JC Prabhakar Reddy: ఎంతవరకైనా వెళతా

ABN , First Publish Date - 2022-10-02T01:34:36+05:30 IST

రూ.30 కోట్ల విలువైన మున్సిపల్‌ స్థలాన్ని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళతానని తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి

JC Prabhakar Reddy: ఎంతవరకైనా వెళతా

తాడిపత్రి: రూ.30 కోట్ల విలువైన మున్సిపల్‌ స్థలాన్ని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళతానని తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy) స్పష్టం చేశారు. ఆ స్థలంలో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ను నిర్మించేందుకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి, డీఎస్పీ చైతన్య ప్రయత్నించడం సరికాదని అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆ స్థలం వద్ద నల్లదుస్తులు ధరించి శనివారం ఆయన నిరసన తెలిపారు. ‘తాడిపత్రి (Tadipatri) ప్రజల్లారా మేల్కొండి. ఎమ్మెల్యే, డీఎస్పీ ఊరిని మోసం చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌ పక్కన ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ కడతారంట. దానికి సంబంధించిన జీవోను మున్సిపల్‌ కమిషనర్‌కు అందజేశారా? ఎంత డబ్బు మంజూరైంది? మేము పోలీస్‌స్టేషన్‌కు వ్యతిరేకం కాదు. మూడుచోట్ల స్థలం కూడా చూపించాం. వాటిని కాదని రూ.కోట్ల విలువైన మున్సిపల్‌ స్థలాన్ని ఎమ్మెల్యే, డీఎస్పీ ప్రభుత్వానికి ధారాదత్తం చేయాలని చూస్తున్నారు’ అని రాసిన ఫ్లెక్సీని ప్రభాకర్‌రెడ్డి ప్రదర్శించారు. 


ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్థిక లోటులో ఉన్న మున్సిపాలిటీ.. స్వయం సమృద్ధి సాధించేలా ఆ స్థలంలో మున్సిపల్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని కౌన్సిల్‌ తీర్మానం కూడా చేశామని అన్నారు. నిధుల సేకరణకు ప్రయత్నిస్తుండగా, ఎమ్మెల్యే, డీఎస్పీ అత్యుత్సాహంతో ఆ స్థలంలో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ నిర్మాణానికి మూడు స్థలాలు చూపించామని, వాటిని కాదని, రూ.కోట్ల విలువైన స్థలాన్ని ఎంచుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ స్థలం కోసం తాము హైకోర్టుకు వెళుతున్నామని ప్రకటించారు. ఈ నెల 5 నుంచి కౌన్సిలర్లతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ను భయపెట్టి, తప్పుడు డిక్లరేషన్‌ను సృష్టించారని ఆరోపించారు. ఆ డిక్లరేషన్‌ కారణంగా ఆయన ఇంటికి పోవడం ఖాయమని ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2022-10-02T01:34:36+05:30 IST