64 గళ్లపై అదిరే పోరు చెస్ కిక్‌!

ABN , First Publish Date - 2022-07-28T10:15:34+05:30 IST

చదరంగం కిక్‌.. దేశాన్ని ఊపేయనుంది. భారత్‌ తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న 44వ ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌ గురువారం నుంచి వచ్చేనెల 10 వరకు జరగనుంది. శుక్రవారం పోటీలు మొదలవుతాయి. ఆతిథ్య హోదాలో భారత్‌

64 గళ్లపై అదిరే పోరు చెస్ కిక్‌!

 మహాబలిపురం వేదికగా  ఒలింపియాడ్‌ నేటి నుంచే 

బరిలో కార్ల్‌సన్‌, హంపి, హారిక, హరికృష్ణ


వ్యూహ ప్రతివ్యూహాలు.. ఎత్తులు.. పైఎత్తులు.. జిత్తులతో సాగే 64 గళ్ల మహా సంగ్రామానికి తమిళనాడు వేదిక కానుంది. భారత్‌ తొలిసారి ఆతిథ్యమిస్తున్న చెస్‌ ఒలింపియాడ్‌కు గురువారం తెరలేవనుంది. గతంలో ఎన్నడూ లేనంతగా 350 జట్లు తలపడనుండగా.. భారత్‌ ఆరు జట్లను బరిలో దించుతోంది. ఓపెన్‌లో భారత్‌-ఎకు రెండో సీడ్‌, మహిళల కేటగిరీలో భారత్‌-ఎకు టాప్‌ సీడ్‌ దక్కాయి. 


చెన్నై (ఆంధ్రజ్యోతి): చదరంగం కిక్‌.. దేశాన్ని ఊపేయనుంది. భారత్‌ తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న 44వ ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌ గురువారం నుంచి వచ్చేనెల 10 వరకు జరగనుంది. శుక్రవారం పోటీలు మొదలవుతాయి. ఆతిథ్య హోదాలో భారత్‌ రికార్డుస్థాయిలో ఆరు జట్లను బరిలోకి దించుతోంది. ఓపెన్‌ కేటగిరీలో మూడు, మహిళల విభాగంలో మూడు టీమ్‌లు తలపడనున్నాయి. మొత్తంగా 30 మంది భారత ఆటగాళ్లు ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో ఆడనుండగా.. ఓపెన్‌ కేటగిరీలో ఆడనున్న 15 మంది భారత ప్లేయర్లూ గ్రాండ్‌ మాస్టర్లే కావడం విశేషం. అయితే, ఐదుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఈసారి ఆటగాడిగా కాకుండా.. మెంటార్‌గా భారత జట్లకు మార్గదర్శనం చేయనున్నాడు. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మెగా ఈవెంట్‌ ఓపెన్‌ కేటగిరీలో 188 జట్లు, మహిళల విభాగంలో 162 టీమ్‌లు పోటీపడనున్నాయి.


వరల్డ్‌ నెం:1 మాగ్నస్‌ కార్ల్‌సన్‌ నార్వే జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఓపెన్‌లో ఫేవరెట్‌గా పరిగణిస్తున్న గ్రాండ్‌ మాస్టర్లు హరికృష్ణ, అర్జున్‌ ఇరిగేసి, విదిత్‌ గుజరాతి, ఎస్‌ఎల్‌ నారాయణ్‌, శశికరణ్‌ కృష్ణన్‌తో కూడిన భారత్‌-ఎ జట్టుకు రెండో సీడ్‌ దక్కింది. చిచ్చరపిడుగు ప్రజ్ఞానంద ఉన్న భారత్‌-బి టీమ్‌కు 11వ సీడ్‌, భారత్‌-సి టీమ్‌కు 17వ సీడ్‌ లభించాయి. రష్యా, చైనా దేశాలు దూరమైన నేపథ్యంలో.. భారత్‌ను ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు. ఓపెన్‌ కేటగిరీలో టాప్‌ సీడ్‌ అమెరికాతోపాటు ఉక్రెయిన్‌, అజర్‌బైజాన్‌ జట్ల నుంచి ఆతిథ్య జట్లకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. కాగా, భారత్‌-బి జట్టు డార్క్‌ హార్స్‌ అని కోచ్‌ ఆర్‌.బి రమేష్‌ చెప్పాడు. ఇక, మహిళల కేటగిరీలో గ్రాండ్‌ మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్‌, భక్తి కులకర్ణిలతో కూడిన భారత్‌-ఎ జట్టు టాప్‌ సీడ్‌ దక్కించుకోగా.. భారత్‌-బి, భారత్‌-సి టీమ్‌లకు 11వ, 16వ సీడ్‌లు లభించాయి. భారత జట్లకు విశ్వనాధన్‌ ఆనంద్‌ సలహాదారుడిగా వ్యవహరిస్తున్నాడు. 


