వ్యాక్సిన్‌కు వేళాయే..

ABN , First Publish Date - 2021-01-15T05:30:00+05:30 IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 21 సెంటర్లలో శనివారం కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎంజీఎం ఆస్పత్రిలోని వ్యాక్సిన్‌ సెంటర్‌ను తొలుత ఉదయం 10.30 గంటలకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించనున్నారు.

వ్యాక్సిన్‌కు వేళాయే..

నేడు కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి
అప్రమత్తమైన వైద్య యంత్రాంగం
అందుబాటులో 6,830 డోసులు
ఎంజీఎం ఆస్పత్రిలో ప్రారంభించనున్న మంత్రి ఎర్రబెల్లి

హన్మకొండ, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 21 సెంటర్లలో  శనివారం కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎంజీఎం ఆస్పత్రిలోని వ్యాక్సిన్‌ సెంటర్‌ను తొలుత ఉదయం 10.30 గంటలకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించనున్నారు. అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతుతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్‌, నన్నపునేని నరేందర్‌ హాజరవుతారు. ఆ తర్వాత మంత్రి ఉదయం 11.30గంటలకు వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రిలో, మధ్యాహ్నం 12 గంటలకు తొర్రూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, 12.30 గంటలకు పాలకుర్తిలోని యూపీహెచ్‌సీలో ప్రారంభిస్తారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవత్‌ రాథోడ్‌ ప్రారంభిస్తారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, పరకాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వర్ధన్నపేటలో ఎమ్మెల్యే అరూరి రమేష్‌ ప్రారంభిస్తారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పీహెచ్‌సీలో జడ్పీ చైర్‌పర్సన్‌ శ్రీహర్షిణి, జాయింట్‌ కలెక్టర్‌ కూరాకుల స్వర్ణలత, ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ కృష్ణఆదిత్య ప్రారంభిస్తారు.

తొలి రోజు
వ్యాక్సిన్‌ తొలిరోజు శనివారం ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 21 కేంద్రాల్లో 630 మందికి వ్యాక్సిన్‌ ఇస్తారు. నాలుగు జిల్లా ఆస్పత్రులు, రెండు సీఎ్‌ససీలు, 11 పీహెచ్‌సీలు, 4 ప్రైవేట్‌ ఆస్పత్రులు వీటిలో ఉన్నాయి. ఒక్కో సెంటర్‌లో 30మందికి చొప్పున టీకాలు వేస్తారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఎంజీఎం ఆస్పత్రితో పాటు కమలాపూర్‌  పీహెచ్‌సీ, ములుగు రోడ్డులోని అజర, హన్మకొండలోని మ్యాక్స్‌కేర్‌, జయ, రోహిణి ఆస్పత్రుల్లోని సెంటర్లలో, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో నర్సంపేట ఏరియా ఆస్పత్రి, వర్ధన్నపేట, పరకాల సివిల్‌ ఆస్పత్రులు, ఆత్మకూర్‌ పీహెచ్‌సీలో, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రం ఆస్పత్రి, మహదేవ్‌పూర్‌, చిట్యాల సీహెచ్‌సీలలో, మహబూబాబాద్‌ జిల్లాలో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి, తొర్రూరు, కంబాలపల్లి, డోర్నకల్‌ పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్లు ఇస్తారు. అలాగే జనగామ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి, పాలకుర్తి పీహెచ్‌సీలో, ములుగు జిల్లాలో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి, ఏటూరునాగారంలోని సీహెచ్‌సీలలో వ్యాక్సిన్‌ ఇస్తారు.

6,830 డోసులు
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయడానికి మొత్తం 683 వాయిల్స్‌ అనగా 6,830 డోసులు అందాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు 58 వాయిల్స్‌ అనగా.. 2,640 డోసులు, వరంగల్‌ రూరల్‌ జిల్లాకు 58 వాయిల్స్‌ అనగా.. 580 డోసులు, మహబూబాబాద్‌ జిల్లాకు 172 వాయిల్స్‌ అనగా.. 1,720 డోసులు, జనగామ జిల్లాకు 83వాయిల్స్‌ అనగా.. 830 డోసులు భూపాలపల్లి జిల్లాకు 50 వాయిల్స్‌ అనగా.. 500 డోసులు, ములుగు జిల్లాకు 56 వాయి ల్స్‌ అనగా.. 560 డోసులు సరఫరా అయ్యాయి.

వ్యాక్సిన్‌ ముందు..
కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రంలోకి ప్రవేశించిన లబ్ధిదారుడిని అక్కడి డాక్టర్లు మొదట శరీర ఉష్ణోగ్రతను పరిశీలిస్తారు. జ్వరం ఉన్నట్టు తేలితే లోపలికి అనుమతించరు. కొవిడ్‌ పాజిటివ్‌ ఉన్నా, లేదా ఆ లక్షణాలు కనిపించినా టీకా ఇవ్వరు. తొలి డోసు పొందాక లబ్ధిదారుడు 2వ డోసు ఎప్పుడు పొందాలో ఆయన మొబైల్‌ ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. రెండో డోసు పూర్తయ్యాక కొవిడ్‌ టీకా పొందినట్లుగా మొబైల్‌ ఫోన్‌కు ధ్రువపత్రం అందుతుంది. ఎవరికైనా వ్యాక్సిన్‌తో అనారోగ్య సమస్యలు తలెత్తితే తక్షణమే చికిత్స అందించడానికి ఉమ్మడి జిల్లాలోని ప్రధాన అస్పత్రుల్లో ఐసీయూ పడకలను సిద్ధం చేసి ఉంచారు.

కరోనా వ్యాక్సినేషన్‌ కోసం అధునాతన సిరంజీలను వినియోగిస్తారు. ఒకసారి టీకా ఇచ్చిన తర్వాత ఆ సిరంజీని రెండో సారి వాడరు. కరోనా టీకా సమయంలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తే సూచనలు, సలహాలు ఇవ్వడానికి రాష్ట్రస్థాయిలో కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

విజయవంతం చేద్దాం: ఎర్రబెల్లి
కరోనా భూతాన్ని తరమికొట్టాలనే సంకల్పంతో ప్రభుత్వం కోవాక్సిన్‌ కార్యక్రమాన్ని పెద్దఎత్తున అమలు చేస్తున్నదని, ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు పెద్దఎత్తున భాగస్వాములు విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి రోజు 139 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రెండో దశలో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తారని తెలిపారు.

Updated Date - 2021-01-15T05:30:00+05:30 IST