Chandrababu సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన.. TDP ముద్ర ఉండకూడదని ఇప్పుడు పేరు మార్చేస్తున్న JAGAN సర్కార్!

ABN , First Publish Date - 2021-08-17T12:43:31+05:30 IST

తెలుగుదేశం ముద్ర కనిపించకూడదనే ఉద్దేశ్యంతోనే

Chandrababu సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన.. TDP ముద్ర ఉండకూడదని ఇప్పుడు పేరు మార్చేస్తున్న JAGAN సర్కార్!

  • గరుడవారధి పేరు మార్చేస్తున్నారు
  • నేటి కౌన్సిల్‌ సమావేశంలో ప్రకటన

తిరుపతి : మూడేళ్లుగా తిరుపతి నగరంలో నిరంతరం చర్చగా ఉన్న గరుడ వారధి పేరు మారబోతోంది. ఎందుకు మారుస్తున్నారో, ఏ పేరు పెట్టబోతున్నారో తెలియకపోయినా మంగళవారం జరగనున్న తిరుపతి కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో వారధికి కొత్త పేరుపెడుతూ తీర్మానం చేయనున్నారు. తిరుపతి స్మార్ట్‌ సిటీ, టీటీడీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మాణం జరుతున్న ఈ వంతెన గరుడవారధిగానే  ప్రాచుర్యం పొందింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి కమిషనర్‌ విజయరామరాజు ప్రత్యేక శ్రద్ధతో 2018లో వారధి ప్రాజెక్టు పట్టాలెక్కింది. రూ. 684 కోట్ల బడ్జెట్‌తో తిరుచానూరు మార్కెట్‌ యార్డు నుంచి కపిలతీర్థం వరకు 7 కి.మీ పొడవుతో ప్లైఓవర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.


ఇంతలో ఏం జరిగిందో..!?

అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలివేటెడ్‌ స్మార్ట్‌ కారిడార్‌ పేరిట వారధికి శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో వారధికి ఏమి పేరు పెడితే బాగుంటుందని విజయరామరాజు మీడియా ప్రతినిధులతో చర్చించారు. రెండు, మూడు పేర్లు కూడా సూచించారు. అందులో గరుడ వారధి పేరును అందరూ ఆమోదించడంతో అప్పటినుంచి ఆ పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. జనబాహుళ్యంలోనూ అదే పేరు నిలిచిపోయింది. వారధి నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్‌ కూడా ‘గరుడ వారధి’ పేరుతోనే నిర్మాణాలు చేపడుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా  గరుడవారధి అనే సంబోధిస్తూ వస్తున్నారు. ఇంతలో ఏమిజరిగిందో ఏమోగాని పేరు మార్చేందుకు కౌన్సిల్‌ సిద్ధమవుతోంది.


తెలుగుదేశం ముద్ర కనిపించకూడదనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారని భావిస్తున్నారు. అయితే కొత్త పేరు ఏమై ఉంటుందో చూడాల్సి ఉంది. ఆధ్యాత్మికత ధ్వనించే పేరు పెడతారా లేక నాయకుల పేరు పెడతారా అనే చర్చ నడుస్తోంది. మంగళవారం జరగనున్న కౌన్సిల్‌ సమావేశంలో తొలి అజెండాగానే దీనిని పేర్కొనడాన్ని బట్టి పేరు మార్పు ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పేరు ప్రకటిస్తారని చెబుతున్నారు.


నేటి సమావేశపు అజెండాలోని మరికొన్ని అంశాలివీ 

- తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా నిలబడినట్టుగా ఉండే గాంధీ విగ్రహాన్ని తీసేసి, కూర్చుని ఉండే గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కౌన్సిల్లో తీర్మానం చేయనున్నారు. 

- గ్రూప్‌ థియేటర్‌ నుంచి తుడా సర్కిల్‌ వరకు గంగమ్మ గుడి ముందునుంచి 60 అడుగుల మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు. 

- నగరంలో ఖాళీగా ఉన్న అన్న క్యాంటీన్లను 11నెలల అద్దె అగ్రిమెంట్‌ ప్రకారం బహిరంగ వేలం వేయాలని అజెండాలో ఉంచారు.

-  ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పక్కన గల కార్పొరేషన్‌ సొంత భవనం (చాణక్య హోటల్‌)ను వాణిజ్య సముదాయంగా మార్చేందుకు ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈవోఐ) పద్ధతి ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న అంశాన్ని అజెండాలో ఉంచారు. 

- రెండు అంతస్తులు లేదా పోర్షన్లు కన్నా ఎక్కువ ఉంటే మంచినీటి కొళాయి మీటరును అమర్చుకోవాలని తీర్మానం చేయనున్నారు. 

Updated Date - 2021-08-17T12:43:31+05:30 IST