ఐటీలో రాష్ట్రం మేటి

ABN , First Publish Date - 2020-05-22T08:42:05+05:30 IST

సమాచార సాంకేతిక (ఐటీ) రంగంలో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. దేశంలోనే ఐటీ దిగ్గజ రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది.

ఐటీలో రాష్ట్రం మేటి

ఐటీ ఎగుమతులు రూ.1.28 లక్షల కోట్లు

గత ఏడాదికంటే 17.93% వృద్ధి

జాతీయ సగటు 8.09% కంటే రెట్టింపు

ఉద్యోగాల కల్పనలో 7.20% వృద్ధి

దేశీయ ఎగుమతుల్లో 23.53% రాష్ట్రానివే

పెట్టుబడుల గమ్యస్థానం రాష్ట్రమేనన్న కేసీఆర్‌

సీఎంతో ఐటీ మంత్రి కేటీఆర్‌ భేటీ


హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): సమాచార సాంకేతిక (ఐటీ) రంగంలో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. దేశంలోనే ఐటీ దిగ్గజ రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. ఏకంగా రూ.1.28 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు చేసి దేశానికే తలమానికంగా నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 17.93% ఎగుమతుల వృద్ధిని సాధించి ఐటీ పెట్టుబడులకు విశ్వసనీయమైన గమ్యస్థానంగా మారింది. ఈ మేరకు ఐటీ రంగంలో సాధించిన వృద్ధి వివరాలను గురువారంరాష్ట్ర ఐటీ శాఖ వెల్లడించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, ముఖ్యకార్యద్శి జయేశ్‌ రంజన్‌.. సీఎం కేసీఆర్‌ను కలిసి ఐటీ ప్రగతి గురించి వివరించారు. వివరాలను పత్రికలకు విడుదల చేశారు.  2018-19లో రాష్ట్రం నుంచి రూ.1,09,219 కోట్ల ఐటీ ఎగుమతులు చేయగా, 2019-20లో రూ.1,28,807 కోట్ల ఎగుమతులు సాధించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అంటే ఇది 17.93% వృద్ధిగా నమోదైందని పేర్కొంది.


ఇది జాతీయ సగటు వృద్ధి రేటు 8.09% కంటే ఎక్కువ. రెట్టింపు స్థాయిలో రాష్ట్ర ఎగుమతులు నమోదయ్యాయి. దేశ ఐటీ ఎగుమతులు 2018-19లో రూ.10,29,248 కోట్లు కాగా, 2019-20లో రూ.11,12,496 కోట్లు. ఉద్యోగాల కల్పనలోనూ రాష్ట్రం వృద్ధి సాధించింది. 2018-19లో 5,43,033 మందికి ఉద్యోగాలు కల్పించగా, 2019-20లో 5,82,126 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇది 7.20% వృద్ధిగా నమోదైంది. జాతీయ సగటు వృద్ధి 4.93% కంటే రాష్ట్ర వృద్ధి ఎక్కువ. జాతీయ స్థాయిలో 2018-19లో 41,58,000 మందికి ఉద్యోగాల కల్పన నమోదు కాగా, 2019-20లో 43,63,000 మందికి ఉద్యోగాలు కల్పించారు. కాగా.. దేశం మొత్తం ఐటీ ఎగుమతుల్లో రాష్ట్ర వాటానే 23.53 శాతంగా నమోదైంది. రాష్ట్ర ఎగుమతుల వాటా 2018-19లో ఉన్న 10.61% నుంచి 2019-20లో 11.58 శాతానికి పెరిగింది. ఉద్యోగాల కల్పన వాటా కూడా 13.06% నుంచి 13.34 శాతానికి పెరిగింది. 



ఐటీ శాఖ కృషి భేష్‌

ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ విశేషమైన వృద్ధిని సాధించడంపై సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖను అభినందించారు. ‘‘ఇలాంటి వృద్ధి రానున్న కాలంలో ఐటీ పెట్టుబడులకు రాష్ట్రమే విశ్వసనీయ గమ్యస్థానంగా మారనుందనడాన్ని ఇది సూచిస్తుంది’’అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌ను దృష్టిలో పెట్టుకుని ఐటీ రంగానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.  


ఐటీ రంగం బయటపడుతుంది: కేటీఆర్‌

కొవిడ్‌-19 నుంచి హైదరాబాద్‌ ఐటీ రంగం బయటపడుతుందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఇక్కడి పర్యావరణహిత చర్యల కారణంగా ఐటీ రంగం కరోనా ముప్పు నుంచి తేరుకుంటుందని చెప్పారు. ఇప్పటికే చాలా మంది పెట్టుబడిదారులు ఐటీ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారని, త్వరలో సంబంధింత వివరాలు వెల్లడిస్తామన్నారు. 2019-20లో సాధించిన ఐటీ విజయాలకు సంబంధించిన నివేదికను జూన్‌ 1న ఆవిష్కరిస్తామని చెప్పారు. ఆటంకాలు లేకుండా ప్రగతి నివేదికలు ఇవ్వడం ఇది ఆరో సంవత్సరమని తెలిపారు. కాగా.. ఐటీ రంగం అభివృద్ధికి ‘ఐటీ4టీఎస్‌’ ప్రచారాన్ని కొనసాగిస్తున్నామని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ వివరించారు. కరోనా కట్టడికి ఐటీ కంపెనీలు, ఉద్యోగులు పలు రకాలుగా సహకరించారని తెలిపారు. పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు అందించారన్నారు. ఐటీ రంగ ఉద్యోగులు దాదాపు రూ.70 కోట్లను సమీకరించగలిగారని ఆయన చెప్పారు.

Updated Date - 2020-05-22T08:42:05+05:30 IST