నా హత్యకు జగన్‌ కుట్ర

ABN , First Publish Date - 2022-07-07T08:02:40+05:30 IST

నా హత్యకు జగన్‌ కుట్ర

నా హత్యకు జగన్‌ కుట్ర

ఎత్తుకెళ్లి చంపాలన్నది వాళ్ల ప్రణాళిక 

దొరికితే పోలీసులమని బుకాయింపు

సహకరించిన స్టీఫెన్‌ రవీంద్ర 

ప్రతిపక్ష నేతలు స్పందించాలి

ఎంపీ రఘురామరాజు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఐపీఎస్‌ అధికా రి సునీల్‌ కుమార్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం జగన్మోహన్‌రెడ్డి, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్రతో కలిసి తనను హత్య చేయడానికి కుట్రపన్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. తనను ఎత్తుకెళ్లి చంపడానికి పథకరచన చేశారని చెప్పారు. హైదరాబాద్‌లోని తన నివా సం వద్ద రెక్కీ నిర్వహించినవారు దొంగ పోలీసులని, దొరికితే పోలీసులమని చెప్పి బుకాయించి... స్టీఫెన్‌ రవీంద్ర సహకారంతో తిరిగి తనపైనే కేసులను నమోదుచేశారని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు దీనిపై లేఖ రాశానని, ఆయనపై విశ్వాసం ఉందన్నారు. మకాం ఢిల్లీలో పెట్టినప్పటికీ సీఎం కేసీఆర్‌ పరిపాలనపై నమ్మకంతోనే అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వెళ్లి వస్తున్నానని వివరించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. తన పట్ల పోలీసుల వ్యవహార శైలిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు. రెక్కీ నిర్వహించిన వాహనం గురించి తెలుసుకునేందుకు సీసీ ఫుటేజ్‌ కోరగా, గచ్చిబౌలి ఇన్స్‌పెక్టర్‌ సురేశ్‌ ఇవ్వవద్దని చెప్పారని ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ తనకు తెలిపారని వివరించారు. వీఐపీ ప్రాణరక్షణకు భద్రత కల్పించాల్సింది పోయి సీసీ ఫుటేజ్‌ ఇవ్వద్దని ఒక ఇన్‌స్పెక్టర్‌ వారించడం ఏమిటన్నారు. తన ఇంటి వద్ద తచ్చాడుతున్న అనుమానాస్పద వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగిస్తే కేసు నమోదు చేయడం మాని.. ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో తమపైనే కేసు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. సైబరాబాద్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశామని, స్టీఫెన్‌ రవీంద్ర కనుసన్నలలో గచ్చిబౌలి సీఐ సురేశ్‌ కుమార్‌ ఈ కేసు నమోదు చేశారని ఆరోపించారు. ‘‘సీఎం జగన్మోహన్‌ రెడ్డ్డి, స్టీఫెన్‌ రవీంద్రలు చిన్ననాటి స్నేహితులు. రవీంద్ర గతంలో సీమలో పనిచేశారు. ఆయన ను ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమించాలని జగన్‌ శతవిధాల ప్రయత్నించారు. కానీ నిబంధనలు అంగీకరించకపోవడంతో విరమించుకున్నారు. ఇప్పుడు రవీంద్ర సహకారంతో, ఏపీ పోలీసుల అండదండలతో నన్ను చంపడానికి ప్రణాళిక రూ పొందించారు. ‘‘ఈ నరహంతకుడు... పోలీసు హంతకులతో కలిసి నాకేదైన హాని త ల పెడితే... ఏమి చేయాలన్నది ప్రజలే నిర్ణయించుకోవాలని కోరుతున్నా’’ అని జగన్‌ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఇతర విపక్ష నేతలు, తమ పార్టీలోని ప్రజాస్వామ్యవాదులు జగన్‌ ప్రభుత్వ అరాచకాలను ఖండించాలని పిలుపునిచ్చారు. 


స్కూళ్లు కనబడటం లేదని పిల్లల గగ్గోలు

తమ స్కూలు కనబడటంలేదని విద్యార్థులకు గగ్గోలు పెడుతున్నారని రఘురామకృష్ణంరాజు అన్నారు. టీచర్లకు జీతాలు ఇవ్వలేక వారి పోస్టులను కుదిస్తున్నారని విమర్శించారు. చిన్నారులు చదువుకుంటేనే దేశం భవిష్యత్తు బాగుంటుందని ప్రవచనాలు చెప్పే సీఎం జగన్‌.. ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా స్కూళ్లు, టీచర్‌ పోస్టులను ఎత్తివేయడం ఏమిటని ప్రశ్నించారు. కాగా, గత మూడేళ్లలో జగన్‌ మీడియా ‘సాక్షి’ దినపత్రికకు దాదాపు రూ. 300 కోట్ల విలువైన పత్రికా ప్రకటనలను ఇచ్చారని, జిల్లా ఎడిషన్‌లలో ప్రకటనలు వీటికి అదనమని తెలిపారు. ప్రభుత్వంతో ఏదైనా పని చేయించుకున్నవారు నేరుగా డబ్బులు ఇవ్వలేకపోతే, వారితో జిల్లా ఎడిషన్లలో ప్రకటనలు ఇప్పించుకొని డబ్బులు సంపాదించారని చెప్పారు. ఇక ఇప్పుడు 3 లక్షల మంది వలంటీర్లకు రూ.200 చొప్పున నిధులను కేటాయించి, ఆ నిధుల ద్వారా ‘సాక్షి’ కొనుగోలు చేయించేలా ప్రణాళిక వేశారని వివరించారు.

Updated Date - 2022-07-07T08:02:40+05:30 IST