   వరుసగా రెండు పతకాలు..

2014లో నార్వేలో జరిగిన ఒలింపియాడ్‌లో ఓపెన్‌ కేటగిరీలో భారత్‌ కాంస్యం సాధించింది. 2020లో సంయుక్తంగా స్వర్ణం నెగ్గిన భారత్‌.. 2021 ఒలింపియాడ్‌లో కాంస్యంతో సరిపెట్టుకొంది. 2018 తర్వాత తొలిసారి ఫిజికల్‌గా ఒలింపియాడ్‌ను నిర్వహిస్తున్నారు.


     మస్కట్‌గా ‘తంబి’..

అన్ని మ్యాచ్‌లూ క్లాసికల్‌ స్విస్‌ లీగ్‌ ఫార్మాట్‌లో జరగనున్నాయి. 11 రౌండ్లపాటు సాగే టోర్నీలో తొలి రౌండ్‌ ఈ నెల 29న షెడ్యూల్‌ చేయగా.. ఆగస్టు 9న ఆఖరి, 11వ రౌండ్‌ జరగనుంది. వచ్చే నెల 4న విశ్రాంతి. ఓపెన్‌ కేటగిరీ విజేతకు హామిల్టన్‌-రస్సెల్‌ కప్‌, మహిళల కేటగిరీ విజేతకు వెరా మెంచి కప్‌లను బహూకరించనున్నారు. ఒలింపియాడ్‌ మస్కట్‌ ‘తంబి’. తమిళనాడు సంస్కృతిని ప్రతిబింబించేలా షర్ట్‌, లుంగీతో ఉన్న ‘నైట్‌’ (అశ్వం)ను రూపొందించారు.


ప్రారంభ వేడుకలకు ప్రధాని మోదీ

స్థానిక నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో గురువారం సాయంత్రం 6 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. చెస్‌ ఒలింపియాడ్‌ను లాంఛనంగా ప్రారంభిస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధ్యక్షతన జరుగనున్న ఆరంభోత్సవాల్లో పలువురు కేంద్ర మంత్రులు, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌. రంగస్వామి తదితరులు పాల్గొననున్నారు. 


 భారత జట్లు 

ఓపెన్‌ కేటగిరి- ఎ: హరికృష్ణ, అర్జున్‌, విదిత్‌ గుజరాతి, ఎస్‌ఎల్‌ నారాయణ్‌, శశికిరణ్‌ కృష్ణన్‌; బి: నిహాల్‌ సరీన్‌, గుకేష్‌, అదిబన్‌, ప్రజ్ఞానంద, రౌనక్‌ సధ్వాని; సి: సూర్య శేఖర్‌ గంగూలీ, సేతురామన్‌, అభిజిత్‌ గుప్తా, కార్తీకేయన్‌ మురళీ, అభిమన్యు పురానిక్‌.


మహిళల కేటగిరి- ఎ: హంపి, హారిక, వైశాలి, తానియా, భక్తి; బి: వంతిక అగర్వాల్‌, సౌమ్య, మేరి, పద్మిని, దివ్య; సి: ఇషా, సాహితి, ప్రత్యూష, నందిద, విశ్వ .

Updated Date - 2022-07-28T10:15:34+05:30 IST