రాజకీయాల్లో ఆ వైసీపీ నేత యాక్టివ్‌గా లేరా?

ABN , First Publish Date - 2020-06-06T18:15:54+05:30 IST

రాజకీయాల్లో ఆ వైసీపీ నేత యాక్టివ్‌గా లేరా?

రాజకీయాల్లో ఆ వైసీపీ నేత యాక్టివ్‌గా లేరా?

ఆయన ప్రముఖ పారిశ్రామిక వేత్త. సినీ నిర్మాత. గడిచిన ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గంలో ఆయన పెద్దగా కనిపించడం లేదు. ట్విట్టర్‌కే పరిమితమవుతున్నారు. ఆయన ట్వీట్లు మాత్రం ఒక్కోసారి సంచలనం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో వాటిపై చర్చలు సాగుతున్నాయి. ఎన్నికల్లో పరాజయం పాలయ్యాక ఆయన జగన్‌ను కలుసుకున్నారు. ఆ సమయంలో ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగిందట. అనంతరం ఆయన అప్పుడప్పుడు బెజవాడకు వచ్చినప్పటికీ ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారు? ఎందుకు రాజకీయాల్లో చురుకుదనం తగ్గించారు? ఆసక్తికర వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి


   పొట్లూరి వరప్రసాద్‌.. ప్రముఖ పారిశ్రామికవేత్త! పొలిటికల్ సర్కిల్స్‌తోపాటు సినీ పరిశ్రమ పెద్దలు ఆయనను పీవీపీ అని పిలుస్తారు. రాజకీయాలంటే ఆయనకు అభిమానం. 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థిగా వైసీపీ పక్షాన ఆయన పోటీచేశారు. ప్రచారార్భాటాలతో సందడి చేశారు. నాటి ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ గాలి బలంగా వీచింది. కానీ పీవీపీ మాత్రం ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. అడపాదడపా ట్విట్టర్‌లో తనదైన శైలిలో కామెంట్లు పెడుతూ ఉనికి చాటుకుంటున్నారు. ఈ అంశమే ఇప్పుడు రాజకీయ పండితులు మధ్య గుసగుసలకి దారితీస్తోంది. 


   ఇప్పుడు పీవీపీ రాజకీయ నేపథ్యంలోకి వద్దాం. విజయవాడ నుంచి తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్నది ఎప్పటినుంచో పొట్లూరి ఆశ! అందుకోసం తనదైన శైలిలో ప్రయత్నించి పొలిటికల్‌ ట్రాక్‌ వేసుకోగలిగారు. నిజానికి 2014 ఎన్నికల్లోనే పీవీపీ పేరు బాగా నలిగింది. నాటి ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన ఒక కూటమిగా పోటీచేసిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కి పొట్లూరి వరప్రసాద్‌ సన్నిహితులు. ఆ పార్టీ పక్షాన విజయవాడ పార్లమెంట్‌ స్థానంలో పీవీపీ పోటీచేస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. పీవీపీకి ఎంపీ టిక్కెట్‌ ఇవ్వమని జనసేన అధినేత కూడా రికమండ్‌ చేశారట. కానీ.. అప్పటికే టీడీపీ పక్షాన బెజవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని పేరుని చంద్రబాబు నాయుడు ఖరారుచేశారు. 2014 ఎన్నికల్లో కోనేరు ప్రసాద్‌ను తమ పార్టీ అభ్యర్ధిగా వైసీపీ బరిలోకి దించింది. కేశినేని నాని బాగా గ్రౌండ్‌వర్క్ చేయడంతో సునాయాసంగా గెలుపొందారు. అయితే నాటి ఎన్నికల్లో పీవీపీ ప్రస్తావన ఎక్కువసార్లే వినిపించిన మాట వాస్తవం! 


    2019 ఎన్నికల్లో పొట్లూరి వరప్రసాద్‌ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. అప్పటికి ఆయన వైసీపీ గూటికి చేరిపోయారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ పార్టీ పక్షాన బరిలోకి దిగారు. టీడీపీ పక్షాన మళ్లీ కేశినేని నాని పోటీచేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ, జనసేనలు టీడీపీకి యాంటీగా పనిచేశాయి. రాష్ట్రమంతటా టీడీపీకి వ్యతిరేక గాలి వీచింది. పీవీపీ కూడా హార్డ్‌వర్కే చేశారు. అయినా విజయవాడ పార్లమెంట్‌ స్థానంలో కేశినేని విజయం సాధించారు. టాటా ట్రస్ట్ ద్వారా నాని చేపట్టిన కార్యక్రమాలు ఆయనకి ప్లస్‌ అయ్యాయి. ఏదైతేనేం- పార్లమెంట్‌లో అడుగుపెట్టాలన్న పొట్లూరి వరప్రసాద్‌ ఆశలు మాత్రం నీరుగారిపోయాయి.


