అప్పు అంతేనా?

ABN , First Publish Date - 2022-07-19T09:22:36+05:30 IST

అప్పుల లెక్క తేలింది! ఆ లెక్కను బట్టి ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌ కోత ఎంతో కూడా తేలిపోనుంది.

అప్పు అంతేనా?

  • ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే
  • అప్పు 23 వేల కోట్లేనన్న సీఎం కేసీఆర్‌
  • ప్రభుత్వం ఇంత స్పష్టంగా చెప్పడం ఇదే!
  • అదే నిజమైతే.. బడ్జెట్‌లో 80 వేల కోట్ల కోత
  • ఈ ఏడాది 2.56 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌
  • అందులో అప్పుల అంచనా 53,970 కోట్లు
  • కానీ.. వచ్చేది 23 వేల కోట్ల రూపాయలే
  • గ్యారంటీ అప్పుల అంచనా 34,873 కోట్లు
  • కానీ.. అందులో10 వేల కోట్లు వచ్చినా గొప్పే
  • రెండూ కలిపి వచ్చేది కేవలం 33 వేల కోట్లే
  • కేంద్ర గ్రాంట్ల అంచనా 40 వేల కోట్లు
  • కానీ.. నికరంగా వచ్చేది 10 వేల కోట్ల లోపే
  • భూముల అమ్మకం ద్వారా 15 వేల కోట్లు!
  • అదీ అనుకున్నట్టు రాకపోతే మరింత కోతే


హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): అప్పుల లెక్క తేలింది! ఆ లెక్కను బట్టి ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌ కోత ఎంతో కూడా తేలిపోనుంది. గ్యారంటీ అప్పులపై కేంద్రం ఆంక్షల నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్రానికి ‘ఇంత అప్పు రావచ్చు.. అంత అప్పు రావచ్చు’.. అంటూ ఇన్నాళ్లూ ఏవేవో లెక్కలు వచ్చాయిగానీ, వాస్తవంగా వచ్చేది రూ.23 వేల కోట్లేనని సీఎం కేసీఆర్‌ ప్రకటనతో తేలిపోయింది. సీఎం చెప్పిన మాటే నిజమైతే ఈసారి బడ్జెట్‌లో భారీ కోత తప్పదు. ఎందుకంటే, 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వం రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. అందులో.. రూ.53,970 కోట్ల మేర అప్పు తీసుకుంటామని ప్రతిపాదించింది. అలాగే.. వివిధ కార్పొరేషన్ల కోసం గ్యారెంటీ అప్పులను కూడా బడ్జెట్‌లో పొందుపరచింది. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలకు రూ.12,198.70 కోట్లు, సాగునీటి ప్రాజెక్టుల కార్పొరేషన్లకు రూ.22,675.07 (రెండూ కలిపి రూ.34,873.77) కోట్ల అప్పు తీసుకుంటామని ప్రతిపాదించింది. అంటే... బడ్జెట్‌ అప్పులు, గ్యారెంటీ అప్పులు కలిపి దాదాపు రూ.88,843 కోట్లు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు సంబంధించి నీతిఆయోగ్‌ సిఫారసుల నేపథ్యంలో కేంద్రం నుంచి రూ.40 వేల కోట్ల దాకా గ్రాంట్ల కింద వస్తాయని రాష్ట్ర సర్కారు అంచనా వేసింది. అది కూడా కలిపితే ఇంచుమించు రూ.1.28 లక్షల కోట్లు. వీటిలో వాస్తవంగా ఏవేవి ఎంతెంత వస్తాయో పరిశీలిస్తే.. బడ్జెట్‌ అప్పు కింద వేసిన అంచనా రూ.53,970 కోట్లు కాగా నికరంగా వచ్చేది రూ.23 వేల కోట్లేనని సీఎం కేసీఆర్‌ తేల్చేశారు.


