టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా జనార్దన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-05-20T07:19:42+05:30 IST

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ)కు పూర్తిస్థాయి చైర్మన్‌తో పాటు సభ్యులను ప్రభుత్వం ఎట్టకేలకు నియమించింది.

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా జనార్దన్‌రెడ్డి

  • ఏడుగురు సభ్యుల నియామకం..
  • ఇద్దరు మహిళలకు అవకాశం
  • రెవెన్యూ నుంచి అరుణకుమారి, రవీందర్‌రెడ్డికి చాన్స్‌
  • ఐదు నెలల తర్వాత పూర్తి స్థాయి కమిషన్‌ ఏర్పాటు
  • నిరుద్యోగులకు భరోసా కల్పిస్తా..
  • కొత్త చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి


హైదరాబాద్‌, మే 19(ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ)కు పూర్తిస్థాయి చైర్మన్‌తో పాటు సభ్యులను ప్రభుత్వం ఎట్టకేలకు నియమించింది. చైర్మన్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి నియమితులయ్యారు. చైర్మన్‌తో పాటు ఏడుగురు సభ్యులను సీఎం కేసీఆర్‌ బుధవారం నియమించారు. సీఎం  ప్రతిపాదనలను గవర్నర్‌ తమిళిసై ఆమోదించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌.. చైర్మన్‌, సభ్యుల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. చైర్మన్‌తో పాటు సభ్యులంతా ఆరేళ్లు లేదా 62 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


ఒక మాజీ ఎమ్మెల్సీతో పాటు ఉన్నతాధికారులు, డాక్టర్‌, ఇంజనీర్‌, తెలంగాణ ఉద్యమకారులకు సభ్యులుగా అవకాశం కల్పించారు. టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, రిటైర్డ్‌ ఈఎన్‌సీ రమావత్‌ ధన్‌సింగ్‌, సీబీఐటీ ప్రొఫెసర్‌ బి.లింగారెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌ కోట్ల అరుణకుమారి, తెలుగు పండింట్‌ సుమిత్రా ఆనంద్‌ తనోబా, ప్రాక్టిసింగ్‌ ఆయుర్వేదిక్‌ డాక్టర్‌ ఆరవెల్లి చంద్రశేఖర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్ట్‌ ఆర్‌. సత్యనారాయణను సభ్యులుగా నియమించారు. గతంలో ఉద్యోగ సంఘం నేత విఠల్‌ను సభ్యుడిగా నియమించగా.. ఈ సారి టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి (పూర్వ డిప్యూటీ తహసిల్దార్‌)కి అవకాశం కల్పించారు.    సభ్యుల్లో సగం మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో పదేళ్లపాటు పనిచేసిన ఉద్యోగులై ఉండాలి. మిగతా సగం మంది సభ్యులు విద్యావేత్తలై ఉండాలి. 


ఐదు నెలల తర్వాత భర్తీ!

టీఎ్‌సపీఎస్సీ తొలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణిని గతంలో ప్రభుత్వం నియమించింది. ఆయనతో పాటు మరో ముగ్గురు సభ్యుల పదవీ కాలం గత ఏడాది డిసెంబరు 17న ముగిసింది. అప్పటి నుంచి ఐదునెలల పాటు టీఎ్‌సపీఎస్సీకి పూర్తిస్థాయి చైర్మన్‌ లేరు. ప్రస్తుతం సాయిలు ఒక్కరే తాత్కాలిక చైర్మన్‌, సభ్యుడిగా కొనసాగుతుండటం గమనార్హం. ఆయ న పదవీకాలం అక్టోబరులో పూర్తికానుంది. పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 50 వేల కొలువులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. టీఎ్‌సపీఎస్సీకి చైర్మన్‌, సభ్యుల్లేకుండా ఉద్యోగాల నియామక ప్రక్రియ ఎలా చేస్తారని విమర్శలూ వచ్చాయి. ఇదే విషయమై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. నాలుగు వారాల్లోగా పూర్తిస్థాయి చైర్మన్‌తో పాటు సభ్యులను నియమించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఐదునెలల తర్వాత చైర్మన్‌, సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమించిన వారితో కలుపుకొని ప్రస్తుతం టీఎ్‌సపీఎస్సీలో ఒక చైర్మన్‌తో పాటు 8మంది సభ్యులుంటారు.


