యాత్రదారిలో జన జాతర

ABN , First Publish Date - 2021-12-09T08:33:01+05:30 IST

అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి

యాత్రదారిలో జన జాతర

  • పల్లె సీమల్లో పసుపునీళ్లు చల్లి స్వాగతాలు
  • చిత్తూరులో రెండోరోజు యాత్రకు బ్రహ్మరథం
  • కదల్లేకున్నా వాకర్‌తో వచ్చిన సీపీఐ నారాయణ
  • పులివెందుల నుంచి తరలొచ్చిన జనం
  •  గుమ్మడికాయలతో యాత్రికులకు దిష్టి
  • రోడ్లు కడిగి రథాలకు పవిత్ర పూజలు
  • చిత్తూరులో రెండోరోజు యాత్రకు బ్రహ్మరథం
  • కదల్లేకున్నా వాకర్‌తో  వచ్చి సీపీఐ నారాయణ మద్దతు
  • పులివెందుల నుంచి తరలొచ్చిన జనం
  • మేము సైతమంటూ  మైనారిటీల సంఘీభావం


ఏర్పేడు, శ్రీకాళహస్తి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ మహా పాదయాత్రకు జనం బ్రహ్మరఽథం పడుతున్నారు. చిత్తూరు జిల్లాలోని ప్రవేశించిన రెండో రోజైన బుధవారం యాత్ర దారి అంతా జన జాతరను తలపించింది. మొత్తం 16 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఏర్పేడు మండలం చింతలపాలెంలో ఉదయం 9.05 గంటలకు నడక ప్రారంభించిన రాజధాని రైతులు, మహిళలు సాయంత్రం 5.35 గంటలకు శ్రీకాళహస్తి మండలం పానగల్లు వద్దకు చేరుకున్నారు. మార్గమధ్యంలోని పల్లెల్లో మహిళలు పసుపు నీళ్లతో రోడ్లు కడిగి మరీ పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. కొన్ని చోట్ల గుమ్మడికాయలు పగలగొట్టి దిష్టి తీసి స్వాగతించగా, మరికొన్ని చోట్ల కొబ్బరికాయలు కొట్టి పూలు, హారతులతో స్వాగతించడం కనిపించింది. ప్రతి గ్రామంలోనూ యాత్రికులపై  జనం పూలు చల్లి నినాదాలతో మద్దతు, సంఘీభావం ప్రకటించారు.


ప్రత్యేకించి ఏర్పేడు మండలం రాజులపాలెం, శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామాల్లో మహిళలు స్వాగతించిన తీరు పాదయాత్ర బృందాన్ని అబ్బురపరిచింది. రాజులపాలెంలో మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి చేరుకుని శ్రీవారి రథానికి పూజలు చేసి పాదయాత్ర బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. ఇక మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్వగ్రామమైన ఊరందూరులోకి యాత్ర ప్రవేశించగానే.. పండగ వాతావరణం నెలకొంది. మహిళలు రోడ్లను కడిగి శుభ్రం చేసి అందమైన రంగవల్లులు తీర్చిదిద్ది పాదయాత్ర బృందానికి ఘనమైన ఆహ్వానం పలికారు.



రథంలో కూర్చున్న నారాయణ

ఇటీవల తిరుపతి వరదల సందర్భంగా గాయపడి కదల్లేని స్థితిలో ఉన్న  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వాకర్‌ సాయంతో బుధవారం చింతలపాలెం చేరుకుని మహా పాదయాత్రకు మద్దతు పలికారు. అమరావతి పరిరక్షణ సమితి అఽధ్యక్షుడు శివారెడ్డితో కలసి శ్రీవారి రథంలోనే కూర్చుని విష్ణు కెమికల్స్‌ పరిశ్రమ వరకూ యాత్రలో పాల్గొన్నారు. మధ్యాహ్నం పాదయాత్ర బృందంతోనే కలసి భోజనం చేశారు. 




పులివెందుల నుంచి సంఘీభావం

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి సుమారు 40 మంది రైతులు, టీడీపీ నాయకులతో కూడిన బృందం పాదయాత్రకు మద్దతు ప్రకటించింది. శ్రీకాళహస్తి మండలం విష్ణు కెమికల్స్‌ ఫ్యాక్టరీ సమీపంలో పాదయాత్ర బృందాన్ని కలిసిన వారు.. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులతో కలసి మాట్లాడి సంఘీభావం ప్రకటించారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని వారంతా ఆకాంక్షించారు. దానికోసం జరిగే పోరాటంలో తాము సైతం పాల్గొంటామంటూ పాదయాత్రలో కాలు కదిపారు.


