మాస్క్ లేకుండానే జగన్ తిరుమల పర్యటన

ABN , First Publish Date - 2020-09-23T23:25:05+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్‌తో పలువురు ప్రముఖులు పదే.....

మాస్క్ లేకుండానే జగన్ తిరుమల పర్యటన

హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్‌తో పలువురు ప్రముఖులు పదే పదే చెబుతున్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సోషల్ మీడియాలో, మీడియాలో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయితే అలా కోవిడ్ నిబంధనలను పాటించి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు చెప్పాల్సిన సీఎం జగన్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అందులో ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే జగన్‌ అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో పదుల సంఖ్యలో ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది.


ఇంత జరుగుతున్నప్పటికీ జగన్‌‌లో మాత్రం వీసమెత్తు కూడా మార్పు రాలేదు. సీఎం మాత్రం మాస్క్‌కు దూరంగా ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో జగన్ తిరుమల పర్యటన హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జగన్ నా రూటే సఫరేటు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. జగన్ ఢిల్లీ పర్యటనను ముగించుకుని నేరుగా రేణిగుంట విమానాశ్రానికి వచ్చారు. అక్కడ ఆయనకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, భూమన కరుణాకర్‌రెడ్డిలు ఘన స్వాగతం పలికారు. ‘నవ్విపోదురు మాకేంటి అనుకున్నారో ఏమో’.. కరుణాకర్‌రెడ్డి తప్ప మిలిగిన ఇద్దరూ మాస్క్‌లు పెట్టుకోకుండా ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇక రేణిగుంట నుంచి నేరుగా జగన్ తిరుమల చేరుకున్నారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి... తిరుమలలో కూడా జగన్ ముఖంపై మాస్క్ కనిపించలేదు. 


ప్రజా ప్రతినిధులు జగన్‌ను ప్రసన్నం చేసుకోవడానికి తహతహలాడుతున్నారే తప్ప.. ఎక్కడ కూడా కోవిడ్ నిబంధనలను పాటించలేదు. ఇప్పటికే డిక్లరేషన్ వివాదం జగన్‌‌ను చుట్టుముట్టుతోంది. ఇలాంటి సందర్భంలో కూడా జగన్ తన తీరును మార్చుకోలేదు. అంతేకాదండోయ్ మంగళవారం జగన్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కూడా జగన్ తీరు ఇలాగే ఉంది. కేంద్రమంత్రి అమిత్‌షాను కలిశారు. ఈ భేటీలో అమిత్‌షా, జగన్ లిద్దరూ మాస్క్ పెట్టుకోలేదు. పైగా ఇద్దరు కరచాలనం కూడా చేసుకున్నారు.

Updated Date - 2020-09-23T23:25:05+05:30 IST