కొత్త స్ట్రెయిన్ ఎఫెక్ట్: బైడెన్ మరో కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2021-01-26T20:46:17+05:30 IST

కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

కొత్త స్ట్రెయిన్ ఎఫెక్ట్: బైడెన్ మరో కీలక నిర్ణయం!

వాషింగ్టన్: కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్ట్రెయిన్ వ్యాప్తిని అరికట్టేందుకు యూరప్, బ్రెజిల్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించారు. అలాగే దక్షిణాఫ్రికా నుంచి వచ్చే వారికి కూడా అగ్రరాజ్యంలో ప్రవేశం లేదని వైట్‌హౌస్ వెల్లడించింది. కొవిడ్-19, మెడికల్ టీం సూచన మేరకు అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి వెల్లడించారు. కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి వేగవంతంగా జరుగుతున్నందున వైరస్ ప్రభావం అధికంగా ఉన్న యూకే, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, యూరోపియన్ సెంజెన్ ప్రాంతం నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులపై బ్యాన్ విధిస్తూ బైడెన్ ఉత్తర్వులు జారీ చేశారని సాకి పేర్కొన్నారు. 


అలాగే జనవరి 26 నుంచి అమెరికా వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు ప్రయాణానికి 72 గంటల ముందు తీసుకున్న కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి అని ఆమె వెల్లడించారు. ఇక మహమ్మారిపై పోరులో భాగంగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే బైడెన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం విదితమే. ఇప్పటికే ముఖానికి మాస్క్, క్వారంటైన్ తప్పనిసరి చేశారు. తాజాగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షల దిశగా చర్యలకు ఉపక్రమించారు. కాగా, కరోనా ఇప్పటికే దాదాపు 4 లక్షలకు పైగా మంది అమెరికన్లను కబళించిన సంగతి తెలిసిందే.     


Updated Date - 2021-01-26T20:46:17+05:30 IST