ముఖ్యమంత్రి జగన్‌ సొంత నియోజకవర్గం నుంచి రావడంతో వీరి రాక అమితంగా ఆకర్షించింది. రాష్ట్ర టీడీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలు పెద్ద సంఖ్యలో వచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులను కలసి మద్దతు ప్రకటించారు. జగన్‌ తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు పాదయాత్ర, ఓదార్పు యాత్ర వంటివి చేయవచ్చుగానీ, రైతులు మాత్రం తమ సమస్యల కోసం పాదయాత్రలు చేయకూడదా అని మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ నిలదీశారు. టీడీపీ తిరుపతి, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ కమిటీల అధ్యక్షులు నరసింహయాదవ్‌,  పులివర్తి నాని, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ, సత్యవేడు టీడీపీ ఇంచార్జి జేడీ రాజశేఖర్‌, మాజీ ఎమ్మెల్యే హేమలత, సీపీఎం, పలు ప్రజాసంఘాల నేతలు పాదయాత్రలో పాల్గొని అమరావతి రాజధానికి మద్దతు ప్రకటించారు. గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు సతీసమేతంగా వచ్చి జింగిలిపాలెం వద్ద కలిసి యాత్రలో పాల్గొన్నారు. 



రేపు పాదయాత్రకు సీపీఐ రాజా సంఘీభావం

రాజధాని రైతుల మహాపాదయాత్రకు సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా సంఘీభావం తెలుపుతారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ‘‘రాజా శుక్రవారం అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్టను పరిశీలిస్తారు. అనంతరం శ్రీకాళహస్తి వద్ద అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలుపుతారు. ఆ తర్వాత తిరుపతి చేరుకుని.. వరద బాధితులకు దుస్తుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు’’ అని ఒక ప్రకటనలో రామకృష్ణ తెలిపారు.




సభకు డీజీపీని అనుమతి కోరాం

అడ్డుకుంటే రాజ్యాంగ హక్కులు కాలరాసినట్టే
నేడు మధ్యాహ్నం వరకే యాత్ర: జేఏసీ నేతలు

తిరుపతిలో పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగసభ జరుపుకొనేందుకు అనుమతి కావాలని డీజీపీ, తిరుపతి అర్బన్‌ ఎస్పీలను కోరామని అమరావతి పరిరక్షణ సమితి నేతలు శివారెడ్డి, తిరుపతిరావు వెల్లడించారు. అయితే ఇంకా అనుమతి రాలేదన్నారు. సభ నిర్వహణకు ఒకవేళ పోలీసు అధికారులు అనుమతి  నిరాకరిస్తే తమ రాజ్యాంగ హక్కుల్ని కాలరాసినట్టు అవుతుందన్నారు. వెంకటేశ్వరస్వామిపై భారం మోపి నడుస్తున్నామని, ఆయనే గమ్యం చేరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో మూడు రోజుల పాటు బస చేయడానికి తాము బుక్‌ చేసుకున్న కల్యాణ మండపం యజమానిని పోలీసులు బెదిరిస్తున్నారని జేఏసీ నేతలు అన్నారు.  పాదయాత్ర బృందానికి మండపం ఇస్తే ఊరుకోబోమని ఒత్తిడి తెస్తున్నారు. ఇంతకన్నా రాక్షసత్వం, క్రూరత్వం ఉంటుందా? అని మండిపడ్డారు. కాగా, గురువారం శ్రీకాళహసిలో మధ్యాహ్నం వరకే పాదయాత్ర కొనసాగిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. శుక్రవారం రాత్రి వరకూ విరామం ప్రకటించామని, తిరిగి శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభమవుతుందని వివరించారు.



విశాఖ భూములు కొల్లగొట్టడానికే రాజధానుల ఎత్తుగడ : నారాయణ

విశాఖపట్టణంలో భూములు కొల్లగొట్టడానికే ముఖ్యమంత్రి జగన్‌ రాజధానుల ఎత్తుగడ వేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. యాత్రను పోలీసులతో ఆపాలని చూడడం సరికాదన్నారు. రాజధాని నిర్ణయమనేది తల్లి కడుపులో బిడ్డ లాంటిదని, ఒకసారి బిడ్డ జన్మించాక వద్దనుకున్నా తిరిగి యధాస్థితికి చేర్చడం సాధ్యంకాదని వ్యాఖ్యానించారు. అయితే జగన్‌ పుట్టిన బిడ్డను మూడు ముక్కలు చేసి మూడు ప్రాంతాలకు విసిరేయాలన్నంత పాపం చేస్తున్నారని మండిపడ్డారు. మన రాజధాని ఏదో ఢిల్లీలో చెప్పుకోలేకపోవడం సిగ్గుచేటూ, అవమానకరమన్నారు. అమరావతి పాదయాత్రకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని నారాయణ వెల్లడించారు.

Updated Date - 2021-12-09T08:33:01+05:30 IST