బి.జనార్దన్‌రెడ్డి (చైర్మన్‌): మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం పెద్దాయపల్లికి చెందిన జనార్దన్‌రెడ్డి.. అగ్రికల్చర్‌ పీజీ చేశారు. 1990లో గ్రూప్‌-1కు ఎంపికై డిప్యూటీ కలెక్టర్‌ బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నల్లగొండ, నెల్లూరు ఆర్డీవోగా పనిచేశారు. వరంగల్‌, అనంతపురం జిల్లాల కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, సెరికల్చర్‌, మార్కెటింగ్‌ శాఖల కమిషనర్‌గా, సహకారశాఖ రిజిస్ట్రార్‌గా, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా, విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఏడాది నవంబరులో జనార్దన్‌రెడ్డి పదవీ విరమణ పొందనున్నారు. 


కారం రవీందర్‌ రెడ్డి (సభ్యుడు): వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరుకు చెందిన రవీందర్‌రెడ్డి.. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడిగా గతం లో బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు.  


రమావత్‌ ధన్‌ సింగ్‌ : నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని జాత్యానాయక్‌ తాండాలో నిరుపేద కుటుంబంలో రమావత్‌ ధన్‌ సింగ్‌ జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ పట్టా పొందారు. ప్రజారోగ్య శాఖలో వివిధ హోదాలలో పనిచేస్తూ ఈన్‌సీ ఉన్నత పదవిని చేపట్టారు. 


ప్రొఫెసర్‌ బి. లింగారెడ్డి: ఖమ్మం జిల్లా వేమ్సుర్‌ మండలం కందుకూర్‌కు చెందిన లింగారెడ్డి.. ఓయూలో రేడియేషన్‌ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ప్రముఖ చైతన్య భారతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కళాశాల (సీబీఐటీ)లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా 1996లో చేరారు. ప్రస్తుతం అదే కాలేజీలో ఫిజిక్స్‌ విభాగ హెడ్‌గా కొనసాగుతున్నారు.


కోట్ల అరుణ కుమారి: ప్రస్తుతం వికారాబాద్‌లో భూభారతి జాయింట్‌ డైరెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌గా అరుణకుమారి విధులు నిర్వహిస్తున్నారు. ఆమె.. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జగన్‌మోహన్‌రావు భార్య. 


సుమిత్రా ఆనంద్‌ తనోబా: కామారెడ్డికి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన సుమిత్రా.. ప్రస్తుతం లింగంపేట జడ్పీహెచ్‌ఎ్‌సలో తెలుగు పండింట్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు.   


ఆరవెల్లి చంద్రశేఖర్‌ రావు : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన చంద్రశేఖర్‌రావు.. ఓయూలో బీఏఎంఎస్‌ చేశారు. ఆయన భార్య కూడా డాక్టర్‌. ఇద్దరు ముస్తాబాద్‌లో ఆస్పత్రి నెలకొల్పి వైద్యసేవలందిస్తున్నారు. నవజ్యోతి అనే వాలంటరీ ఆర్గనైజేషన్‌ ద్వారా దుబ్బాక, సిరిసిల్ల ప్రాంతాల్లోని వృద్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. 


ఆర్‌. సత్యనారాయణ (సభ్యుడు): మెదక్‌ జిల్లా వరిగుంతం గ్రామానికి చెందిన సత్యనారాయణ.. మాజీ ఎమ్మెల్సీ. గతంలో పలు దినపత్రికల్లో సీనియర్‌ జర్నలిస్టుగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 


నియామకాల్లో పారదర్శకత

‘ఆంధ్రజ్యోతి’తో జనార్దన్‌రెడ్డి

పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగులకు భరోసా కల్పిస్తానని టీఎ్‌సపీఎస్సీ నూతన చైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 20 నుంచి 25 లక్షల మంది నిరుద్యోగులున్నారని, వారికి నమ్మకం కలిగించేలా ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెప్పారు. టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడారు. మెరిట్‌ ఆధారంగా నియామకాలు జరుగుతాయని, పైరవీలకు ఆస్కారముండదని స్పష్టం చేశారు. నియామక ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. సమస్యలుంటే ప్రభుత్వశాఖలతో చర్చించి పరిష్కరిస్తామని, కోర్టు అంశాల విషయంలో వేగంగా పనిచేస్తామన్నారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు జనార్దన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-05-20T07:19:42+05:30 IST