ఇక గ్యారంటీ అప్పుల లెక్క భారీగా రూ.34 వేల కోట్ల దాకా ఉన్నా.. వాస్తవంగా వచ్చేది రూ.10 వేల కోట్లకు మించి ఉండకపోవచ్చని అధికారుల అంచనా. గ్రాంట్ల విషయంలో కూడా గత ఏడాది అనుభవాన్ని బట్టి చూస్తే రూ.10 వేల కోట్లలోపే రావచ్చని అధికారులు భావిస్తున్నారు. అంటే.. మూడూ కలిపితే నికరంగా వచ్చేది దాదాపు రూ.43 వేల కోట్లు. వస్తుందనుకున్నదానికి.. వచ్చేదానికి మధ్య తేడా దాదాపు రూ.85 వేల కోట్లు.


రాష్ట్ర ఆదాయం..

జీఎ్‌సటీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు, మోటారు వాహన పన్నులు, కేంద్ర పన్నులు తదితరాల ద్వారా రాష్ట్రానికి సమకూరే ఆదాయం నెలకు సగటున రూ.10 వేల కోట్ల దాకా ఉంటుంది. ఉదాహరణకు.. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో రాష్ట్ర ఆదాయం రూ.9983 కోట్లు కాగా, మే నెలలో అది రూ.9973 కోట్లుగా ఉంది. జూన్‌ ముగిసేనాటికి రాష్ట్ర ఆదాయం రూ.30 వేల కోట్లుగా ఉంది. రానున్న నెలల్లో ఈ సగటు కొంత పెరగొచ్చు. ఏదేమైనా, నెలకు సగటున రూ.10 వేల కోట్లు అంటే.. ఏడాదికి దాదాపు రూ.1.2 లక్షల కోట్లు. కేంద్ర గ్రాంట్ల రూపంలో వస్తుందనుకుంటున్న రూ.10 వేల కోట్లు దానికి కలిపితే.. రూ.1.3 లక్షల కోట్లు అవుతుంది. దీనికి అప్పు రూ.23 వేల కోట్లు కలిపితే.. రూ.1.53 లక్షల కోట్లు. భూముల అమ్మకం ద్వారా ఈసారి ప్రభుత్వం రూ.15,500 కోట్లు వస్తాయని అంచనా వేసింది. లక్ష్యం మేర సొమ్ము వస్తే గొప్పే. అది కూడా కలిపితే రూ.1,68,500 కోట్లు. కార్పొరేషన్ల పేర తీసుకునే గ్యారంటీ అప్పులు రూ.10 వేల కోట్లు కూడా దానికి కలిపితే దాదాపు రూ.1,78,500 కోట్లు. అంటే బడ్జెట్‌ అంచనా 2.56 లక్షల కోట్లతో పోలిస్తే దాదాపు 78 వేల కోట్ల దాకా కోత పడినట్టే. భూముల అమ్మకాల ఆదాయం గనుక ప్రభుత్వం అనుకున్న స్థాయిలో లేకపోతే బడ్జెట్‌లో ఆ మేరకు మరింత కోత తప్పదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.17,700 కోట్లతో ప్రకటించిన దళిత బంధు వంటి పథకాల నేపథ్యంలో బడ్జెట్‌ వ్యయాలు భారీగా తగ్గనున్నట్లు సంకేతాలు వెలువడడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.


మరేంటి మార్గం?

అప్పులు, కేంద్ర గ్రాంట్ల రూపంలో ఆశించినంత మేర రాకపోవడంతో బడ్జెట్‌ కోతను నివారించడానికి ప్రభుత్వం ముందున్న మార్గాలు రెండే. ఒకటి.. ఇప్పటికే బడ్జెట్‌లో పెట్టిన భూముల అమ్మకం. రెండోది పన్నులను భారీగా పెంచేయడం. కానీ, ఇప్పటికే పలు పన్నులను భారీగా పెంచేశారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఈ ఏడాది పన్నులను పెంచే సాహసం ప్రభుత్వం చేయకపోవచ్చు. భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం కూడా నికరమేమీ కాదు. అనుకున్నదానికన్నా ఎక్కువగా రావచ్చు. తక్కువగా కూడా రావచ్చు. తక్కువగా వస్తే మాత్రం బడ్జెట్‌ వ్యయంలో మరింత కోత తథ్యం!!

Updated Date - 2022-07-19T09:22:36+05:30 IST