రైతులకు పంటల బీమా ఏదీ?

ABN , First Publish Date - 2022-05-25T08:17:11+05:30 IST

‘‘రాష్ట్రంలో రైతులు చచ్చిపోతే ఆర్థిక సాయం చేసే పథకం ఉంది కానీ, బతకడానికి లేదు.

రైతులకు పంటల బీమా ఏదీ?

  • బతికేందుకు ధీమా కల్పించరు.. 
  • చనిపోతే మాత్రం బీమా ఇస్తారా?
  • రాష్ట్ర రైతుల పట్ల కేసీఆర్‌ సవతి ప్రేమ
  • 8 ఏళ్లలో ఒక్క రైతు దగ్గరకు పోలేదేం?
  • రాజకీయాల కోసమే పక్క రాష్ట్రాలకు..
  • ముందు మన రైతుల కడుపు నింపండి
  • టీఆర్‌ఎస్‌, బీజేపీ, మజ్లిస్‌, జగన్‌ మధ్య రాజకీయ అక్రమ సంబంధం
  • పార్థసారథి ఎపిసోడ్‌ ఆపేది లేదు
  • టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి


హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో రైతులు చచ్చిపోతే ఆర్థిక సాయం చేసే పథకం ఉంది కానీ, బతకడానికి లేదు. రైతు బతికేందుకు ధీమా ఇవ్వకుండా చస్తే బీమా ఇస్తామంటే ఎట్లా? రైతు తన పంట నష్టపోయినా ధీమాగా ఉండేందుకు పంటల బీమా పథకం ఎందుకు పెట్టలేదు?’’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి కేసీఆర్‌ సర్కారును ప్రశ్నించారు. తెలంగాణ రైతుల పట్ల సీఎం కేసీఆర్‌ సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. రాజకీయాల కోసమే కేసీఆర్‌ పక్క రాష్ట్రాలకు పోతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, మజ్లిస్‌, జగన్‌ల మధ్య రాజకీయ అక్రమ సంబంధం ఉందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్లను చీల్చి కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని ఆ పార్టీలు చూస్తున్నాయని, ప్రజలు దీన్ని గమనించాలని అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నేత అనంత కిషన్‌తో కలిసి జగ్గారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందని పదేపదే టీఆర్‌ఎస్‌ నాయకులు అడుగుతున్నారని.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇచ్చిందే కాంగ్రెస్‌ ప్రభుత్వమని చెప్పారు. 


వైఎస్‌ ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైల్‌ మీదే పెట్టారని గుర్తు చేశారు. ఆ పథకాన్నే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ ఏకకాలంలో చేసిందని.. సీఎం కేసీఆర్‌ నాలుగేళ్లయినా రూ.లక్ష మాఫీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల రైతులపై ఎనలేని వాత్సల్యం చూపుతున్న కేసీఆర్‌.. సొంత రాష్ట్ర రైతులపై మాత్రం సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. ముందు మన రాష్ట్రంలోని రైతుల కడుపు నింపి, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల సమస్యలు పట్టించుకోవాలని కేసీఆర్‌కు హితవు పలికారు. రాజకీయాల కోసమే ఆయన పక్క రాష్ట్రాలకు వెళుతున్నారన్నారు.


రాష్ట్రంలో నకిలీ విత్తనాలతో రైతులు పంటలు నష్టపోతున్నారని, వారికి బీమాతో ధీమా ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగుల సమ్మె అంటే భయపడుతున్న ఈ ప్రభుత్వానికి రైతుల ఉద్యమాలంటే ఏమాత్రం భయం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలోని రైతులు ఆర్థిక ఇబ్బందులతో చనిపోయే పరిస్థితి రాకుండా చూడాలని అన్నారు. తెలంగాణలో పథకాలు ‘ఒంటె పెదవులకు నక్కలు ఆశ పడ్డ’ చందంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. పంజాబ్‌ రైతుల వద్దకు వెళ్లిన సీఎం కేసీఆర్‌.. 8 ఏళ్లలో ఏ ఒక్క తెలంగాణ రైతు దగ్గరికీ ఎందుకు వెళ్లలేదో సమాధానం చెప్పాలన్నారు. ‘‘ఓట్లేసి గెలిపించిన రైతులను పరామర్శించేందుకు వెళ్లని సీఎం కేసీఆర్‌.. పంజాబ్‌కు ఎందుకు వెళ్లారు?’’ అని ప్రశ్నించారు. తెలంగాణ రైతుల పరిస్థితి ఏంటని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అడిగారా? అని నిలదీశారు. కాగా, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌కు సంబంధించి ఎన్నో నిజాలు బయటికి వస్తున్నాయని, వాటిని తాను సేకరిస్తున్నానని చెప్పారు. హెటిరో పార్థసారథి ఎపిసోడ్‌ను ఆపేది లేదని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఏదో మాట్లాడారని, ఆయన ప్రశ్నపై తనకు అనేక అనుమానాలూ వచ్చాయని.. వాటిపైనా స్పందిస్తానని తెలిపారు. జనం డబ్బులు పార్థసారథి వద్ద ఉన్నాయని, ఆయన విషయాలూ చాలా ఉన్నాయని.. మూణ్నాలుగు రోజుల్లో అన్నీ బయట పెడతానని చెప్పారు.

Updated Date - 2022-05-25T08:17:11+05:30 IST