వ్యభిచారాన్ని ‘వృత్తి’ అనడం అన్యాయం!

ABN , First Publish Date - 2022-06-09T06:07:28+05:30 IST

ఇటీవల సుప్రీమ్ కోర్టు, వ్యభిచార సమస్య గురించి ఆదేశాల వంటి కొన్ని సూచనలు చేసింది...

వ్యభిచారాన్ని ‘వృత్తి’ అనడం అన్యాయం!

ఇటీవల సుప్రీమ్ కోర్టు, వ్యభిచార సమస్య గురించి ఆదేశాల వంటి కొన్ని సూచనలు చేసింది.


ఆ సూచనలు: (1) వ్యభిచారాన్ని అన్ని వృత్తుల లాగే ఒక వృత్తిగా గుర్తించాలి. (2) ఇష్టపూర్వకంగా వ్యభిచారం చేసే వారిని పోలీసులు, బాధించకూడదు. ఎందుకంటే, వేశ్యా గృహం (బ్రోతల్) నడపడం చట్టవ్యతిరేకం కానీ, ఇష్టపూర్వకంగా వ్యభిచారం చేయడం చట్టవిరుద్ధం కాదు కాబట్టి. (3) వ్యభిచార స్త్రీలకూ, వారి పిల్లలకూ కూడా చట్టపరమైన రక్షణ ఉండాలి. (4) పత్రికలూ, టీవీలూ, వ్యభిచార స్త్రీల పేర్లనూ, వారి ఫొటోలనూ బైట పెట్టకూడదు. (5) వ్యభిచార వృత్తి వారిని రకరకాల సంస్కరణలతో మార్చాలనుకోవడం, పురుషుల పెత్తందారీ నిర్ణయాలే. ఇటువంటి సూచనలే అన్నీ! ఈ సూచనలన్నిటి మీదా సవాలక్ష ప్రశ్నలు రావాలి, వస్తాయి.


మన ప్రశ్నలు: అసలు వ్యభిచారం అంటే, ఎంత నీచ సంబంధమో, సుప్రీం కోర్టు గ్రహించలేదా? గ్రహించి కూడా, దాన్ని చట్టబద్ధం చేయదలిచిందా? అసలు, వ్యభిచారమే బ్రతుకు తెరువుగా ఎందుకు తయారవుతుంది? బ్రతకడానికి గతి లేని పరిస్తితి వల్ల కాదా? ఈ కారణాన్ని గ్రహిస్తే, బ్రతకడానికి ఒక మంచి మార్గాన్ని సుప్రీం కోర్టు కూడా చూపించ లేదా?


పోలీసులకు నీతి చెప్పబోయింది కోర్టు, వ్యభిచారులపై కేసులు పెట్టవద్దని. చట్టమే లేనప్పుడు, కేసులు లేకుండా పోలీసులు మాత్రం ఏమి చెయ్యగలరు?


అసలు ‘వృత్తి’ అనే మాట ఏ సందర్భానికి వర్తిస్తుంది? చాకలి శ్రమ జరగడమే చాకలి వృత్తి. క్షవరం శ్రమ జరగడం, క్షవరం వృత్తి. కమ్మరీ, కుమ్మరీ, నేతా, కుట్టూ, వడ్రంగం, చదువు చెప్పడం, వైద్యమూ వంటి ఒక్కో శ్రమా ఒక్కో వృత్తి. ‘వృత్తి అవ్వాలంటే, ఆ మనిషి చేసేది శ్రమ అవ్వాలి. స్త్రీ–పురుషుల శరీర సంబంధాల్ని శ్రమలుగా పోల్చడమా న్యాయాధిపతులు కనిపెట్టింది? కుటుంబాల్లో భార్యా భర్తలు కూడా తమ దేహ సంబంధాల్ని ‘శ్రమలు’ గానే భావిస్తూ, వాటిని వృత్తులుగా నిర్వహించ గలరా? దేహాల సంబంధాన్ని ‘వర్క్’ అనవచ్చా? నీళ్ళు తాగడం శ్రమ అవుతుందా? రెండు ఆడా–మగా జంతువుల సంబంధం ‘వర్క్’ అవుతుందా?


