ఇస్లాం జ్ఞాననిధికి మొట్టమొదటి మూలాధారమైన దివ్య ఖుర్‌ఆన్ తరువాత స్థానం హదీస్‌ది. దివ్య ఖుర్‌ఆన్ సృష్టికర్త... దివ్య సందేశం రూపంలో అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ హృదయఫలకంపై ఆవిష్కరించిన సైద్ధాంతిక వాణి. ఆ సైద్ధాంతిక వాణికి క్రియాత్మకమైన అన్వయంగా, సృష్టికర్త మార్గదర్శనంలో దైవప్రవక్త నోటి వెంట వెలువడిన సుభాషితాలు, ఆయన కార్యాచరణ... హదీస్. ఈ విధంగా ఖుర్‌ఆన్ సిద్ధాంతం అయితే... హదీస్ దాని ఆచరణ. ఇస్లాం ధర్మానికి సంబంధించిన ఇతర సమాచారమంతా ఈ రెండు మూలాల వెలుగు ద్వారానే ఉనికిలోకి వస్తుంది.
హదీస్ అంటే ‘మాట’, ‘పలుకు’, ‘ప్రస్తావన’ అనే సాధారణమైన అర్థాలు ఉన్నాయి. ఇస్లాం పరిభాషలో ‘హదీస్’ అంటే... అంతిమ దైవప్రవక్త మహమ్మద్ ప్రవచించిన హితోక్తులు, ఆయన జారీ చేసిన ఆజ్ఞలు, ఆయన చేసి చూపిన పనులు తదితరాలని అర్థం. తన అనుచరుల (సహబీల) మాటలు, చేతలలో ఆయన ఆమోదం పొందిన విషయాలు కూడా హదీస్ పరిధిలోకే వస్తాయి. హదీ్‌సకు మరో రూపం- సున్నత్. ‘సున్నత్’ అంటే ‘విధానం’ లేదా ‘సంప్రదాయం అని సాధారణ అర్థం.