ఉమ్మడి ప్రాజెక్టులు..కేంద్రం చేతికి!
ABN , First Publish Date - 2021-07-15T07:58:27+05:30 IST
రెండు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టులను కేంద్రం నియంత్రణలోకి తీసుకొచ్చేలా ఉత్తర్వులివ్వాలని సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది
జలం.. జగడం
సుప్రీంలో రాష్ట్రం పిటిషన్
నిర్వహణాధికారమూ దానికే.. అవసరమైతే కేంద్ర బలగాలతో నడపాలి
తెలంగాణ జీవో 34ను రద్దు చేయండి.. ఏకపక్ష నీటి విడుదలను అడ్డుకోండి
అక్రమాలతో తెలంగాణ సాధించింది కొంతే.. మాకెంతో నష్టం కలిగింది
ఆ రాష్ట్రానికి పెనాల్టీ విధించాలి.. విద్యుదుత్పత్తి ఆపాలని ఆదేశించినా లెక్కలేదు
పులిచింతల నుంచీ కరెంటు చట్టవిరుద్ధం.. దీనిపై ప్రధానికి సీఎం లేఖ రాశారు
ఏ మార్గం లేకనే సుప్రీంకు.. కేంద్రానికి సమాచారమిచ్చాం.. పిటిషన్లో వెల్లడి
- అక్రమ చర్యలతో తెలంగాణ సాధించింది చాలా తక్కువ. కానీ మాకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇందుకుగాను తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పెనాల్టీ విధించాలి.
- శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుంచి ఏకపక్షంగా నీటిని వాడుకున్నందుకుగాను 2021-22 నీటి సంవత్సరంలో ఆ రాష్ట్రానికి వాటా తగ్గించాలి.
- బచావత్ ట్రైబ్యునల్ ఆదేశాలను తెలంగాణ సర్కారు ధిక్కరిస్తోంది. మాకు కేటాయించిన 512 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునేందుకు వీల్లేకుండా జలవిద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం జలాశయం డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని విడుదల చేస్తోంది.
- రిట్ పిటిషన్లో ఆంధ్రప్రదేశ్
న్యూఢిల్లీ/అమరావతి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రెండు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టులను కేంద్రం నియంత్రణలోకి తీసుకొచ్చేలా ఉత్తర్వులివ్వాలని సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కృష్ణా ట్రైబ్యునల్-1 కేటాయింపుల మేరకు ప్రాజెక్టులను నిర్వహించే అధికారాన్ని కూడా కేంద్రానికి ఇవ్వాలని, అవసరమైతే పోలీసుల సహకారంతో పనిచేయించాలని కోరింది. ఈ మేరకు బుధవారం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జెన్కోలను ప్రతివాదులుగా చేర్చింది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 87 ప్రకారం.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిని ఖరారు చేయాల్సిందిగా ఆదేశించాలని కోరింది. జలవిద్యుదుత్పత్తికి సంబంధించి తెలంగాణ జారీ చేసిన జీవో 34ను రద్దు చేయాలని, విద్యుత్ అవసరాల కోసం నీటిని తోడుకోవడాన్ని నిరోధించాలని అభ్యర్థించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుంచి ఏకపక్షంగా నీటిని వాడుకున్నందుకుగాను ఈ మూడు ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి తెలంగాణకు 2021-22 నీటి సంవత్సరంలో వాటా తగ్గించాలని.. ఆ రాష్ట్రంపై పెనాల్టీ విధించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ప్రభుత్వ అక్రమ, విచక్షణారహిత చర్యలు కృష్ణా జలాలపై ఆధారపడినవారిని తీవ్రంగా నష్టపరుస్తున్నాయని పేర్కొంది. ‘నిర్ణయాలను అమలు చేయని రాష్ట్రాలు బాధ్యత వహించాలని, కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగాను, ఇతర పెనాల్టీలను విధించవచ్చని విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ పేర్కొంటోంది. నిర్ణయాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం ఆ రాష్ట్ర ఏకపక్ష చర్యలు నిరూపిస్తున్నాయి. ఈ రీత్యా 2021-22లో తెలంగాణ నీటి వాటాను తగ్గించాలని కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశాం’ అని వెల్లడించింది. ఈ వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు అధికారికంగా స్వీకరించలేదని.. జలవనరుల శాఖ వర్గాలు వెల్లడించాయి.
పెనాల్టీ వేయాల్సిందే..
విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలను, కేంద్రం, కేఆర్ఎంబీ సూచనలను పాటించడానికి తెలంగాణ ప్రభుత్వం నిరాకరిస్తోందని ఏపీ తన పిటిషన్లో తెలిపింది. బచావత్ అవార్డును స్పష్టంగా ఉల్లంఘిస్తోందని పేర్కొంది. అలాగే కేఆర్ఎంబీ పరిధిని ఖరారు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు నోటిఫికేషన్ జారీ చేయలేదని తెలిపింది. నోటిఫికేషన్ జారీ చేయవద్దని 2016లో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందని.. బోర్డు పరిధి ఖరారు చేయని కారణంగా తమ వాటా నీటి వినియోగంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంది.
ఏపీకి కృష్ణా జలాలు జీవనాడి అని రాష్ట్రప్రభుత్వం తన పిటిషన్లో తెలిపింది. ‘మా రాష్ట్రం కృష్ణా జలాలపై ఆధారపడి ఉంది. కృష్ణా ట్రైబ్యునల్-1 కేటాయించిన నీటిలో రాష్ట్రంలో తాగు, సాగు, ఇతర అవసరాలను తీర్చుకోవాల్సి ఉంటుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా నీటిని తీసుకుంటోంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం 854 అడుగులు ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేయాలని ట్రైబ్యునల్-1 తీర్పు, నివేదికలు స్పష్టం చేస్తున్నాయి’ అని తెలిపింది.
పిటిషన్‌లోని ముఖ్యాంశాలు..
- గత ఏడేళ్లుగా శ్రీశైలం డ్యాం, కుడిగట్టు విద్యుత్కేందం ఏపీ నియంత్రణలో, ఎడమగట్టు విద్యుత్కేందం తెలంగాణ అఽధీనంలో ఉన్నాయి. సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌తో పాటు సగం ప్రాజెక్టు ఆంధ్ర భూభాగంలో ఉన్నప్పటికీ సాగర్ మొత్తం తెలంగాణ నియంత్రణలో ఉంది. ఈ కారణంగా కేఆర్ఎంబీ ఆదేశించినా మా వాటా మాకు దక్కడం లేదు. దిగువన ఉన్న మా రాష్ట్ర ప్రయోజనాలను విఘాతం కలిగే విధంగా తెలంగాణ వ్యవహరిస్తోంది.
- విద్యుత్ అవసరాల కోసం ప్రత్యేకంగా నీటిని తోడుకోడానికి లేదు. విద్యుత్, సాగు అవసరాల మధ్య సంఘర్షణ ఏర్పడితే సాగు అవసరాలకే ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర విభజన చట్టంలోని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్ని విజ్ఞప్తులు చేసినా తెలంగాణ విద్యుదుత్పత్తిని ఆపడం లేదు.
- కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి మిగులు జలాల ఆధారంగా నీరు తీసుకోవలసి ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో 854 అడుగులకు నీటిమట్టం చేరుకోకుండా 800 అడుగుల నుంచే తోడేస్తోంది. ఇది రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జరిగిన ఒప్పందాలను పూర్తిగా విస్మరించడమే.
- శ్రీశైలం జలాశయం మినిమ్ డ్రాడౌన్ లెవెల్ (ఎండీడీఎల్) 834 అడుగుల కంటే తక్కువగా నీటి నిల్వలు ఉన్నప్పటికీ.. 796 అడుగుల నుంచే విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ నీటిని తోడేయడం వల్ల శ్రీశైలం జలాశయంపై ఆధారపడ్డ రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి.
- పులిచింతల ప్రాజెక్టు ద్వారా కూడా తెలంగాణ విద్యుదుత్పత్తి చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం. దీనివల్ల 4.56 టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలో కలిశాయి.
- నిబంధనలకు విరుద్ధంగా, విచక్షణారహితంగా తెలంగాణ నీటిని వాడుకుంటుండడంపై ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. కేంద్రానికి కూడా అనేక లేఖలు రాశాం. ఇక ఏ మార్గం లేకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కేంద్ర జలశక్తి కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాచారం ఇచ్చారు.
- ఏపీలోని ఎస్ఆర్బీసీ, చెన్నైకి తాగునీటి సరఫరా, తెలుగు గంగ, హంద్రీ-నీవా, వెలిగొండ, గాలేరు-నగరిలకు నీరు తీ సుకునే విషయంలో తెలంగాణ ఇబ్బందులకు గురిచేస్తోంది.