Abn logo
Jan 28 2021 @ 02:34AM

ఇదేం ‘ఏకగ్రీవం’?

  • ప్రకటన జారీపై సంజాయిషీ ఇవ్వండి
  • ఐఅండ్‌ పీఆర్‌ కమిషనర్‌కు ఎస్‌ఈసీ ఆదేశాలు
  • ఏపీ సర్కారు ప్రకటనలో తెలంగాణ ఫొటో
  • రాష్ట్రంలో పంచాయతీ ఫొటోలే లేవా? 
  • విస్తుపోతున్న రాష్ట్ర అధికారవర్గాలు


అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఏకగ్రీవంగా పంచాయతీ సర్పంచ్‌లను ఎన్నుకోవాలని బుధవారం పలు పత్రికల్లో ప్రభుత్వం తరఫున రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ ప్రకటనలివ్వడాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తప్పుబట్టారు. దీనిపై సంజాయిషీ ఇవ్వాలని ఆ శాఖ కమిషనర్‌కు గురువారం ఆదేశాలు జారీచేశారు. పంచాయతీలను ఏకగీవ్రం చేయాలని ప్రకటనలివ్వడాన్ని తప్పుపడుతూ పలు రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలోనే నిమ్మగడ్డ స్పందించారు. ‘‘ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు, ప్రభుత్వం తరఫున శాఖలు కొత్తగా చేయదలచుకున్న పనులకు ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి తీసుకోవాలి. దీనిపై ఐఅండ్‌ పీఆర్‌ కమిషనర్‌ సంజాయిషీ ఇవ్వాలి. ఇకముందు అనుమతి తీసుకునే కొత్త కార్యక్రమాలను, వాటిపై పత్రికా ప్రకటనలను ఇవ్వాలి’’ అని స్పష్టం చేశారు.


ఇలా ఏకగ్రీవాల ప్రకటన వివాదం రేపితే, ఆ ప్రకటన తీరే ఇప్పుడు విమర్శలను మూటగట్టుకొంటోంది. ఏకగీవ్ర ఎన్నికలయ్యే గ్రామ పంచాయతీలకు ఇచ్చే నగదు ప్రోత్సాహకాలకు సంబంధించి పది నెలల క్రితం ఇచ్చిన జీవోలోని అంశాలనే పొల్లు పోకుండా చేర్చి తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో జారీచేసిన విషయం తెలిసిందే. దాని ఆధారంగా బుధవారం జగన్‌సర్కారు సీఎం సొంత పత్రికకు, అనుకూల మీడియాకు కోట్లాది రూపాయల విలువైన మొదటి పేజీ ప్రకటనలు ఇచ్చింది. ‘‘ఇవి పార్టీ రహిత ఎన్నికలు. ఇవి మన పంచాయతీ ఎన్నికలు’’ అంటూ ప్రభుత్వం పేర్కొంటూ దాని కిందే ఓ పంచాయతీ కార్యాలయం ఫొటో వేసింది. అది ఏపీకి చెందినది కాదు. తెలంగాణలోని కరీనంగర్‌ జిల్లాకు చెందిన ఓ గ్రామ పంచాయతీ భవనం ఫొటోను మక్కికి మక్కికి వాడుకున్నారు. 2019 ఫిబ్రవరి 5న ఒక ఆంగ్ల దినపత్రిక తెలంగాణలోని పంచాయతీ ఎన్నికల గురించి ఓ స్టోరీ ప్రచురించింది. అందులో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం ఫొటోను ప్రచురించింది. ప్రభుత్వం ఆ ఫొటోను కాపీ చేసి ఈ ప్రకటనలో వాడుకుంది. అయితే, ఇటీవలే దానిని పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్పుచేయడం గమనార్హం. 


నీలం రంగుతో మేకప్‌..

ఫొటోను అచ్చం అలాగే వాడుకుంటే మరీబాగోదని అనుకున్నారేమో... గ్రామ పంచాయతీ, మండలం, జిల్లా పేరును నీలం రంగుతో కప్పేశారు. కానీ తెలంగాణ రాష్ట్ర అధికారిక లోగోను (కాకతీయ తోరణం) మాత్రం అలాగే కొనసాగించారు. జగన్‌ సొంత మీడియా, అనుకూల మీడియాకు ఇచ్చిన ప్రకటనల్లోని పంచాయతీ కార్యాలయం భవనంపై తెలంగాణ అధికారిక లోగో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.


ఎందుకిలా? 

ఏమిటిదీ? ఏపీలో పంచాయతీ భవనాల ఫొటోలే సర్కారు వద్ద లేవా?  ఒక వేళ అవి ఉన్నా వాటిపై ఉన్న అధికారపార్టీ రంగులతో సమస్య వస్తుందని తెలంగాణ ప్రభుత్వ పంచాయతీ భవనం ఫొటో వాడుకున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మీడియాలో ఈ ప్రకటనలు చూసిన తర్వాత ఉదయం నుంచే సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి మరీ సర్కారు ఖర్చుతో ప్రకటనలు ఇచ్చారు. పైగా ఏపీ ప్రభుత్వ నిధులతో ఇచ్చిన ప్రకటనల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భవనాల బొమ్మలు వేశారు.  చూడటానికే ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. సొంత ప్రచారం కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నారన్న అప్రదిష్ఠను మూటగట్టుకుంటున్నారు. ఇవన్నీ సర్కారు ప్రతిష్ఠను పెంచుతాయా?’’ అని ఓ సీనియర్‌ అధికారి అభిప్రాయపడ్డారు. అలాగే, ఇంతకు ముందు ఏ ప్రభుత్వ  ప్రకటన అయినా సీఎం జగన్‌ భారీ ఫొటోతోనే వెలువడేది. ఎన్నికల కోడ్‌ ఉండటంతో వ్యూహాత్మకంగా మహాత్మాగాంధీ, డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ ఫొటోలను ఏకగ్రీవాల ప్రకటనపై వాడారు. అయితే, ఈ ప్రకటన ఇవ్వడం కూడా ఎన్నికల కోడ్‌కు విరుద్ధమే అవుతుందని అధికారవర్గాలే చెబుతున్నాయి. 

ప్రకటన ఇదీ..