధిలోకి వస్తుందా? అనే విషయాలపై ఆరా తీశారు. రెవెన్యూ అధికారులు కూడా ఆ భూమి హద్దులు ఎక్కడ ఉన్నాయి..? విస్తీర్ణం ఎంత..? దాని స్వభావమేంటి? తదితర విషయాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ఫోర్స్ ఎఫ్డీవో ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ అధికారులతోపాటు పాల్వంచ రేంజ్ అధికారి అనిల్, ఆయన బృందం కీలమైన సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. మరో రెండు రోజుల పాటు ఈ సర్వే కొనసాగుతుందని, సర్వే పూర్తయిన తర్వాత అటవీ భూమి అక్రమణకు గురైందా..? లేదా..? అనే విషయాన్ని వెల్లడిస్తామని ఎఫ్డీవో అనిల్ తెలిపారు.