AP Govt: అప్పులపై జగన్‌ సర్కార్‌కు కేంద్రం హెచ్చరిక

ABN , First Publish Date - 2022-07-25T21:47:25+05:30 IST

అప్పులపై జగన్‌ (Jagan) సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం (Central Govt) హెచ్చరించింది. ప్రత్యేక కార్పొరేషన్‌ల ద్వారా తీసుకునే రుణాలను ప్రభుత్వ అప్పులుగానే

AP Govt: అప్పులపై జగన్‌ సర్కార్‌కు కేంద్రం హెచ్చరిక

ఢిల్లీ: అప్పులపై జగన్‌ (Jagan) సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం (Central Govt) హెచ్చరించింది. ప్రత్యేక కార్పొరేషన్‌ల ద్వారా తీసుకునే రుణాలను ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని తెలిపింది. టాక్స్‌లు, సెస్‌లను తనాఖాపెట్టి తెచ్చే అప్పులను కూడా.. రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగానే పరిగణిస్తామని లోక్‌సభలో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ (Union Minister Nirmala Sitharaman) వెల్లడించారు. రాష్ట్రం అప్పులు చేయడానికి ఒక పద్ధతి ఉంది. సొంత ఆదాయానికి మించకుండా ఖర్చులు ఉండాలి. అభివృద్ధి కార్యక్రమాల కోసం అప్పులు చేయవచ్చు. అది కూడా... రాష్ట్రాల ఆర్థిక వనరులు, తిరిగి చెల్లించగల స్తోమత ఆధారంగా కేంద్రం అనుమతిస్తుంది. కానీ... జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఖజానాకు వచ్చే ఆదాయం సరిపోవడంలేదు. కేంద్రం ఇచ్చిన అప్పుల పరిమితి కూడా సరిపోవడం లేదు. అందుకే... కేంద్రానికి తెలియకుండా దొంగదారిలో అప్పులు తేవడంపై రాష్ట్రం దృష్టి సారించింది. ఈ విషయంలో ఏకంగా పీహెచ్‌డీ చేసేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ) అనే ఒక తప్పుడు మోడల్‌ను సృష్టించింది. కనీసం పైసా కూడా ఆదాయం లేని ఒక కార్పొరేషన్‌ను పేపర్లపై పుట్టించి... మద్యంపై విధించిన అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ పన్నును ఆ కార్పొరేషన్‌కు మళ్లించారు. దానినే కార్పొరేషన్‌ ఆదాయంగా చూపి రూ.23,200 కోట్ల అప్పులు తెచ్చారు.


ప్రభుత్వం కార్పొరేషన్లకు గ్యారెంటీలు ఇచ్చి అప్పులు తెచ్చుకుని వాడుకోవడం జగన్‌ ప్రభుత్వం విధానంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ గ్యారెంటీలు చూసి కార్పొరేషన్లకు అప్పులివ్వొద్దని అటు కేంద్రం, ఇటు ఆర్‌బీఐ (RBI) బ్యాంకులను హెచ్చరించడంతో ఆ మోడల్‌కి బ్రేక్‌ పడింది. అందుకే ప్రభుత్వం ఖజానా ఆదాయం మళ్లించే మోడల్స్‌ను తెచ్చారు. గ్యారెంటీ అప్పులు, నాన్‌ గ్యారెంటీ అప్పులు అన్నీ కలిసి రాష్ట్రంలోని కార్పొరేషన్లకు బ్యాంకులు ఇప్పటికే రూ.2.5 లక్షల కోట్లు ఇచ్చాయి. ఇందులో సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌, ఏపీ టిడ్కో, విద్యుత్‌ రంగ సంస్థలు ప్రధానం. సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ (Civil Supplies Corporation) నెత్తిన రూ.42,000 కోట్ల అప్పు ఉంది. అలాగే, టిడ్కో పేరుతో కూడా రూ.7,000 కోట్ల వరకు ప్రభుత్వం అప్పు తెచ్చింది. విద్యుత్‌ రంగ సంస్థలది మరో సమస్య. ఆ సంస్థలకు ప్రధాన వినియోగదారు ప్రభుత్వమే. సబ్సిడీ కరెంటు, వ్యవసాయానికి ఉచిత కరెంటు అంటూ ఆ సంస్థలకు ప్రభుత్వం ఏడాదికి దాదాపు రూ.8,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకు బాకీ పడుతోంది. ఇందులో ఒక్కపైసా కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. ఆ బకాయిలు తీర్చడం కోసం విద్యుత్‌ రంగ సంస్థలు నాన్‌ గ్యారెంటీ అప్పులు చేస్తున్నాయి. ఇందుకోసం వీధుల్లో ఉండే కరెంటు లైన్లు, థర్మల్‌ స్టేషన్లు, సబ్‌ స్టేషన్లు, ప్లాంట్లు, ఇతర ఆస్తులు తనఖా పెట్టి అప్పులు చేస్తున్నాయి. వీటిని చెల్లించే భారం కూడా ప్రభుత్వానిదే.  పైగా ఈ గ్యారంటీ అప్పులను 2020 మార్చి నుంచి ప్రభుత్వం అప్‌డేట్‌ చేయడం లేదు. అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వ్యవహారమైతే మరీ దారుణంగా ఉంది. భూముల తనఖాకు, వేలంలో కొనడానికి ఎవరూ ముందుకురాకపోవడంతో నేరుగా ఆ భూములు అమ్మడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

Updated Date - 2022-07-25T21:47:25+05:30 IST