జగన్‌ అసమర్థతే పోలవరానికి శాపం!

ABN , First Publish Date - 2022-07-27T06:14:57+05:30 IST

ప్రణాళికా లేమి, సమన్వయ లోపం, జగన్ ప్రభుత్వ అసమర్థత కారణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని కొద్దిరోజుల కిందట పార్లమెంటులో కేంద్రం ప్రభుత్వం...

జగన్‌ అసమర్థతే పోలవరానికి శాపం!

ప్రణాళికా లేమి, సమన్వయ లోపం, జగన్ ప్రభుత్వ అసమర్థత కారణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని కొద్దిరోజుల కిందట పార్లమెంటులో కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మించే చోట ఏర్పడ్డ పెద్ద, పెద్ద గ్యాప్‍లకు, నదీ గర్భం కోతకు ప్రకృతి కారణం కాదని, అది ముమ్మాటికీ మానవ వైఫల్యమే అని హైదరాబాదుకు చెందిన ఐఐటీ నిపుణుల బృందం తేల్చి చెప్పింది. సకాలంలో ఎగువ కాఫర్ డ్యాంలో పడ్డ గుంతలను పూడ్చకపోవడమే అందుకు కారణమని, అసమర్థ ప్రణాళిక వల్లే ఈ ఉపద్రవం వచ్చి పడిందని స్పష్టం చేస్తూ, భారీ వరదల వల్ల ఈ విధ్వంసం జరిగిందనే వాదనను తోచిపుచ్చింది. పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్న కీలక సమయంలో కాంట్రాక్టరును మార్చడం సరిదిద్దుకోలేని తప్పు అని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ – హైదరాబాద్ స్పష్టం చేసింది. దీనిపై సమగ్ర అధ్యయన నివేదికను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి అందజేసింది. ఇప్పటివరకు డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారణాన్ని ప్రకృతిపైన, గత తెలుగుదేశం ప్రభుత్వంపైన నెట్టేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ ప్రభుత్వమూ, మంత్రులూ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? గత మూడేళ్ళుగా ప్రతిపక్ష తెలుగుదేశం పోలవరంపై ఏం చెప్తూ వచ్చిందో, నేడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హైదరాబాద్ అధ్యయన కమిటీ అదే చెప్పింది.


పోలవరం నిర్మాణ పనులకు 2016 డిసెంబరు 30న శంకుస్థాపన జరిగింది. అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని అదే ఏడాదే ప్రారంభించారు. ఎల్అండ్‌టీ, జర్మనీకి చెందిన బావర్‌ కంపెనీలు సంయుక్తంగా 1,440 మీటర్ల పొడవున డయాఫ్రం వాల్‌ను నిర్మించాయి. దీనిని ప్లాస్టిక్‌, కాంక్రీట్‌తో ప్రత్యేక రసాయన విధానంలో నిర్మించారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు పూర్తికానందున డయాఫ్రం వాల్‌ రక్షణ కోసం తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది. కానీ 2019లో జగన్‌ ప్రభుత్వం వచ్చాక వర్షాలు, వరదల సమయంలో ఎలాంటి సాంకేతికపరమైన పటిష్ట చర్యలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన, కాంట్రాక్టరును మార్చి ఆలస్యంగా పనులు చేపట్టడంతో 400 మీటర్ల మేర డయాఫ్రం వాల్‌కు నష్టం వాటిల్లింది. గతంలో నిర్మించిన జెట్ గ్రౌటింగ్ 2020 వరదలకు 300 మీటర్ల మేర ధ్వంసమైంది. దాని సమస్యను పరిష్కరించుకుంటూ, డయాఫ్రం వాల్, దానిపై 30 మీటర్ల ఎత్తున కాఫర్ డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. జూలైలో గోదావరి వరదలు వచ్చే లోగా పనులన్నింటినీ వేగవంతం చేయాల్సిన జగన్ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించింది. ప్రాజెక్టు నిర్మాణంపై బాధ్యత లేకుండా ప్రవర్తించి నేడు తమ తప్పును మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నెట్టేందుకు జగన్‌రెడ్డి, జలవనరుల మంత్రి అంబటి రాంబాబు చాలా ప్రయత్నం చేశారు. కానీ వాస్తవాలు ఏమిటో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ – హైదరాబాద్ అధ్యయన కమిటీ కళ్ళకు కట్టింది.


