మద్యం వ్యాపారంలో జగన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-07-14T08:07:50+05:30 IST

మద్యం వ్యాపారంలో జగన్‌రెడ్డి

మద్యం వ్యాపారంలో జగన్‌రెడ్డి

అదాన్‌ ఆయన బినామీల కంపెనీ

అందుకే ఈ డిస్టిలరీ ఒకటే 40 బ్రాండ్లు సరఫరా

మూడేళ్లలో 2 వేల కోట్ల టర్నోవర్‌

షాపుల నుంచి సీఎంకు నేరుగా కమీషన్‌

ఆ ఆదాయం నెలకు 500 కోట్లు: టీడీపీ


అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో మద్యం అమ్మకాల నుంచి సీఎం జగన్‌రెడ్డి సొంత సంపాదన నెలకు రూ.500 కోట్ల వరకూ ఉంటోంది. రాష్ట్రంలో అమ్ముడయ్యే ప్రతి మద్యం సీసాపైనా తాడేపల్లి ప్యాలెస్‌ కమీషన్‌ వసూలు చేసుకొంటోంది. దీనికోసమే ప్రభుత్వ మద్యం షాపుల్లో కేవలం నగదు తీసుకొని మద్యం అమ్ముతున్నారు’’ అని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. బుధవారం ఇక్కడ ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయ స్వామి విలేకరులతో మాట్లాడారు. ‘‘కూరగాయల షాపుల్లో కూడా ఇవాళ డిజిటల్‌ చెల్లింపులు జరుగుతున్నాయి. మద్యం షాపుల్లో మాత్రం నగదే తీసుకొంటున్నారు. ఏ రోజుకు ఆ రోజు లెక్కగట్టి వచ్చిన నగదు నుంచి తాడేపల్లి ప్యాలెస్‌ వాటా ఆ రోజే పంపేస్తున్నారు. కమీషన్‌ ఇచ్చే బ్రాండ్లు మాత్రమే అమ్ముతున్నారు. ఈ కమీషన్ల ద్వారా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఐదేళ్లలో రూ.25,000 కోట్లు వెనకేసుకొంటున్నారు. ఈ లెక్కలన్నీ తెలిసినా ఈ డబ్బంతా ఎన్నికల్లో తమ కోసం ఖర్చు పెడతారనుకొని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నోరు మూసుకొంటున్నారు. సీఎంకి ఐటీ సలహాదారుగా ఉన్న రాజశేఖరరెడ్డికి, అనిరుధ్‌రెడ్డి అనే తోడల్లుడు ఉన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి అనేక కంపెనీల్లో సహ డైరెక్టర్లు. అదే కుదురులో నుంచి అదాన్‌ అనే డిస్టిలరీ పుట్టింది. ఏ అనుభవం లేకుండా పుట్టిన ఈ డిస్టిలరీ మద్యం అమ్మకాల్లో మూడేళ్లలో రూ.2,000 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఈ ఒక్క డిస్టిలరీ 40 బ్రాండ్ల మద్యం సరఫరా చేస్తోంది. మూడేళ్లలో 68లక్షల కేసుల మద్యం తయారు చేసి  ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా విక్రయించింది. మద్యం విక్రయాలు పర్యవేక్షించే బేవరేజెస్‌ కార్పొరేషన్‌ వద్ద 100 కంపెనీలు నమోదైతే కేవలం 16 కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేస్తున్నారు. కమీషన్లు ఇస్తున్న కంపెనీలు నాణ్యత లేని మద్యం తయారు చేసి ప్రజల మీదకు వదులుతున్నాయి. మేం శాంపిల్‌కు మూడు బ్రాండ్ల మద్యం అంతర్జాతీయ పరీక్షశాలలో పరీక్ష చేయిస్తే వాటిలో విష రసాయనాలు ఉన్నట్లు బయటపడింది. ఇదే విషయం చెబితే వైసీపీ నేతలు మమ్మల్ని తిట్టారు. కానీ ఆ రోజు నుంచి ఆ మూడు బ్రాండ్ల మద్యం విక్రయాలు నిలిపివేశారు. వారు సరఫరా చేసే మద్యంపై మీకు అంత నమ్మకం ఉంటే వాటి అమ్మకాలు ఎందుకు నిలిపివేశారు? వాటిని ఎందుకు పక్కనపెట్టారు’’ అని అనిత ప్రశ్నించారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఆదాయం పెంచుకోవడం ఈ ప్రభుత్వానికి తెలియదని, కేవలం మద్యం అమ్మకాలు పెంచి దానిపైనే బతుకుతోందని ఆమె ఆరోపించారు. ‘‘టీడీపీ హయాంలో ఒక ఏడాదికి మద్యంపై ఆదాయం రూ.6,000 కోట్లు ఉంటే ఇప్పుడు అది రూ.21,000 కోట్లకు పెరిగింది. మద్య నిషేధం తెస్తానని హామీ ఇచ్చి మహిళల ఓట్లు వేయించుకొన్న ప్రబుద్ధుడు సాధించిన ఘనత ఇది’’ అని అనిత విమర్శించారు. మద్యం వ్యాపారంలోకి దిగి, బినామీ కంపెనీలతో మద్యం తయారు చేయించి, ప్రభుత్వ మద్యం షాపుల్లో విక్రయిస్తున్న సీఎం దేశంలో జగన్‌రెడ్డి ఒకరేనని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో అమ్ముడవుతున్న ప్రతి 4మద్యం సీసాల్లో 3 జగన్‌ బినామీ కంపెనీల్లో తయారైనవే. అదాన్‌ డిస్టిలరీని తన సన్నిహితులతో పెట్టించారు. ఎస్పీవై డిస్టిలరీని తమ చేతుల్లోకి తీసుకొని తామే నడుపుకొంటున్నారు. మిగిలిన డిస్టలరీల యాజమాన్యాలను బెదిరించి వాటిలో భాగస్వామ్యం తీసుకొన్నారు. మొత్తం మద్యం వ్యాపారం జగన్‌రెడ్డి కనుసన్నల్లో నడుస్తోంది. ప్రభుత్వ మద్యంషాపుల్లో విక్రయాలు జరిపేవారు వైసీపీ కార్యకర్తలే. ఈ మూడేళ్లలో కమీషన్ల రూపంలో జగన్‌రెడ్డి మద్యంపై రూ.15,000 కోట్లు సంపాదించారు. రూ.60 వేల కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిపారు. ఇవిగాక పదిహేనేళ్లపాటు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరుగుతూనే ఉంటాయని లిఖితపూర్వక హామీ ఇచ్చి ఆ ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.60,000 కోట్ల అప్పులు తెచ్చారు. మామూలుగా మందు బాబులు ఇళ్లలో సామాన్లు తాకట్టు పెట్టి తాగుతుంటారు. మందుబాబులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది’’ అని ఏలూరి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మద్యం దందాపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే అన్నీ నిరూపించడానికి సిద్ధమని ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. 

Updated Date - 2022-07-14T08:07:50+05:30 IST