వ్యభిచారంలో వ్యభిచారిణే కాదు, విటులు కూడా వుంటారు. ఈ విటులు వ్యభిచారుల దేహాల్ని చెడిపోయిన దేహాలుగా భావిస్తూనే, వాటిని ఉపయోగిస్తారు. ఈ విటుల వ్యభిచారం గురించి సుప్రీం ఏమి చెపుతుంది? ‘అది ఆ వ్యక్తి ఇష్టం’ అనే కదా?


వ్యభిచారం చెయ్యడం తప్పు కాదుగానీ, ఒక వేశ్యా గృహం నిర్వహించడం నేరం అట! ఎందుకు నేరం కావాలి? వైద్య వృత్తిలో వున్న డాక్టర్లు, స్వంతంగా ఒక క్లినిక్ పెట్టుకోలేని స్తితిలో వుంటే, వారు ఒక ఆసుపత్రిలో చేరి, తమ వృత్తిని ఇష్టపూర్వకంగా సాగిస్తారు కదా? అలాగే, వ్యభిచారిణులు ఒక వ్యభిచార గృహం నడిపే యజమానితో ఒక ఒప్పందం కుదుర్చుకుంటే, ఆ గృహ నిర్వాహకుడిది నేరం ఎలా అవుతుంది?


వ్యభిచారాన్ని వృత్తిగా గుర్తించడం ఈనాడు సరికొత్త భావన కాదు. సంస్కరణవాద సంఘాలు, వ్యభిచారాన్ని వృత్తిగా గుర్తించాలని ఏనాటి నించో అడుగుతున్నాయి. ఈ సంఘాలు, మూల కారణాల గురించి నోరెత్తవు. మూల కారణాలు తెలిస్తే, తెలుసుకుంటే, వాటికి పరిష్కారాలు ఆ తక్షణమే దొరుకుతాయి. దేశం నిండా ఎన్ని వేల, లక్షల దేవాలయాలున్నాయి! వాటినిండా ఎంతెంత డబ్బు రాసులూ, వెండి బంగారాల నగల దొంతరలూ, బట్టలూ, ఆహారాలూ, ఊహాతీతంగా వుంటున్నాయి! వాటిల్లో నించీ కొంత శాతాన్ని బైటికి తీసి, వ్యభిచారాలకు వ్యతిరేకంగా సహజమైన వృత్తులు కల్పించలేరా? కల్పించమని ప్రభుత్వాలకు సూచించలేరా? అది అసాధ్యమా? అలా చెయ్యకుండా, ఆ స్త్రీలని, ‘మీ వ్యభిచారాలతో, మీ జబ్బులతో, కురుపులతో, కృశించిపోతూ, బ్రతుకులు సాగించండి’ – అని వదిలేస్తే, అదా నిజమైన న్యాయం?