తెలుగుదేశం ప్రభుత్వం ప్రాజెక్టులో స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాం నిర్మాణాలను సమాంతరంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకొని పని చేసింది. స్పిల్‌వే, కాఫర్ డ్యాంలు నిర్మాణాలు సమాంతరంగా చేసేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, డ్యాం డిజైన్ రివ్యూ కమిటీలు ఆమోదించాయి. 2019 జూన్ నాటికే ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తి చేయాలనేది లక్ష్యంగా పనులు చేసినా 2019 ఏప్రిల్‌లో ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. జగన్‌రెడ్డి అధికారంలోకి రావడంతో రివర్స్ టెండర్లు పిలుస్తామని 2019 మేలో ప్రకటించారు. 2019 అక్టోబరులో టెండర్లు నిర్వహించి 2019 నవంబరులో కొత్త కాంట్రాక్టరుకు అప్పగించారు. మొత్తం ఎగువ కాఫర్ డ్యామ్‌కు 73.94 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని చెయ్యాల్సి ఉండగా, 2019 మే నాటికే అందులో 38.12 లక్షల క్యూబిక్ మీటర్ల పని ఆరు నెలల్లోనే గత ప్రభుత్వం చేసింది. మిగిలిన 35.82 లక్షల క్యూబిక్ మీటర్ల పని కూడా అదే సమయంలో చేయవచ్చు. కాని జగన్ ప్రభుత్వం చెయ్యలేదు.


2020 జూలైలో వరదలు వచ్చే వరకూ ఏడాది సమయం అందుబాటులో ఉంది. దిగువ కాఫర్ డ్యాంలో మిగిలి ఉన్న పని కూడా 25.46 లక్షల క్యూబిక్ మీటర్లే. ఈ రెండూ మట్టితో నిర్మించే డ్యాంలే. జగన్ రెడ్డి ప్రభుత్వం వాటిని పూర్తి చెయ్యకపోవడంతో నేడు ఈ సమస్య ఏర్పడింది. 2019 వరదల్లోనే డయాంఫ్రం వాల్ దెబ్బతిన్న విషయాన్ని 2020 జనవరి 24న పీపీఏ 11వ సమావేశం వరకు చెప్పలేదు. ఆ ఎజెండాలో డయాంఫ్రం వాల్ దెబ్బ తిన్న అంశమే లేదు. 2019 వరదల్లో పోలవరానికి ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని ఆ మినిట్స్ ద్వారా తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ చెప్పిన ఎమర్జెన్సీ మీటింగ్, పీపీఏ చెప్పిన ఆదేశాలు తుంగలో తొక్కి జగన్ జీవో నెం. 67 తీసుకువచ్చి తప్పుడు నిర్ణయాలతో పోలవరం నిర్మాణాన్ని ప్రశ్నార్థకం చేశారు. టెక్నికల్ అర్హతలన్నీ షార్ట్ లిస్ట్ అయిన తర్వాతే ప్రైస్ బిడ్ తెరవాలని స్పష్టమైన ఆదేశాలున్నా, ఇద్దరు టెండర్లు పొల్గొనాలని చెప్పినా, జగన్ బంధువు పీటర్ కమిటీ చెప్పిందని రిజర్వ్ సింగిల్ టెండర్ ఇచ్చారు. తొందరపాటు నిర్ణయా‎లు వద్దని, కాపర్ డ్యాంను కాపాడుకోవాలని, అధికారుల ఆదేశాలు పాటించమని ఎమర్జెన్సీ మీటింగులో రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినప్పటికి జగన్ రెడ్డి దుర్బుద్ధితో నవంబరు 2019నే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఇష్టమైన కాంట్రాక్టరుకి అప్పగించినట్లు జనవరి 2020లో తెలియజేశారు. అంతేకాదు, పోలవరం డ్యాం‎ను బ్యారేజీగా మార్చి రూ.300 కోట్లతో 100 అడుగుల వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించారు. రూ.913కోట్లతో మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తూ బహుళార్ధ సాధక ప్రాజెక్టును బ్యారేజీగా మారుస్తున్నారు. 2019 ఫిబ్రవరిలో టెక్నికల్ అడ్వైజరీ కమిటి రూ.55,548 వేల కోట్లకు ఆమోదం తెలిపితే 31 మంది వైసీపీ ఎంపీలు ఉండి కూడా పోలవరానికి రూ 55,548 కోట్లను ఆమోదించుకోలేకపోయారు. పోలవరం నిర్వాసితుల్ని నట్టేట ముంచారు. తరచూ డిజైన్లలో మార్పులు, వాటికి విరుద్ధంగా నిర్మాణాలు, న్యాయపరమైన  ఇబ్బందులు, పర్యవేక్షక సంస్థల ఆదేశాలు, సిఫారసులను కాంట్రాక్టు సంస్థ అమలు చేయకపోవడం, భూసేకరణ, పునరావాస ప్యాకేజి, ఆర్ అండ్‌ ఆర్‌ పనులు ముందుకు సాగకపోవటం... ఇవే ప్రాజెక్టు జాప్యానికి ప్రధాన కారణాలని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ – హైదరాబాద్ అధ్యయన కమిటీ తేల్చింది. ఇప్పుడు ఎవరి కళ్ళు, చెవులు మూస్తారు జగన్‌రెడ్డి గారు?


