వరాల తల్లులకు జేజేలు

ABN , First Publish Date - 2022-02-19T07:00:56+05:30 IST

మేడారం భక్తితరంగమై ఎగిసిపడుతోంది.. తల్లులిద్దరూ కొలువుదీరడంతో నూతనశోభతో అలరారుతోంది.. గద్దెల ప్రాంగణం బంగారువర్ణంలో వెలిగిపోతూ తన్మయభరితం చేస్తోంది.. శివసత్తుల శిగాలు.. భక్తుల పూనకాలతో దివ్య క్షేత్రం పరవశించిపోతోంది... గురువారం రాత్రి గద్దెపైకి సమ్మక్క చేరడంతో ఊపందుకున్న మొ క్కులు.. శుక్రవారం శిఖరాగ్రానికి చేరుకున్నాయి.

వరాల తల్లులకు జేజేలు
శుక్రవారం రాత్రి విద్యుత్‌ వెలుగుల మధ్య జేగీయమానంగా ప్రకాశిస్తున్న మేడారం క్షేత్రం

మేడారం నిండు జాతరకు భారీగా భక్తుల రాక
గండాలు తొలగించి, కష్టాలు గట్టెక్కించాలని వేడుకోలు
ఎత్తు బంగారాలు... చీరెసారెలు, ముడుపుల సమర్పణ
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అధికార, అనధికార ప్రముఖులు
తిరుగుముఖం పట్టిన భక్తులు.. ఖాళీ అవుతున్న పరిసరాలు
సీఎం కేసీఆర్‌ పర్యటన రద్దుతో టీఆర్‌ఎస్‌ నేతల నిరాశ


మేడారం నుంచి ఆంధ్రజ్యోతి బృందం
మేడారం భక్తితరంగమై ఎగిసిపడుతోంది.. తల్లులిద్దరూ కొలువుదీరడంతో నూతనశోభతో అలరారుతోంది.. గద్దెల ప్రాంగణం బంగారువర్ణంలో వెలిగిపోతూ తన్మయభరితం చేస్తోంది.. శివసత్తుల శిగాలు.. భక్తుల పూనకాలతో దివ్య క్షేత్రం పరవశించిపోతోంది... గురువారం రాత్రి గద్దెపైకి సమ్మక్క చేరడంతో ఊపందుకున్న మొ క్కులు.. శుక్రవారం శిఖరాగ్రానికి చేరుకున్నాయి. ‘తల్లులా రా కరుణించండి.. మా కోర్కెలు తీర్చి కష్టాలు తొలగించండి.. మళ్లొచ్చే జాతరకు మరిన్ని మొక్కులు చెల్లించుకుంటాం.’ అంటూ భక్త జనం వేడుకుంటున్నారు. దివ్యదర్శనానికి క్యూలో ఎంతసేపైనా ఓపిగ్గా నిరీక్షిస్తున్నారు.  మళ్లొచ్చే జాతర వరకు సల్లంగా చూడాలని  మొక్కుకుంటున్నారు. తాము అనుకున్నది జరిగితే ఏం మొక్కులు చెల్లించేదీ తల్లుల సన్నిధిలో చెప్పుకుంటున్నారు.

నాలుగురోజుల మహాజాతర పర్వంలో  మూడో రోజైన శుక్రవారం కూడా మొక్కుల జోరు కనిపించింది.  భక్తుల రాక కొనసాగింది. వీఐపీల తాకిడి పెరిగింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు అమ్మలను దర్శించుకున్నారు. బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మం త్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి లు జాతరలోనే మకాం వేసి పర్యవేక్షిస్తున్నారు.దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో మూడు రోజుల్లో జాతరలో మృతి చెందినవారి సంఖ్య నాలుగుకు పెరిగింది.

పెరిగిన రద్దీ
సమ్మక్క గురువారం రాత్రి గద్దెపైకి చేరిన తర్వాత గద్దెల ప్రాంగణం వద్ద భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కూడా భక్తులు మేడారానికి పోటెత్తారు. వనదేవతలకు మొక్కుల చెల్లింపులు నిరంతరాయంగా సాగాయి తల్లులను దర్శించుకున్నవారు ఒక వైపు తిరుగు ప్రయాణమవుతుండగా, మరో వైపు దర్శనానికి భక్తులు పెద్దఎత్తున వస్తున్నారు. రెండు రోజులుగా 75 లక్షల మంది రాగా, శుక్రవారం ఒక్కరోజే 25లక్షల మందికిపైగా వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దర్శనాలు, మొక్కుల చెల్లింపులు శనివారం కూడా ఇదే రీతిన కొనసాగనున్నాయి. శనివారం సాయంత్రం తల్లులు వనప్రవేశం చేసే లోగా మరో 10నుంచి 15లక్షల మంది మేడారానికి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. క్యూలైన్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దర్శనానికి రెండు గంటలు పడుతున్నది. రాత్రి పొద్దుపోయిన తర్వాత కానీ రద్దీ తగ్గే అవకాశం లేదు.

