జగన్‌ ట్వీట్‌ ‘హాట్‌’!

ABN , First Publish Date - 2021-05-08T08:30:16+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ ‘ట్వీట్‌’ జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ‘అబ్బో... మోదీపై అంత ప్రేమ ఎందుకో’ అంటూ నెటిజన్లు వెబ్‌ వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు

జగన్‌ ట్వీట్‌ ‘హాట్‌’!

జార్ఖండ్‌ సీఎం ట్వీట్‌ను ఖండించిన జగన్‌

ప్రధానిని బలోపేతం చేయాలని సూచన

మోదీకి జగన్‌ మద్దతుపై నెటిజన్ల ధ్వజం

కొంచెం ఎదగండి: ఒడిసా ఎంపీ


న్యూఢిల్లీ, మే 7 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌ ‘ట్వీట్‌’ జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ‘అబ్బో... మోదీపై అంత ప్రేమ ఎందుకో’ అంటూ నెటిజన్లు వెబ్‌ వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గురువారం పలువురు ముఖ్యమంత్రులతో ప్రధాని టెలిఫోన్‌లో మాట్లాడి... కరోనా కట్టడి చర్యలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఈ భేటీ ముగిసిన తర్వాత జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌ ట్విట్టర్‌లో మోదీ వైఖరిని నిరసిస్తూ... ‘‘గౌరవనీయ ప్రధానమంత్రి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆయన తన ‘మన్‌ కీ బాత్‌’ మాత్రమే చెప్పారు. కాస్త ఉపయోగపడే విషయాలు చెప్పి, మేం చెప్పేదీ విని ఉంటే బాగుండేది’’ అని వ్యాఖ్యానించారు.


ఈ ట్వీట్‌ బాగా సంచలనం సృష్టించింది. సహజంగానే దీనిని బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఖండించారు. హేమంత్‌ ట్వీట్‌ సరికాదని ట్విట్టర్‌లోనే తమ వైఖరి చెప్పారు. అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ సైతం హేమంత్‌ వైఖరిని తప్పుపడుతూ ట్వీట్‌ చేశారు. ‘‘మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ, ఒక సోదరుడిగా ఒక విన్నపం చేస్తున్నాను. మన మధ్య ఎటువంటి విభేదాలైనా ఉండొచ్చు. కానీ, ఇలాంటి రాజకీయాలు మన సొంత దేశాన్ని బలహీనపరుస్తాయి. ఇది కొవిడ్‌పై యుద్ధం జరుగుతున్న సమయం. ఇలాంటప్పుడు ఒకరిని వేలెత్తి చూపించే బదులు... మనమంతా కలిసి కొవిడ్‌పై సమర్థంగా యుద్ధం సాగించేలా ప్రధానమంత్రిని బలోపేతం చేయాలి’’ అని హేమంత్‌ సొరేన్‌కు సూచించారు. 


జగన్‌ ట్వీట్‌పై వెంటనే మోదీ వ్యతిరేక శిబిరం నుంచి తీవ్ర స్పందన కనిపించింది. ‘‘వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వంటి ఉన్నతమైన నాయకుడి కుమారుడు సీబీఐ భయంతో మోదీకి తందాన తాన అనడం విచారకరం. కొంచెం ఎదగండి! మీరిప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి’’ అని ఒడిసాకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ సప్తగిరి ఉలాకా ట్వీట్‌ చేశారు. పలువురు నెటిజన్లు కూడా జగన్‌ వైఖరిని తప్పుపట్టారు. ‘‘సారీ జగన్‌ సర్‌! కనీసం జార్ఖండ్‌ సీఎం... ప్రధానికి తన వైఫల్యాలను ఎత్తి చూపి తనకు వెన్నెముక ఉందని నిరూపించుకున్నారు. ప్రతిసారీ మనం మోదీగారి భజన చేయలేం’’ అని శివకుమార్‌ అనేవ్యక్తి స్పందించారు. ‘‘మీరు కరోనా సూపర్‌ స్ర్పెడర్‌ మోదీకి మద్దతు పలుకుతున్నారా? బెంగాల్‌లో మోదీర్యాలీలను మరిచారా?’’ అని రోషన్‌ లాల్‌ బిట్టు అనే వ్యక్తి వ్యాఖ్యానించారు

Updated Date - 2021-05-08T08:30:16+05:30 IST