మీది నియంతృత్వ పోకడ కాదా?

ABN , First Publish Date - 2021-01-24T08:17:02+05:30 IST

‘కొవిడ్‌ రెండో దశ సమయంలో పంచాయతీ ఎన్నికలా? మీది నియంతృత్వ పోకడ కాదా?’ అని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.

మీది నియంతృత్వ పోకడ కాదా?

కొవిడ్‌ రెండో దశలో.. స్థానికమా?.. ఎస్‌ఈసీని ప్రశ్నించిన స్పీకర్

‌ 

శ్రీకాకుళం, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ‘కొవిడ్‌ రెండో దశ సమయంలో పంచాయతీ ఎన్నికలా? మీది నియంతృత్వ పోకడ కాదా?’ అని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. శనివారం శ్రీకాకుళంలో మాట్లాడుతూ ‘ఎన్నికలపై ఎస్‌ఈసీ ఫాల్స్‌ ప్రస్టేజీకి ఎందుకుపోతున్నారు? ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌ చూస్తుంటే ఓ పొలిటికల్‌ ప్రెస్‌మీట్‌ గుర్తొచ్చింది. కరోనా ఆయనకు సోకకూడదని జాగ్రత్తపడుతున్నారు. ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు ఏమైపోతారన్నది ఆయనకు అక్కర్లేదు. 2018లో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు 2021లో చేపట్టడానికి గల ప్రధానకారకులెవరో ఎస్‌ఈసీనే చెప్పాలి. ఎన్నికలు నిర్వహించడం వల్ల కరోనా సోకి ఎవరైనా మరణిస్తే ఆ బాధ్యత ఎవరు వహిస్తారో వెల్లడించాలి.


వ్యాక్సిన్‌ ఒకటి, రెండు విడతల తర్వాత నిర్వహిస్తే తప్పేంటి? మీ హయాంలోనే ఎన్నికలు జరగాలా? లేకుంటే జరగవా? ఇది నియంతృత్వ పోకడ కాదా?’ అని ఎస్‌ఈసీని ప్రశ్నించారు.  ‘‘మీ హయాంలోనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని యోచించింది. కానీ అప్పటికి కరోనా వ్యాప్తి లేకపోయినా.. ఎన్నికలు రద్దు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఎన్నికలు నిర్వహించాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది. ఇది కోర్టు వయోలేషన్‌ కాదా? ఉద్యోగులే ఎన్నికల నిర్వహణకు ముందుకురామని చెప్పేశారు. దీనివల్ల రాజ్యాంగ వ్యవస్థ పరువు గంగలో కలసిపోతుందిగా. ఈ సమయంలో ఎన్నికలు అవసరమా?’’ అని స్పీకర్‌ ప్రశ్నించారు. 

Updated Date - 2021-01-24T08:17:02+05:30 IST