చంద్రబాబుకు ఎదురు పడకూడదనేనా?
ఈ కార్యక్రమానికి గవర్నర్, మాజీ సీఎం
నేడు ఢిల్లీకి సీఎం.. రేపు మోదీ, షాతో భేటీ?
అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృతోత్సవ్’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దూరంగా ఉండనున్నారు. శనివారం ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నా ఇదే రోజున అక్కడ జరిగే ఈ కార్యక్రమానికి మాత్రం హాజరు కాబోవడం లేదు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు తాడేపల్లి నుంచి బయల్దేరి.. 3.40కి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జరిగే స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహానికి హాజరవుతారు. సాయంత్రం 5.20గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకుంటారు. వాస్తవానికి శనివారం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్‌లో ఆజాదీ కా అమృతోత్సవ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరవుతున్నారు. చంద్రబాబుకు ఎదురుపడకూదనే సీఎం దానికి వెళ్లడం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పైగా శనివారం సీఎం షెడ్యూల్‌లో ఆజాదీ కా అమృతోత్సవ్ కంటే విశిష్టమైన కార్యక్రమాలేవీ లేవని చెబుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30కి జగన్ రాష్ట్రపతి భవన్‌కు వెళ్తారు. 9.45నుంచి 4,30 వరకు అక్కడ జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగుపయనమవుతారు. రాత్రి 8.15కి తాడేపల్లి చేరుకుంటారు. కాగా.. ఆదివారం హస్తినలో ఆయన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.