Advertisement
Advertisement
Abn logo
Advertisement

సర్కారు ‘చెత్త’శుద్ధి ఇలాగేనా?!

  • గ్రామీణంలో పడకేసిన జగనన్న స్వచ్ఛ సంకల్పం
  • పనిచేసే వాళ్లకంటే పర్యవేక్షించే వాళ్లే ఎక్కువ
  • లేని పనులు చేస్తున్నట్లు భ్రమలు
  • గ్రీన్‌ అంబాసిడర్లకు అందని జీతాలు
  • 18వేలు ఇస్తామన్న జగనన్న హామీ అమలేదీ?

 

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత ప్రభుత్వ హయాంలో.. గ్రామాల్లో చెత్తను సేకరించి పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు విశేష కృషి జరిగింది. స్వచ్ఛభారత్‌ పేరిట.. గ్రీన్‌ అంబాసిడర్ల ద్వారా చెత్త సేకరించడమే కాకుండా.. ఆ చెత్త నుంచి సంపదను సృష్టించే పరిస్థితి కూడా ఉండేది. అయితే.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ కార్యక్రమానికి పూర్తిగా స్వస్తి పలికేసింది!.  అభివృద్ధిని ఒక్క అడుగుకు ముందుకు పడనీయకుండా అడ్డుకున్న సర్కార్‌.. ఈ కార్యక్రమానికే.. జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరిట.. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ మిత్ర (క్లాప్‌ మిత్ర)గా పేరుమార్చి, పనులు చేస్తున్నట్లు భ్రమలు కల్పిస్తుంటే.. గ్రామస్థాయి ఉద్యోగులు, ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పుడు పూర్తిగా ప్రజలు చెల్లించే పన్నులతో గత అక్టోబరు నుంచి ఈ కార్యక్రమం చేపట్టి.. ఎక్కడలేని హంగామా చేస్తోంది. చెత్త సేకరణకు డబ్బు వసూలు చేపట్టి.. తామేదో అద్భుతాలు చేస్తున్నట్లు షో చేస్తోంది. గ్రామాల్లో ఒక్కో కార్మికుడికి 250 కుటుంబాలు అప్పగించారు. కానీ.. వారికి జీతాలే ఇవ్వకపోవడంతో పనులు తూతూమంత్రంగానే ఉంటోంది. 


పని తక్కువ.. బిల్డప్‌ ఎక్కువ!

పారిశుద్ధ్య కార్మికుడు చేసే పనిని ఫొటోలు తీసి పెట్టేందుకు, డ్యూటీకి వచ్చిన సమయం, దిగిన సమయం నోట్‌ చేసి యాప్‌లో అప్‌లోడ్‌ చేసే బాధ్యతలను పంచాయతీ కార్యదర్శికి అప్పగించారు. ఆయన ఫొటో తీసి పంపిస్తే మండల స్థాయిలో కమాండ్‌ కంట్రోల్‌ టీం పర్యవేక్షించి  జిల్లా స్థాయి కమాండ్‌ కంట్రోల్‌కు, జిల్లా స్థాయి కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బంది రాష్ట్ర స్థాయి కమాండ్‌ కంట్రోల్‌ రూంకు పంపించేందుకు వందల మంది అధికారులను నియమించారు. ఇలా గ్రామాల్లో చెత్త సేకరించే ఒక వ్యక్తి పనిని పర్యవేక్షించేందుకు వందల మంది అధికారులు పనిచేస్తున్నారు. ఇలా ప్రారంభించిన మూడు నెలలకే ఈ పథకం పడకేసింది.  కానీ ఫొటోల అప్‌లోడ్‌తో రోజూ బిల్డప్‌ ఇస్తున్నారు. పారిశుధ్య కార్మికుడు సేకరించే 250 కుటుంబాలను చేస్తున్న జియోట్యాగ్‌ ప్రక్రియ కూడా పెద్ద ప్రహసనంలాగా తయారైంది.  


జీతాలివ్వకపోవడంతో మొక్కుబడిగా పారిశుధ్యం 

2016 నుంచి పారిశుధ్య కార్మికులు ఈ పథకంలో పనిచేస్తున్నారు. మొదట్లో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఒక ఏడాదిపాటు ఒక్కొక్కరికీ నెలకు రూ.6 వేలు చెల్లించింది. ఆ తర్వాత జీతాల బాధ్యత పంచాయతీలకు అప్పగించారు. అయితే రాష్ట్రంలో మైనర్‌ పంచాయతీలేవీ పారిశుధ్య కార్మికులను భరించే స్థితిలో లేవు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఇవ్వాల్సిన వేతనాలు కూడా గ్రీన్‌ అంబాసిడర్లందరికీ దక్కలేదు. వారిలో ఎక్కువ మందికి బ్యాంకు అక్కౌంట్లు ఆధార్‌తో లింక్‌ కాలేదని, సీఎ్‌ఫఎంఎ్‌సలో ఐడీ క్రియేట్‌ కాలేదన్న సాకులు చెప్పి కొర్రీలు పెడుతున్నారు. లేని చెత్త సేకరణ కోసం ప్రభుత్వం మాత్రం ఆర్భాటంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమ ప్రచారానికి లక్షలు వెచ్చించి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ప్రారంభించింది. అయితే కార్మికుల జీతాల గురించి పట్టించుకోవడం లేదు. దీంతో పంచాయతీ కార్యదర్శులు  కార్మికులకు సమాధానం కూడా చెప్పుకోలేకపోతున్నారు.


కానీ.. పనులు చేయకపోయినా.. చేసినట్లు ఫొటోలు తీసి జగనన్న స్వచ్ఛ సంకల్ప ఆఫీసర్స్‌  యాప్‌లో అప్‌లోడ్‌ చేసి పైఅధికారులతో మెప్పు పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 శాతం పంచాయతీల్లో కూడా జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలు కాకపోయినా గ్రామాల్లో చెత్త సేకరణ చేస్తున్నట్లు భ్రమలు సృష్టిస్తున్నారు. ఇక,  జగన్‌ అధికారంలోకి రాగానే పారిశుధ్య కార్మికులకు రూ.18 వేల జీతం ప్రకటించారు. అయితే అమల్లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఐదేళ్లుగా పనిచేస్తున్న సుమారు 30వేల మంది గ్రీన్‌ అంబాసిడ్లకు ఇవ్వాల్సిన రూ.6 వేల జీతం కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇప్పటికే.. కొన్ని గ్రామాల్లో చెత్త సేకరణకు యూజర్‌ చార్జీలు చేపట్టినా.. అదికూడా ఎక్కడా పూర్తిగా సక్సెస్‌ కావడంలేదు. దీంతో.. అసలు ఈ పథకం అమల్లో ప్రభుత్వానికి సరైన చిత్తశుద్ధి లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.


Advertisement
Advertisement