విద్యా సంస్థలు నడిస్తే కష్టమే!!

ABN , First Publish Date - 2021-03-23T07:20:15+05:30 IST

తెలంగాణవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా విద్యాసంస్థల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

విద్యా సంస్థలు నడిస్తే కష్టమే!!

  • కరోనా విజృంభించే చాన్స్‌
  • సర్కారుకు వైద్య శాఖ లేఖ
  • తాజా పరిస్థితిపై మంత్రి ఈటల సమీక్ష
  • కరోనా నియంత్రణలోనే ఉందని మంత్రి వ్యాఖ్య
  • లాక్‌డౌన్‌ పెట్టే పరిస్థితి లేదు: వైద్య శాఖ వర్గాలు

హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా విద్యాసంస్థల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రత్యక్ష తరగతులకు పుల్‌స్టాప్‌ పెట్టాలని అందులో కోరింది. తాజాగా వైద్యశాఖ కూడా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సర్కారుకు నివేదిక అందించింది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యాసంస్థలు నడిస్తే, కరోనా విజృంభించే అవకాశాలు ఉంటాయని అది హెచ్చరించింది. ఆరు నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులకు బడులు నిర్వహించకపోవడమే ఉత్తమమని సూచించింది. 


ప్రభుత్వ నిర్ణయమే తరువాయి.. 

రాష్ట్రంలోని పలు పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులకు కరోనా సోకిన ఘటనలు ఇటీవల వరుసగా వెలుగుచూశాయి. దీంతో ఎక్కడికక్కడ పెద్దఎత్తున ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చేసి, ఇన్ఫెక్షన్‌ నిర్ధారణ అయినవారికి చికిత్స అందిస్తున్నారు. మిగతా వారిని హోం క్వారంటైన్‌కు పంపారు. దీనిపై విద్య, వైద్యశాఖలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 6 నుంచి 10 తరగతులకు ప్రత్యక్షంగా క్లాసులు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య పెరగడంతో కొవిడ్‌ నిబంధనల అమలు సాధ్యపడటం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థుల నుంచి వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులకు కరోనా సోకే ముప్పుందని వైద్యశాఖ అంచనాకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో విద్యా సంస్థలు నడిపితే కరోనా   విజృంభించవచ్చని, 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు తరగతులు నిర్వహించకపోవడమే ఉత్తమమని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వైద్యశాఖ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. 


టిమ్స్‌, గాంధీ సిద్ధం చేయండి : మంత్రి 

 కరోనా కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్యను మరింత పెంచాలని సర్కారు నిర్ణయించింది. వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా నియంత్రణలోనే ఉందని ఆయన వెల్లడించారు. ఒకవేళ కేసులు పెరిగితే వైద్యసేవలు అందించేందుకు అన్ని ఆస్పత్రులను సిద్ధంగా ఉంచుతామన్నారు. హైదరాబాద్‌లోని ‘టిమ్స్‌’ హాస్పిటల్‌ పూర్తి స్థాయిలో, గాంధీ ఆస్పత్రిలోని కొవిడ్‌ వార్డుల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని ఈటల ఆదేశించారు. పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు, మందులు, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు, యాంటీ వైరల్‌ మాత్రలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే చేస్తున్న 50వేల కరోనా టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు అదనంగా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయాలన్నారు.


అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం కొవిడ్‌ అదుపులోనే ఉందని, కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు పెట్టే తీవ్రమైన పరిస్థితి లేదని వైద్యవర్గాలు వెల్లడించాయి. ఒకవేళ అటువంటిదేమైనా ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని తెలిపాయి. తెలంగాణలో ప్రస్తుతం రోజుకు 400లోపే కేసులు నమోదవుతున్నాయని ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్‌) డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ఆదివారం 47 కేంద్రాల్లో 13,034 మంది టీకా తొలిడోసు తీసుకున్నారు. ఇప్పటివరకు తొలిడోసు తీసుకున్న వారి సంఖ్య 7,24,264కు చేరింది.  

Updated Date - 2021-03-23T07:20:15+05:30 IST