రూ.1.86 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2021-06-17T08:58:34+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22) గడిచిన రెండున్నర నెలల్లో ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు రెట్టింపై దాదాపు రూ.1.86 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను, ముందస్తు పన్ను

రూ.1.86 లక్షల కోట్లు

ఈ ఆర్థిక సంవత్సరంలో రెట్టింపైన  ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు 

వెల్లడించిన ఐటీ శాఖ


న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22) గడిచిన రెండున్నర నెలల్లో ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు రెట్టింపై దాదాపు రూ.1.86 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు గణనీయంగా పెరగడం ఇందుకు దోహదపడిందని ఐటీ శాఖ వెల్లడించింది.  మరిన్ని వివరాలు.. 


ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 15 నాటికి ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు రూ.1,85,871 కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో (2020-21) ఇదే కాలానికి నమోదైన రూ.92.762 కోట్ల నికర వసూళ్లతో పోలిస్తే 100.4 శాతం అధికం.  


గడిచిన రెండున్నర నెలల్లో సమకూరిన మొత్తం నికర పన్ను ఆదాయంలో కార్పొరేట్‌ పన్ను నికర వసూళ్లు రూ.74,356 కోట్లు కాగా, వ్యక్తిగత ఆదాయ పన్ను (సెక్యూరిటీస్‌ లావాదేవీల పన్ను సహా) రూ.1.11 లక్షల కోట్లు. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఐటీ డిపార్ట్‌మెంట్‌ రూ.30,731 కోట్ల పన్ను రిఫండ్లు జరిపింది. 


ఈ ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 15 నాటికి ప్రత్యక్ష పన్నుల స్థూల వసూళ్లు (గ్రాస్‌ కలెక్షన్స్‌) రూ.2.16 లక్షల కోట్లుగా నమోదయ్యా యి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన వసూళ్లు రూ.1.37 లక్షల కోట్లు. 


గడిచిన రెండున్నర నెలల్లో నమోదైన స్థూల ఆదాయంలో కార్పొరేట్‌ పన్ను వసూళ్లు రూ.96,923 కోట్లు కాగా, వ్యక్తిగత ఆదాయం పన్ను వసూళ్లు రూ.1.19 లక్షల కోట్లు. టీడీఎస్‌ రూ.1,56,824 కోట్లుగా నమోదయ్యాయి. స్వీయ మదింపు పన్ను ఆదాయం రూ.15,343 కోట్లు, రెగ్యులర్‌ అసె్‌సమెంట్‌ ట్యాక్స్‌ రూ.14,079 కోట్లుగా ఉంది. 


కరోనా రెండో దశ ఉధృతి కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (ఏప్రిల్‌, మే) ఆర్థిక వ్యవస్థ తీవ్ర సవాళ్లు ఎదుర్కొంది. అయినప్పటికీ ముందస్తు పన్ను వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 146 శాతం వృద్ధి చెంది రూ.28,780 కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ముందస్తు పన్ను చెల్లింపులు రూ.11,714 కోట్లుగా ఉన్నాయి.


2021-22 కాస్ట్‌ ఇన్‌ఫ్లేషన్‌ ఇండెక్స్‌ నోటిఫై 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22) కాస్ట్‌ ఇన్‌ఫ్లేషన్‌ ఇండెక్స్‌ (సీఐఐ)ను నోటిఫై చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది. స్థిరాస్తులు, సెక్యూరిటీలు, ఆభరణాల విక్రయం ద్వారా దీర్ఘకాలిక మూలధన లాభాలను లెక్కించేందుకు సీఐఐ ఉపయోగపడుతుంది. ఈసారికి సీఐఐ నంబర్‌ను 317గా నిర్ణయించినట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) తెలిపింది. 

Updated Date - 2021-06-17T08:58:34+05:30 IST