APలో కొత్త పొత్తులకు జనసేన సంకేతాలు..? కళ్ళెం వేసేందుకు YSRCP ఎత్తులు..?

ABN , First Publish Date - 2022-03-22T16:08:06+05:30 IST

జనసేనాని గర్జించారు. వైసీపీపై శివమెత్తారు. ఒక్క ఛాన్సంటూ ఏపీని పాతికేళ్ళు వెనక్కి తీసుకెళ్ళారంటూ మండిపడ్డారు. రాష్ట్ర్ర ప్రయోజనాల కోసం వైసీపీ వ్యతిరేక

APలో కొత్త పొత్తులకు జనసేన సంకేతాలు..? కళ్ళెం వేసేందుకు YSRCP ఎత్తులు..?

జనసేన ఆవిర్భావ సభ ఏపీలో కొత్త పొత్తులకు సంకేతాలిచ్చిందా? పవన్‌ వెనుక ఎవరున్నారో స్పష్టం చేసిందా? వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వమంటూ ఆయన చేసిన ప్రకటన దేనికి సంకేతం? పవన్‌ను ఒంటరిగా పోటీ చేసేలా చూడాలంటూ సీఎం జగన్‌ ఎవరితో మాట్లాడారు..? జనసేనకు కళ్ళెం వేసేందుకు వైసీపీ వేస్తున్న ఎత్తులేమిటి అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


వైసీపీ సర్కార్ పై జనసేన అధినేత పవన్ నిప్పులు

జనసేనాని గర్జించారు. వైసీపీపై శివమెత్తారు. ఒక్క ఛాన్సంటూ ఏపీని పాతికేళ్ళు వెనక్కి తీసుకెళ్ళారంటూ మండిపడ్డారు. రాష్ట్ర్ర ప్రయోజనాల కోసం వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమన్నారు. ఇప్పడీ ప్రకటనే ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారింది.  పొత్తుపొడుపుకు ఇది సంకేతమంటున్నారు. పవన్‌ ఈ సభలో ఏదీ దాచుకోలేదు. తన అజెండా ఏమిటో చాలా స్పష్టంగా చెప్పేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. ఇందుకోసం దేనికైనా సిద్ధం ఇదీ స్థూలంగా పవన్‌ చెప్పిన మాటల సారాంశం. పవన్‌ ప్రకటన వైసీపీలో ప్రకంపనలు పుట్టించింది. యమర్జంటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు జనసేనాని ఒంటరిగా పోటీ చేయాలంటూ సవాళ్ళు విసరడం మొదలుపెట్టారు. ఇలా రెచ్చగొట్టి ఆయనను ఏకాకి చేయాలనేది వీరి వ్యూహం. అయితే పవన్‌ ఇప్పటికే ఓ స్ట్రాంగ్‌ డెసిషన్‌ తీసేసుకున్నారని జనసేన వర్గాల ఇన్‌సైడ్‌టాక్‌.  ప్రతిపక్షాలు ఏకమైతే తమ పని అంతేనని వైసీపీ లీడర్స్‌ టెన్షన్‌ పడుతున్నారు. 


ఏపీలో కక్ష సాధింపు రాజకీయాలు

ప్రతిపక్షాలు ఏకంకాకుండా తెరవెనుక అధికారపార్టీ పావులు కదుపుతోంది కానీ ఫలించడం లేదంటున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి బయటనుంచి మద్దతు ఇచ్చింది. తరువాత వీరి మధ్య దూరం పెరిగింది. ఇక 2019లో టీడీపీ, బీజేపీ, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. ఈ ఎనికల్లో బీజేపీపై టీడీపీ విరుచుకుపడింది. దీంతో బీజేపీ సైలెంట్‌గా వైసీపీ గెలుపుకోసం పనిచేసింది. అయితే ఈ మూడేళ్ళలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఏపీలో కక్ష సాధింపు రాజకీయాలు పెరిగాయి.  ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన కొంత సన్నిహితమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నిచోట్ల కలిసి కూడా పోటీచేశాయి. జనసేనతో కలిసి ప్రయాణించడానికి సుముఖంగానే ఉన్నట్టు టీడీపీ వైపు నుంచి అప్పుడప్పుడు సంకేతాలు వెలువడుతూనే ఉన్నాయి. ఈ విషయంపై  కుప్పంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమ అనేది వన్‌సైడెడ్‌గా ఉండకూదని, రెండువైపులా ఉండాలని చెప్పడం అప్పట్లో సంచలనమైంది. దీంతో జనసేన,టీడీపీ పొత్తుపై చర్చలు జరిగాయి. ఇక బీజేపీ కూడా గతంతో పోలిస్తే వైసీపీ పాలనపై విమర్శలు పెంచింది. 


వైసీపీ అధినేత జగన్‌ తెరవెనుక మంత్రాంగం 

జనసేనాని ఒంటరిగా పోటీ చేయించి తద్వారా తన వ్యతిరేక ఓటు చీలిపోయేలా చేయాలనేది వైసీపీ ఎత్తుగడ. ఇందుకోసం వైసీపీ అధినేత జగన్‌ తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. ఇటీవల ఆయన మెగాస్టార్‌ చిరంజీవిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. పైకి కేవలం టిక్కెట్ల విషయం అని చెప్పినా వీరిద్దరి మధ్య రాజకీయ చర్చలు జరిగాయనే ప్రచారం ఉంది. పవన్ని ఒంటరిగా పోటీచేసేందుకు ఒప్పించాలని జగన్‌ చిరంజీవిని కోరారనే ప్రచారం ఉంది. అయితే వపన్‌ తన మాట వినడంటూ చిరంజీవి నిస్సహాయత వ్యక్తం చేశారుట. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం ఒంటరిగా పోటీ చేయడం వలనే అప్పట్లో రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగలిగింది. మరోసారి ఈ స్ట్రాటజీనే పవన్‌పైనా ప్రయోగించాలని జగన్‌ తలపోశారు. 


వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒక్కటిగా..

కానీ చిరంజీవి తనవల్ల కాదని చెప్పడంతో ఆయన ప్లాన్‌ ఫలించలేదని చెపుతున్నారు. అందుకే పవన్‌ ముందుజాగ్రత్తగానే సభలో వైసీపీ వ్యతిరేక ఓటు గురించి మాట్లాడరని చెపుతున్నారు.  వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒక్కటిగా ఉంటాయని బలమైన సంకేతం ఇచ్చారని, దీనివల్ల రాజకీయ సమీకరణలు మారతాయంటున్నారు.  జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో ప్రతిపక్షాలు ఒక్కటి కాబోతున్నాయనే ప్రచారం అధికార  పార్టీని బలహీనపరుస్తుందంటున్నారు.  దీనివలన  ప్రతిపక్ష శిబిరంలో దూకుడు పెరుగుతుందని భావిస్తున్నారు. 

Updated Date - 2022-03-22T16:08:06+05:30 IST