మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2022-02-20T00:09:39+05:30 IST

ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన మనసులో మాట బయటపెట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

హైదరాబాద్: ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన మనసులో మాట బయటపెట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘నేను లేకపోతే కాంగ్రెస్‌పార్టీకి బలం తగ్గదు. కోవర్ట్‌ అన్నారనే పార్టీని వీడుతున్నా. పార్టీలో కొనసాగలేనని కరాఖండిగా లేఖలో తెలిపా. నేను వాళ్లను అనడం, వాళ్లు నన్నడం.. ముగిసినట్టే. నాకెందుకు రిస్క్‌, నా తిప్పలేదో నేను పడతా.. ఈ రాద్ధాంతం ఎందుకు?.. నా సీటు నేను గెలుచుకుంటా. పెద్దలు అడిగినందుకు రెండు రోజుల పార్టీలో ఉంటా. అనంతరం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తా’’ అని జగ్గారెడ్డి ప్రకటించారు.


కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు సమాచారం. తన రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపనున్నట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి సొంతంగా పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా.. కాంగ్రెస్‌ను వీడాక తాను ఏ పార్టీలోనూ చేరేది లేదని, స్వతంత్రంగానే వ్యవహరిస్తాననీ తన సన్నిహితులతో చెబుతున్నట్టు సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం, సోనియాగాంధీ కుటుంబంపైన మొదటి నుంచీ తన విధేయతను ప్రకటిస్తూ వస్తున్న జగ్గారెడ్డి.. టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి నియామకం పట్ల మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.


కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 12 మందిని ఇప్పటికే జారవిడుచుకున్న కాంగ్రెస్‌.. మరో ఎమ్మెల్యేను పోగొట్టుకునేందుకు సిద్ధపడుతుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సభలో పార్టీకి ఆరుగురు సభ్యులుంటే.. అందులో  రాజగోపాల్‌రెడ్డి పార్టీతో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో జగ్గారెడ్డి రాజీనామా చేస్తే క్రమశిక్షణ విషయంలో గట్టి సంకేతాన్ని ఇచ్చేందుకు పార్టీ దాన్ని ఆమోదిస్తుందా.. లేక జగ్గారెడ్డిని పిలిచి మాట్లాడుతుందా అనే చర్చ నడుస్తోంది. 

Updated Date - 2022-02-20T00:09:39+05:30 IST