పాల్‌ దినకరన్‌పై ఐటీ పంజా

ABN , First Publish Date - 2021-01-21T12:22:09+05:30 IST

ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు పాల్‌ దినకరన్‌ నివాసాలు, కార్యాలయాలు, సంస్థలపై ఆదాయపన్ను శాఖ పంజా విసిరింది. చెన్నై, కోయంబత్తూరు సహా మొత్తం 28 చోట్ల ఏకకాలంలో ఐటీ ...

పాల్‌ దినకరన్‌పై ఐటీ పంజా

ఏకకాలంలో 28 ప్రాంతాల్లో సోదాలు 

భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం 


చెన్నై, అడయార్ (ఆంధ్రజ్యోతి): ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు పాల్‌ దినకరన్‌ నివాసాలు, కార్యాలయాలు, సంస్థలపై ఆదాయపన్ను శాఖ పంజా విసిరింది. చెన్నై, కోయంబత్తూరు సహా మొత్తం 28 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. బుధవారం వేకువజాము నుంచి మొదలైన ఈ తనిఖీలు పొద్దుపోయే దాకా కొనసాగాయి. ఈ సోదాల్లో భారీగా నగదు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నగరంలోనే కాకుండా దేశంలోనే క్రైస్తవ మత ప్రచారకుల్లో ప్రముఖుడిగా గుర్తింపు పొందిన డీజీఎస్‌ దినకరన్‌  1983లో ‘జీసెస్‌ కాల్స్‌’ అనే సంస్థను ప్రారం భించి, దేశవ్యాప్తంగా క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారు. అదేసమయంలో 1986లో కోయంబత్తూరులో కారుణ్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. దినకరన్‌ నిర్వహించే మత ప్రచార కార్యక్రమాలకు లక్షలాది సంఖ్యలో ప్రజలు హాజరవుతుంటారు. దీంతో రాష్ట్రంలో అత్యంత బలమైన మతబోధకుడుగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో 2008లో డీజీఎస్‌ దినకరన్‌ మరణానంతరం ఆయన కుమారుడు పాల్‌ దినకరన్‌ ఆ బాధ్యతలను స్వీకరించారు. ఈ క్రమంలో జీసెస్‌ కాల్స్‌తో పాటు.. కారుణ్య విశ్వవిద్యాలయానికి వచ్చే నిధుల లెక్కలను సక్రమంగా వెల్లడించకుండా పన్ను ఎగవేతకు పాల్ప డినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం వేకువ జామున దాదాపు 250 మంది ఆదాయపన్ను శాఖ అధికారులు ఏకకాలంలో పాల్‌ దినకరన్‌కు చెందిన అన్ని కార్యాలయాలతో పాటు.. జీసెస్‌ కాల్స్‌ కేంద్రం, కోవైలోని కారుణ్య విశ్వవిద్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో కార్యాలయాల్లో టెలిఫోన్‌ కనెక్షన్లన్నీ తొలగించారు. అలాగే ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను కూడా బయటకు వెళ్ళనీయలేదు. అలాగే, రోజువారీ విధులకు వచ్చిన ఉద్యోగులను కూడా లోనికి అనుమతించలేదు. ఈ సోదాల్లో జీసెస్‌ కాల్స్‌కు వచ్చిన నిధులకు సంబంధించిన కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నగదు కూడా భారీగా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా  పటిష్టమైన పోలీసు బందోబస్తు నడుమ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 

Updated Date - 2021-01-21T12:22:09+05:30 IST