వ్యభిచారాన్నే నిలబెట్టాలనీ, పోలీసులు మాత్రం అటు పోగూడదనీ, సంస్కర్తలు చెప్పే సూక్తుల్నే, సుప్రీం కోర్టూ చెప్పింది. పత్రికల వాళ్ళూ, టీవీల వాళ్ళూ, వ్యభిచార స్త్రీల పేర్లూ, ఫోటోలూ, చూపించకూడదట. ఆ వ్యభిచారిణులు మర్యాదగా వృత్తులు చేసుకుంటూ వుంటే, ఆ వృత్తి సంగతిని పత్రికలు ఎందుకు రహస్యంగా వుంచాలి? బహిరంగంగా చెప్పేస్తేనే, ఆ వ్యభిచారిణుల సంగతి ఎక్కువ మంది విటులకు తెలిసి, ఆ వృత్తికి ఎక్కువ బేరాలు వస్తాయి కదా? అది ఆ స్త్రీలకి మేలే గదా? ఏఁ? పెద్ద పెద్ద ఆసుపత్రులు, తమ దగ్గిర నిపుణులైన డాక్టర్లు వున్నారనీ, తమ దగ్గిరకి వైద్యానికి రమ్మనీ వ్యాపార ప్రకటనలు ఇవ్వడం లేదూ? అన్ని వృత్తులకు ఇచ్చే గౌరవమే వ్యభిచారులకు కూడా ఇవ్వాలని, సూచించిన కోర్టు వారికి ఈ విషయం తెలియదా? అది గొప్ప వృత్తే అయితే, దాన్ని రహస్యంగా వుంచడం ఎందుకు?


వ్యభిచారం అనేది, కడు పేదరికం వల్ల అవసరమవుతుందనేది కళ్ళకి కనిపించే సత్యం. ఈ నీచత్వానికి అసలు కారణం, నిరుద్యోగం. ఉత్పత్తి సాధనాల రూపంలో, చారెడు భూమి వంటి ఏ ఆస్తీ లేకపోవడం. ఆస్తి సంబంధాల్లో అసమానత్వం మాట ఎత్తకుండా, ఆ వ్యభిచారిణుల మీద జాలితో పొంగిపోతున్నట్టు రక రకాల కల్పనల మాటలు!


పెట్టుబడిదారీ సమాజంలో వున్న సుప్రీం కోర్టుగానీ, ఇతర సంస్కర్తలు గానీ చేసే సూచనలు సహృదయులైన అమాయకులకు నైతికంగా ఉదాత్తమైనవిగా కనిపిస్తాయి గానీ, అది నిజం కాదు. అందుకే లెనిన్, కార్మిక స్త్రీల ఉద్యమాలు నడిపే క్లారా జెట్కిన్ అనే ఆమెతో (1920లో) ఇలా అన్నాడు: ‘వేశ్యలు పెట్టుబడిదారీ సమాజం చేత రెండు విధాల బాధితులు! ఒకటి: దాని పాపిష్టి ఆస్తి వ్యవస్త చేత! రెండు: దాని పాపిష్టి నైతిక కపటత్వం చేత!’


నేను, ‘అంధకారంలో..’ అనే నవలలో ‘వేశ్యల’ గురించి రాస్తున్నప్పుడు (1969లో) నాకు ఈ విషయాలు, సరిగా తెలియవు. ఆ నవల రాసే ముందు, కొంత సమాచారం కోసం, ఇద్దరు ముగ్గురు ‘వేశ్య’లతో చాలా మాట్లాడాను, వాళ్ళు ఆ స్తితిలో ఎందుకు వున్నారో తెలుసుకోవడానికి. ‘ప్రేమ’ పేరుతో మోసపోయిన వాళ్ళూ, ఏ దిక్కూ లేని వాళ్ళూ, పని ఇప్పిస్తానంటే నమ్మి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళూ, అలా రకరకాల వాళ్ళు వున్నా, ప్రధానంగా ఉన్నది పేదరికం వల్లే అని వాళ్ళూ చెప్పుకున్నారు. కానీ, పేదరికానికి మూలం ఆస్తి సంబంధాలు అనే విషయం నాకు మార్క్సిజంతో పరిచయం అయ్యాక గానీ తెలియలేదు. ఆ తర్వాత నాకు ఇంకో విషయం అర్ధం అయింది. ‘వేశ్యరికాన్ని నిర్మూలించాలంటే, ‘వేశ్య’ సమస్యని పరిష్కరిస్తే చాలదు; ‘విటుడి’ సమస్యని కూడా పరిష్కరించాలి!’ అని!