    2019 ఎన్నికల అనంతరం జగన్‌ను పీవీపీ మర్యాదపూర్వకంగా కలిశారు. తాను హైదరాబాద్‌ వెళుతున్నట్టుగా చెప్పారు. ఆ సమయంలో జగన్ పీవీపీకి ఒక సూచన చేశారట. విజయవాడలోనే ఆఫీస్ ఏర్పాటుచేసుకుని నిత్యం టచ్‌లో ఉండాలని కోరారట. హైదరాబాద్‌ వెళ్లిపోతే ఎలా? అని ప్రశ్నించారట. అయినప్పటికీ పొట్లూరి వరప్రసాద్ హైదరాబాద్‌కి వెళ్లారు. అప్పుడప్పుడు మాత్రమే బెజవాడకి వచ్చి వెళుతున్నారు. పూర్తిగా వ్యాపార వ్యవహారాలలో నిమగ్నమయ్యారు. రాజకీయ వేదికలపై ఆయన కనిపించడమే లేదు. విజయవాడలో దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మాత్రం పొట్లూరి వరప్రసాద్ ద్వారా కొంత రాయభారం నడిచిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


    ఇదిలా ఉంటే.. పొట్లూరి వరప్రసాద్‌ అడపాదడపా ట్విట్టర్‌లో మాత్రం కనిపిస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఆయన పోస్ట్‌చేసే ట్వీట్లు చర్చకి దారితీస్తున్నాయి! ఆ మధ్య విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన కొన్ని ట్వీట్లపై పీవీపీ ట్విట్టర్‌లోనే సెటైర్లు పేల్చారు. నాని కూడా ధీటుగా ప్రతిస్పందించారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ట్వీట్ల వార్‌ నడిచింది. ఇటీవల సీఎం జగన్‌ని ఉద్దేశించి పీవీపీ చేసిన మరో ట్వీట్‌ సంచలనం రేపింది. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన తర్వాత బాధితులను పరామర్శించేందుకు కేజీహెచ్‌కి సీఎం జగన్‌ వెళ్లారు. ఈ పరిణామంపై పీవీపీ విచిత్రమైన ట్వీట్‌ని పోస్ట్‌ చేశారు. గతంలో ఎన్‌టీ రామారావు ఈ ఆసుపత్రికి వెళ్లి పదవీచ్యుతుడయ్యారనీ, ఆ తర్వాత ఏ ముఖ్యమంత్రీ కేజీహెచ్‌కు వెళ్లలేదనీ పీవీపీ ట్వీట్‌ చేశారు. సీఎం జగన్ మాత్రం ధైర్యంచేసి కేజీహెచ్‌కు వెళ్లారనీ, బాధితులపై ఉన్న శ్రద్ధ కారణంగా ఆయన ఈ పని చేయగలిగారనీ పీవీపీ పేర్కొన్నారు. దీంతో ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. మొన్న ఎన్‌టీఆర్ జయంతి సందర్భంగా ఆయనను శ్లాఘిస్తూ పీవీపీ ట్వీట్ చేశారు. వైసీపీలో ఉన్న నేత ఇలా ఎన్‌టీఆర్‌ని ప్రస్తుతించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ అంశం కూడా పొలిటికల్‌ సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేసింది.


    బెజవాడ నగరపాలక సంస్థ ఎన్నికల సమయంలో పీవీపీ కీలక పాత్ర పోషిస్తారని వైసీపీకి చెందిన పలువురు నేతలు భావించారు. అయితే అలా జరగలేదు. ఈ తరుణంలో విజయవాడ, గుంటూరు వంటి నగరాలలో ఎన్నికల పర్యవేక్షణ బాధ్యత రాంకీగ్రూప్ అధినేత అయోధ్య రామిరెడ్డికి సీఎం జగన్ అప్పగించారు. అయితే.. ఆ ఎన్నికలు వాయిదా పడటంతో దీనిపై పెద్దగా చర్చ జరగలేదు. పీవీపీ వంటి నేతలపై వైసీపీలో కొందరు నేతలు ఆఫ్‌ ద రికార్డ్‌ మాట్లాడుతున్నారు. "పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వారు గెలిస్తే నియోజకవర్గంలో ఉంటారు. ఓడిపోతే మాత్రం వ్యాపారాలు చూసుకుంటారు'' అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన అన్న తేడా లేకుండా అన్ని పార్టీలలో అధిష్టానాలకు ఇలాంటి అనుభావాలు ఉన్నాయి. "వ్యాపారంలో సక్సెస్ అయితేనే కదా వారు రాజకీయాల్లోకి వచ్చేది. అందువల్ల వారి ప్రథమ ప్రాధాన్యం వ్యాపారమే అవుతుందని'' మరో వైసీపీ నేత విశ్లేషించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల సమయంలో అయినా పీవీపీ తెరపైకి వస్తారా అని బెజవాడ వైసీపీ శ్రేణులు మాత్రం ఎదురుచూస్తున్నాయి. ఇదండీ పొట్లూరి వరప్రసాద్‌ తాజా కథాకమామిషు!

Updated Date - 2020-06-06T18:15:54+05:30 IST