నేతన్న నేస్తంలో జగనన్న కోతలు

ABN , First Publish Date - 2022-08-07T09:43:55+05:30 IST

నేతన్న నేస్తం లబ్ధిదారుల సంఖ్య ఏటా గణనీయంగా తగ్గిపోతోంది.

నేతన్న నేస్తంలో జగనన్న కోతలు

  • నిబంధనలు కఠినతర౨
  • ఏటా తగ్గిపోతున్న లబ్ధిదారులు
  • ప్రతి ఐదుగురిలో ఒక్కరికే లబ్ధి
  • తాజాగా నూలు బిల్లుతోనూ ముడి
  • రాష్ట్రంలో 3.5 లక్షల మంది చేనేత కార్మికులు
  • వారిలో 80 వేల మందికే ‘నేస్తం’ పథకం
  • నేడు చేనేత దినోత్సవం 


అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): నేతన్న నేస్తం  లబ్ధిదారుల సంఖ్య ఏటా గణనీయంగా తగ్గిపోతోంది. పథకంలో సొంత మగ్గం నిబంధనతో మొదలైన చిక్కుముళ్లు వ్యవసాయ భూమి, సొంతిల్లు, విద్యుత్‌ వినియోగం తదితర నిబంధనలకే పరిమితం కాలేదు. తాజాగా నూలు కొనుగోలు బిల్లు అనే కొత్త నిబంధన కూడా చేరింది. రోజంతా కష్టపడి ఒళ్లు హూనం చేసుకున్నా చేనేతలకు పూట గడవడం కష్టమవుతోంది. మరమగ్గాల దెబ్బకు క్రమేణా తగ్గుతోన్న చేనేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించకపోగా పన్నులతో పిండేస్తున్నాయి. చేనేత వస్త్రాన్ని ధరించాలంటూ పిలుపునిస్తోన్న ప్రధాని మోదీ తన పాలనలోనే చేనేత వస్త్రంపై జీఎ్‌సటీ విధించి నేతన్న నడ్డి విరిచారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి చేనేత కార్మికుడికి 24వేలు ఇస్తామంటూ ‘నేతన్న నేస్తం’ పథకాన్ని తీసుకొచ్చిన జగన్‌ కనీసం 30 శాతం మందికి కూడా న్యాయం చేయడం లేదు. ప్రతి ఏటా ఓ కఠిన నిబంధన పెడుతూ లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తూ సొంత పత్రికలో ప్రభుత్వ ఖర్చుతో భారీ ప్రకటనలు ఇస్తూ బటన్‌ నొక్కి వంది మాగధులతో చప్పట్లు కొట్టించుకొంటున్నారు. 2019 డిసెంబరు 21న ధర్మవరంలో పథకాన్ని ప్రారంభించిన జగన్‌ గడిచిన మూడేళ్లలో కొత్తకొత్త నిబంధనలతో లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఐదుగురు చేనేత కార్మికుల్లో ఒక్కరికి మాత్రమే పథకం లబ్ధి చేకూరుతోంది.


 నూలు బిల్లులు ఇస్తేనే పథకం వర్తిస్తుందంటూ తాజాగా పెట్టిన నిబంధనతో లబ్ధిదారుల సంఖ్య ఈ ఏడాది మరో పది శాతానికి పైగా తగ్గే అవకాశం ఉందని చేనేత వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నూలు కొనుగోలు మాస్టర్‌ వీవర్‌ చేస్తాడని, పడుగు, నూలు, జరీ తీసుకుని వస్త్రం తిరిగిచ్చి కూలీ తెచ్చుకునే తాము ఎక్కడి నుంచి బిల్లు తెచ్చివ్వగలమని వాపోతున్నారు. సొసైటీలు సైతం తమకు బిల్లులు ఇవ్వలేవని, ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టడానికే ఈ కొత్త నిబంధన తీసుకొచ్చిందని నిట్టూరుస్తున్నారు. చేనేత వర్గాలకు న్యాయం చేసే ఉద్దేశం జగన్‌కు ఉంటే నవరత్నాల్లో కీలక హామీ అయిన నేతన్న నేస్తం ప్రతి చేనేత కార్మికుడికీ వర్తింప జేయాలని కోరుతున్నారు. నూలు వడికే వారు, రాట్నం తిప్పే వారు, రంగులద్దే వారు అందరూ చేనేత కార్మికులేనని గుర్తు చేస్తున్నారు. చేనేత కార్మికుడి ఆకలి తీర్చే ఉద్దేశం ఉంటే పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూనిఫామ్‌ ఆప్కో నుంచి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నాయకులు చిత్తూరు జిల్లాలో మరమగ్గాలపై తయారు చేసిన లక్షలాది మీటర్ల లివరీ వస్త్రాన్ని సరఫరా చేస్తే చేనేతల సంక్షేమం కోసం ఏర్పాటైన ఆప్కో ద్వారా బిల్లు చెల్లించడం జగన్‌ ప్రభుత్వ దమన నీతికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. 


జీఎస్టీ దెబ్బ...

దేశ చరిత్రలో ఎన్నడూ చేనేత వస్త్రం, ఉత్పత్తులపై పన్ను విధించలేదని చేనేత కార్మికులు చెబుతున్నారు. గాంధీజీ స్వదేశీ నినాదం మొదలు కొని ఈ రోజు దేశమంతా జరుపుకొంటున్న ‘హర్‌ ఘర్‌ తిరంగా’ తయారు చేసింది చేనేత కార్మికుడేనని గుర్తు చేస్తున్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తోన్న పాలకుల కార్యాలయాల్లో నూలు వడుకుతోన్న గాంధీజీ ఫొటో ఉంటుందని, కానీ నరేంద్ర మోదీ మాత్రం చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించి తమ నడ్డి విరిచారని కన్నీరు పెడుతున్నారు. చేనేత పరిశ్రమ కోసం ఏటా వందల కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించే కేంద్ర ప్రభుత్వం పావలా కూడా ఖర్చు చేయడంలేదని విమర్శిస్తున్నారు. అదే సమయంలో జీఎస్టీ మాత్రం ఇటీవల 12శాతానికి పెంచి ఏకంగా చేనేత రంగానికి ఉరితాడు బిగించే ప్రయత్నం చేసిందంటున్నారు. చేనేతల సంక్షేమం కోసం పనిచేసే నేషనల్‌ హ్యాండ్లూమ్‌ బోర్డును సైతం రద్దు చేసి చేనేతను నిర్వీర్యం చేస్తున్న పాలకులపై మరోసారీ స్వదేశీ ఉద్యమం చేస్తే తప్ప చేనేత కుటుంబాల మనుగడ సాధ్యం కాదనే వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో వినియోగించనున్న 20 కోట్ల జెండాలలో ఎన్ని చేనేతవి ఉన్నాయో.? కేంద్ర చేనేత జౌళిశాఖ చెప్పగలదా? అని ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2022-08-07T09:43:55+05:30 IST