వేశ్యరికానికి కారణం స్త్రీల పేదరికం అయితే, వాళ్ళ దగ్గిరికి వచ్చే పురుషులు సరైన దాంపత్య సంబంధాల్లో లేరని అర్ధం. పరిచయం, ఇష్టం, సమానత్వ భావాలూ అనేవే పెళ్ళికి పునాది అయినప్పుడు, స్త్రీ–పురుషుల మధ్య రహస్య సంబంధాలూ వుండవు; ‘విటులూ’ వుండరు.


ఈ భూమండలంలో ఏ స్త్రీ అయినా, ‘నేనీ వ్యభిచారం ఇష్టపూర్వకంగానే చేస్తున్నాను’ అని అంటుందా? నాకు చెప్పిన వాళ్ళు, ‘వచ్చే వాళ్ళు దొంగ ముండా కొడుకులమ్మా! పెళ్ళాల దగ్గిర కుదరని యాసాలన్నీ మా దగ్గిర ఏస్తారమ్మా! ఇంసించుకు తింటారమ్మా! గతి లేక దీంటో పడ్డాం!’ అని ఈ రకంగా అన్నారు గానీ, ఇదేదో గొప్ప పవిత్ర మైన వృత్తి అని చెప్పలేదు.


పోలీసులు, వ్యభిచారుల పట్ల క్రూరంగా వుండకూడదని కోర్టు హితవు! పోలీసులు వ్యభిచారుల పట్ల మాత్రమేనా క్రూరంగా వుండేది? అంగన్ వాడీ స్త్రీలు ఆందోళన చేసినా, టీచర్లు సమ్మె చేసినా, లాయర్లు నిరసనకు దిగినా, ఆ పోలీసులు లాఠీలు ఝులిపించిన సందర్భాలు లేవూ? అలాంటప్పుడు, వ్యభిచారంతో కడుపు నింపుకునే నిస్సహాయులు ఒక లెక్కా పోలీసులకి?


వ్యభిచారుణుల్ని సంస్కరణ కేఁద్రాలలో పెడితే, అది పురుషుల భావన (పేట్రియార్కల్) అట! మరి, వ్యభిచారాన్ని, ఒక వృత్తిగా భావిస్తూ, వాళ్ళని అలాగే వదిలెయ్యండి, రోగాలతో చావనివ్వండి – అనే ధోరణి ఎవరి భావనలు అవుతాయి? అసలు వ్యభిచారం అనేదే, పురుషుల కోసం ఏర్పాటయ్యింది.


మొత్తం మీద, సుప్రీం కోర్టు వారి సూచనలు, వ్యభిచార వృత్తిలో వున్న వారిని, మరింత దుర్భర స్తితిలోకి నెట్టుతాయి తప్ప, ఎందుకూ ఉపయోగపడవు. ‘రాజ్యాంగ నైతికత’ (కాన్ స్టిట్యుషనల్ మొరాలిటి) అని రాజకీయ సంస్కరణ వాదులు అంటారే, ఆ నైతికత కిందికి కూడా రావు ఈ రకం సూచనలు. వీటికి మురిసిపోయి, నాగపూరు లోని గంగా–జమునా రెడ్ లైట్ ఏరియాలో, కొందరు స్త్రీలూ, పురుషులూ కూడా, రంగులు చల్లుకుని, డప్పులు వాయిస్తూ, డ్యాన్సులు చేస్తూ, ఉత్సవం చేసుకుంటున్న వీడియో ఒకటి యూట్యూబ్‌లో తిరుగుతోఁది. అది వ్యభిచారిణుల అమాయకపు అల్ప సంతోషమా? వ్యభిచారాన్ని గిట్టుబాటు వ్యాపారంగా తీర్చిదిద్దే వ్యభిచార గృహాలు నడిపేవారి గడుసు ఆనందమా?

రంగనాయకమ్మ

Updated Date - 2022-06-09T06:07:28+05:30 IST