రోడ్లు, బస్సులు, రైళ్లు ఖాళీ

ABN , First Publish Date - 2020-03-06T09:43:05+05:30 IST

ఏటా సంక్రాంతి, దసరా పండుగలప్పుడు హైదరాబాద్‌లోని రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తుంటాయి.

రోడ్లు, బస్సులు, రైళ్లు ఖాళీ

బోసిపోయిన సూపర్‌మార్కెట్లు

నిర్మానుష్యంగా కనిపిస్తున్న ఐటీ కారిడార్‌

ఇంటి నుంచి పనికే ఉద్యోగుల మొగ్గు

కంపెనీ అనుమతించకపోతే.. సిక్‌ లీవు

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఏటా సంక్రాంతి, దసరా పండుగలప్పుడు హైదరాబాద్‌లోని రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తుంటాయి. మరీ ఆ స్థాయిలో కాదుగానీ.. బుధ, గురువారాల్లో రాజధాని నగరంలో రోడ్లపై రద్దీ గణనీయంగా తగ్గింది! నగరవాసికి కరోనా పాజిటివ్‌ రావడమే ఇందుకు కారణం! చాలా మంది ప్రజలు బయటకు రావడానికి ఆలోచిస్తున్నారు. ఫలితంగా.. నిత్యం రద్దీగా ఉండే రహదారులు, షాపింగ్‌ మాళ్లు, సూపర్‌మార్కెట్లు, హోటళ్లు, సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి.


సూపర్‌మార్కెట్లు, మాల్స్‌లో బిల్లింగ్‌ సెక్షన్ల వద్ద కొనుగోలుదారులు బారులు తీరుతున్న దృశ్యాలు కనిపించట్లేదు. సాధారణ విక్రయాలతో పోలిస్తే.. 10 నుంచి 20 శాతం సేల్స్‌ తగ్గాయని సమాచారం. ఇక.. ఎప్పుడూ కిక్కిరిసిపోయి కనిపించే బస్సుల్లో సైతం ప్రయాణికులు చాలా పల్చగా కనిపిస్తున్నారు. ప్రయాణించిన కొద్దిమందీ కూడా రుమాళ్లు, స్కార్ఫ్‌లు ధరించడం గమనార్హం. నిత్యం కిటకిటలాడే రైళ్లు, రైల్వే స్టేషన్లు కూడా 2-3 రోజులుగా కాస్త పలచగా కనిపిస్తున్నాయి. అటు.. పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరం జనంతో రద్దీగా ఉండే సైబరాబాద్‌ ఐటీ కారిడార్‌ నిర్మానుష్యంగా మారింది.


కరోనా వ్యాప్తి భయంతో కార్యాలయాలకు వెళ్లేందుకు ఉద్యోగులు జంకుతున్నారు. అనేక కార్యాలయాలు, వేలాదిమంది ఉద్యోగులు కలిగిన ప్రముఖ ఐటీ కంపెనీలు టీసీఎస్‌, డెలోయ్‌ట్‌, ఇంటెల్‌ వంటి సంస్థలు తమ ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రం హోం’ వెలుసుబాటు ఇవ్వడంతో వారంతా ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.


తదుపరి సమాచారం ఇచ్చేంతవరకూ ఉద్యోగులు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని ఈ కంపెనీలు బుధవారమే ఉద్యోగులకు సమాచారమిచ్చాయి. గురువారం నుంచి కార్యాలయాలకు రావాల్సిందేనని కొన్నికంపెనీలు ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. చాలా మంది అనారోగ్య కారణాలతో సెలవు పెట్టేస్తున్నారు.

ఉద్యోగులకు పెగా సిస్టమ్స్‌ లేఖ

అధిక రిస్క్‌ ఉన్న దేశాల నుంచి వచ్చిన ఉద్యోగులు రెండు వారాల పాటు ఇంటి వద్దే ఉండి అక్కడి నుంచి పని చేయాలని పెగా సిస్టమ్స్‌ ఉద్యోగులను కోరింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కాకుండా ఉద్యోగులు తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై కంపెనీ ఎండీ సుమన్‌ రెడ్డి ఉద్యోగులకు లేఖ రాశారు. ముఖ్యం కాని వ్యాపార ప్రయాణాలను నిలిపివేయాలని సూచించారు. ఆన్‌లైన్‌, వెబెక్స్‌ ద్వారా బిజినెస్‌ మీటింగ్‌లు నిర్వహించాలని.. పెద్ద, పెద్ద సమావేశాల నిర్వహణను నిలిపివేయాలని లేఖలో ఉద్యోగులకు తెలిపారు.

Updated Date - 2020-03-06T09:43:05+05:30 IST