రాజమంఢ్రి: ఇసుక విదానం ద్వారా మరోసారి ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏడాదికి ఒక ఇసుక విదానం అమలు చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. ప్రభుత్వం ఇసుకను ప్రైవేట్ సంస్థకు అప్పగించటం వల్ల ఇతర రాష్ట్రాలకు దోచిపెడుతోందన్నారు. జేపీ ఇండస్ట్రీస్‌ను ఏవిధంగా ఎంపిక చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ సంస్థకు ఇసుకను అప్పగించిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ప్రజలకు ఇసుక ఎలా సరాఫరా చేస్తారో శ్వేతపత్రం ప్రకటించాలని మనోహర్ కోరారు.