నాలుగో టెస్టులో కోహ్లీ వర్సెస్ అండర్సన్ లేనట్టేనా?

ABN , First Publish Date - 2021-09-01T02:44:03+05:30 IST

టీమిండియా స్కిప్పర్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మధ్య పోరు నాలుగో టెస్టులో

నాలుగో టెస్టులో కోహ్లీ వర్సెస్ అండర్సన్ లేనట్టేనా?

లండన్: టీమిండియా స్కిప్పర్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మధ్య పోరు నాలుగో టెస్టులో కనిపించకపోవచ్చు. ఈ సిరీస్‌లో కోహ్లీ రెండు సార్లు అండర్సన్‌కే దొరికిపోయాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ మధ్య సెప్టెంబరు 2న లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. అండర్సన్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు నాలుగో టెస్టులో అతడికి విశ్రాంతి ఇవ్వాలని ఇంగ్లండ్ బోర్డు నిర్ణయించినట్టు సమాచారం. మాంచెస్టర్‌లో జరిగే చివరి టెస్టుకు అతడు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. చివరి మూడు టెస్టు మ్యాచ్‌లు మూడు వారాల వ్యవధిలోనే జరగుతుండడంతో రెండు జట్లు బౌలర్లను రొటేట్ చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే ఇండియా జట్టులో మార్పులు చోటు చేసుకోగా, ఇంగ్లిష్ జట్టు ఇప్పుడు అదే పనిలో ఉంది. 


నిజానికి అండర్సన్, రాబిన్సన్‌లను విడగొట్టాలని తాము అనుకోవడం లేదని, మున్ముందు చాలా క్రికెట్ ఆడాల్సి ఉండడం, అది కూడా ఒకటి తర్వాత ఒకటిగా ఆడాల్సి ఉండడంతో విడగొట్టక తప్పేలా లేదని ఇంగ్లండ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ పేర్కొన్నాడు. వారిపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 39 ఏళ్ల అండర్సన్ మొదటి మూడు టెస్టుల్లోనూ లెక్కకు మించిన ఓవర్లు వేశాడు. అండర్సన్ 116.3 ఓవర్లు, రాబిన్సన్ 166.5 ఓవర్లు బౌలింగ్ వేశారు.  


వీరిద్దరూ జట్టు కోసం ప్రతి రోజూ, ప్రతీదీ చేశారని సిల్వర్‌వుడ్ ప్రశంసించాడు. మైదానంలో వీరిద్దరూ కీలకంగా ఉన్నారని అన్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారిని దూరం చేసుకోవడం ఇష్టం లేదన్న కోచ్.. నాలుగో టెస్టు ఆడకుండా రాబిన్సన్‌ను ఒప్పించడం కష్టమేనని పేర్కొన్నాడు. కాగా, ఈ సిరీస్‌లో ప్రతి మ్యాచ్ ఆడతానని అండర్సన్ ఇది వరకే ప్రకటించడం గమనార్హం. ఇంగ్లండ్ ఇప్పటికే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ శామ్ కరన్‌తో ఇబ్బంది పడుతోంది. అతడు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. కాబట్టి అతడి స్థానంలో క్రిస్ వోక్స్‌ను తీసుకునే అవకాశం ఉంది. 

Updated Date - 2021-09-01T02:44:03+05:30 IST