జనసంద్రం.. గద్దెల ప్రాంగణం

సమ్మక్క, సారలమ్మతోపాటు గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెలపై వేంచేసి ఉండడంతో జాతరకు సమగ్రత చేకూరింది. అప్పుడే మొక్కులు చెల్లించాలనే సెంటిమెంట్‌ కలిగిన భక్తులంతా జాతరలో అప్పటివరకు వేచి ఉన్నారు. గురువారం సమ్మక్క గద్దెపైకి వచ్చిన తర్వాత దర్శనానికి ఒక్కసారిగా కదిలారు. దీంతో క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూలో నిల్చున్నవారిలో కొందరు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇద్దరు స్ప్పహ తప్పిపడిపోయారు. అప్రమత్తమైన పోలీసులు.. భక్తులను నియంత్రించి వీలైనంత త్వరగా దర్శనాలు జరిగేలా చూశారు.

దీంతో అప్పటి వరకు వీఐపీ, వీవీఐపీల కోసమే ప్రత్యేకంగా నిర్దేశించిన ప్రవేశమార్గాల్లో కొంత సడలింపులు ఇచ్చారు. భక్తులు వెళ్లేందుకు అనుమతిచ్చారు. మేడారంలో సమ్మక్క గుడికి దగ్గర బొడ్రాయి పక్కన ఏర్పాటుచేసిన వీవీఐపీల ప్రవేశమార్గంలో శుక్రవారం తెల్లవారుజామున నుంచి సాధారణ భక్తులు సైతం ప్రవేశించేందుకు అనుమతిచ్చారు. రద్దీ ఎక్కువ ఉన్నచోట భక్తులను ఇతర మార్గాల గుండా మళ్లించారు. జాతరలో మొత్తం ఐదు చోట్ల ఎంట్రీ పాయింట్లను ఏర్పాటు చేయగా, ఇందులో వీవీఐపీలకు, పోలీసు అధికారుల రాకపోకలకు రెండు మార్గాలను నిర్దేశించారు. అవసరాన్ని బట్టి వీటిని కూడా సాధారణ భక్తుల కోసం వినియోగించారు.

నిండిన హుండీలు
మూడు రోజులుగా భక్తులు వేసిన కానుకలతో హుండీలు పూర్తిగా నిండిపోయాయి. జాతరలో ఈసారి గతంలో కన్నా అదనంగా మరో 60 హుండీలను ఏర్పాటు చేశారు. అవన్నీ శుక్రవారం నాటికి నిండిపోగా వాటిని సీల్‌ చేసి గద్దెల ప్రాంగణంలోనే ఒక పక్క భద్రపరిచారు. శనివారం సాయంత్రం లెక్కింపు కోసం వాటిని హనుమకొండకు తరలిస్తారు

తిరుగు ప్రయాణం
తల్లుల దర్శనం అనంతరం భక్తులు తిరుగు ప్రయాణమవుతున్నారు. దీంతో జాతర పరిసరాల్లో జనం రద్దీ తగ్గుతుండగా, ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో రద్దీ పెరుగుతున్నది. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తిరుగుముఖం పడుతుండడంతో బస్టాండ్‌ కిటకిటలాడుతోంది. ప్రయాణికులను వీలైనంత త్వరగా పంపించేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గత జాతర కన్నా ఈసారి 300 బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు.

తల్లుల సన్నిధిలో ప్రముఖులు

మేడారం మహాజాతరలో శుక్రవారం వీఐపీల తాకిడి కనిపించింది. పలువురు కేంద్ర, రాష్ట్ర మం త్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు హాజరై తల్లులను దర్శించుకున్నారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి రేణుకాసింగ్‌, కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్‌, రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్‌, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, మల్లారెడ్డి,  ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్‌, సిరికొండ మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి, రవిందర్‌రావు, ఎంపీలు పసునూరి దయాకర్‌, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు అరూరి రమేష్‌, నన్నపునేని నరేందర్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్‌, గండ్ర వెంకటరమణా రెడ్డి, డాక్టర్‌ టి.రాజయ్య, కృష్ణారావు, వివేకానంద, ఈటల రాజేందర్‌,  మేయర్‌ సుధారాణి, టీఆర్‌ఎస్‌ నేతలు వద్దిరాజు రవిచంద్ర, రైతు రుణ విమోచన కమిషన్‌ చైర్మన్‌  నాగుర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కె.వాసుదేవరెడ్డి, జడ్పీ చైర్మన్లు జగదీష్‌, గండ్ర జ్యోతి, బీజేపీ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు అశోక్‌ రెడ్డి, బీజే పీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తదితరులు దర్శనం చేసుకున్నవారిలో ఉన్నారు.

