జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జలకళ: మంత్రి

ABN , First Publish Date - 2020-07-14T03:38:21+05:30 IST

ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో జలకళ సంతరించుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. కరువు ప్రాంతమైన

జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జలకళ: మంత్రి

కాకినాడ: ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో జలకళ సంతరించుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. కరువు ప్రాంతమైన అనంతపురంలోనూ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కాంట్రాక్టర్లకు కాసులు కురిపించాలని చేసిన నిర్వాకం వల్ల గోదావరి వరదలు వస్తున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం వల్ల గోదావరి బ్యాక్ వాటర్స్‌తో వరద ప్రభావం ఎక్కువైందని చెప్పారు. ఈ ఏడాది వర ముంపు వస్తే తీసుకునే చర్యలపై ఇప్పటికే అధికారులకు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి దిశానిర్దేశం చేశారని చెప్పారు. గత ఏడాది లేని సచివాలయాలు, సిబ్బంది, 104, 108 వాహనాలు, జనరేటర్లు ఇప్పుడు ఏర్పాటు చేశామని చెప్పారు. గత ఏడాది వరదల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. తొమ్మిది మీటర్లున్న విద్యుత్ స్తంభాలను 11.5 మీటర్ల ఎత్తుకు పెంచటం జరిగిందని మంత్రి వివరించారు. గత ఏడాది వరద అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రజలను భయబ్రాంతులకు గురయ్యేలా టీడీపీ అసత్యాలను ప్రచారం చేస్తోందిన మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. 


చంద్రబాబు అబద్దాల ఫ్యాక్టరీకి యనమల అప్రకటిత అధ్యక్షుడు అని మంత్రి విమర్శలు గుప్పించారు. సంక్షేమ పథకాలను రద్దు చేయడం వల్ల ప్రజలకు రూ.18120 కోట్లు నష్టపోయారని అంటున్నారని, యనమలకు ఈ తప్పుడు లెక్కలు ఎవరిచ్చారని మంత్రి ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3.9 కోట్ల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు రూ.42,603 కోట్ల విలువైన సంక్షేమ పథకాలు అందించామని కన్నబాబు వివరించారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి ఎవరి సిఫారసులు అవసరం లేకుండానే పథకాలు అందించామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 21 పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. పథకాలు తొలగించామని యనమల మాట్లాడటం సరికాదన్నారు. ‘మేం బురద జల్లుతాం.. మీరు శుభ్రం చేసుకోండి’  అనే పథకాన్ని టీడీపీ నేతలు ప్రవేశపెట్టినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 3 లక్షల ఉద్యోగాలు తొలగించామని కళా వెంకట్రావు అన్నారని, ఎవరిని తొలగించామో ఆయన చూపించాలని మంత్రి కన్నబాబు సవాల్ విసిరారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని మంత్రి ఉద్ఘాటించారు.

Updated Date - 2020-07-14T03:38:21+05:30 IST