నవ్యాంధ్రకి జీవనాడి పోలవరాన్ని ఎట్టి పరిస్థితుల్లోను ఒక నిర్దిష్ట సమయానికి పూర్తి చేయాలనే పవిత్ర సంకల్పంతో ఎన్నోసవాళ్లను ఎదుర్కొంటూ ప్రాజెక్టు పనులను శరవేగంగా కొనసాగించింది తెలుగుదేశం ప్రభుత్వం. 2014 డిసెంబర్ వరకు పోలవరం ప్రాజెక్టు ప్రాంతం అంతా పెద్ద పెద్ద కొండలు, ఖాళీ చెయ్యని ప్రజలు నివసించే గ్రామాలు ఉన్నాయి. ఆ భారీ కొండలను ఎప్పుడు తొలగించాలి? ఆ ఊళ్లను ఎప్పుడు కాళీ చెయ్యాలి? అసలు ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందా? వంటి ప్రశ్నలతో అందరూ నిరుత్సాహంగా ఉన్న వేళ ఆ ప్రశ్నలను, ఆ సవాళ్లను అధిగమించి ప్రాజెక్టు ప్రాంతంలో 2019 ఫిబ్రవరి నాటికి మహాద్భుతం ఆవిష్కృతం అయింది. 2015 జనవరి వరకు తట్ట మట్టి తీయని చోట, బొచ్చెడు కాంక్రీట్ వేయని చోట 2019 మార్చి నాటికి ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. దేశంలో కేంద్రం ప్రకటించిన 16 జాతీయ ప్రాజెక్టులలో శరవేగంగా నిర్మాణం జరిగి 72 శాతం పనులు పూర్తి అయిన ప్రాజెక్టులలో పోలవరం ఒక్కటే. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే 2020 మే నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయి, దాని ఫలాలు రాష్ట్రవ్యాప్తంగా అంది ఉండేవి. జగన్ అధికారంలోకి వచ్చాక 2021 ఏప్రిల్ అని, తర్వాత 2021 డిసెంబర్ 1 అని, తర్వాత మూడో సారి 2022 ఏప్రిల్ అనీ అన్నారు. ఇప్పుడు రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి పోలవరం ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేమని అన్నారు. జగన్ అసమర్థతే పోలవరానికి శాపంగా పరిణమించింది.

దేవినేని ఉమామహేశ్వరావు 

జలవనరుల శాఖ మాజీ మంత్రి

Updated Date - 2022-07-27T06:14:57+05:30 IST