తుది అంకానికి మహా జాతర
నేడు దేవతల వన ప్రవేశంతో ముగింపు
మేడారం, ఫిబ్రవరి 18 : నాలుగురోజుల జాతరలో భక్తులకు దర్శనమిచ్చిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు నేడు(శనివారం) వనప్రవేశం చేయనున్నారు. నేటిసాయంత్రం 4గంటలకు పూజారుల కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి గద్దెల వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడ భక్తులు సమర్పించిన కొంత బంగారం(బెల్లం), కొన్ని ముడుపులను సేకరిస్తారు. తర్వాత ప్రధాన వడ్డెలు ఆయా దేవతల రూపాలను తీసుకొని వారివారి నిజస్థానాలకు తీసుకువెళ్తారు. సారలమ్మను కన్నెపల్లికి, సమ్మక్కను చిలుకలగుట్టకు, పగిడిద్దరాజును పూనుగొండ్లకు, గోవిందరాజులును కొండాయికి తరలిస్తారు. కొద్దినిమిషాల తేడాతో దేవతల వనప్రవేశం తంతు పూర్తవుతుంది. దీంతో నాలుగురోజుల మహాజాతర ముగిసినట్లవుతుంది. చివరి క్షణం వరకు కూడా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి గద్దెలను దర్శించుకుంటూనే ఉంటారు. తర్వాత మూటాముల్లె సర్దుకొని పిల్లాపాపలతో ఇళ్లకు తిరుగుప్రయాణమవుతారు. పరిసరాలన్నీ నిర్మానుష్యంగా మారగా మేడారంలో మళ్లీ నిశ్శబ్ధం అలుముకుంటుంది.

నేడు గవర్నర్‌ తమిళిసై రాక
మేడారం, ఫిబ్రవరి 18 : రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శనివారం మేడారం వస్తున్నారు. హెలికాప్టర్‌ ద్వారా ఉదయం 11గంటలకు మేడారం చేరుకోనున్న గవర్నర్‌.. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

నేడు రేవంత్‌రెడ్డి మొక్కులు
మేడారం, ఫిబ్రవరి 18 : టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి శనివారం మేడారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోనున్నారు. రోడ్డుమార్గం ద్వారం వస్తున్న రేవంత్‌కు ములుగు సమీపంలోని గట్టమ్మ వద్ద భారీఎత్తున స్వాగతం పలికేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు సిద్ధమయ్యాయి. సుమారు 200 వాహనాలతో ర్యాలీగా మేడారం చేరుకోనున్నారు. ములుగు ఎమ్మెల్యే, ఏఐసీసీ మహిళా కార్యదర్శి సీతక్క ఆధ్వర్యంలో వనదేవతలను రేవంత్‌రెడ్డి దర్శించుకుని మీడియాతో మాట్లాడుతారు.

అన్నీ తానైన ఎర్రబెల్లి..
మూడు రోజులుగా జాతరలోనే బస
నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ
మేడారం, ఫిబ్రవరి 18 : రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మేడారం జాతరలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. జాతర నిర్వహణను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మూడు రోజులుగా మేడారంలోనే బస చేసిన మంత్రి.. జాతరలో భక్తులకు కల్పించిన సదుపాయాలను స్వయంగా పర్యవేక్షిస్తూ భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలుగకుండా అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం కూడా జాతరలో విస్తృతంగా పర్యటించి పారిశుధ్యం, భక్తులకు తాగునీటి సరఫరా, అమ్మవార్ల గద్దెల వద్ద క్యూలైన్లు, వైద్య, ఆరోగ్యశాఖ భక్తులకు అందిస్తున్న వైద్యసేవలు, వైద్యశిబిరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జాతరలో కొన్నిచోట్ల చెత్త పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉండడం చూసి అందుకు బాధ్యులైన వారికి జరిమానాలు విధించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి కూడా రెండు రోజులుగా జాతరలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.



















Updated Date - 2022-02-19T07:00:56+05:30 IST