ప్లాస్టిక్ కాలుష్యం ప్రజల తప్పా?

ABN , First Publish Date - 2022-07-14T06:02:08+05:30 IST

జూలై8వ తేదీ ఆంధ్రజ్యోతిలో సునీతా నారాయణ్ రాసిన ‘ప్లాస్టిక్ కాలుష్యంపై పోరాటం’ వ్యాసంలో ‘మన పరిసరాలను కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు మనమే బాధ్యులం’ అనడం అభ్యంతరకరం...

ప్లాస్టిక్ కాలుష్యం ప్రజల తప్పా?

జూలై8వ తేదీ ఆంధ్రజ్యోతిలో సునీతా నారాయణ్ రాసిన ‘ప్లాస్టిక్ కాలుష్యంపై పోరాటం’ వ్యాసంలో ‘మన పరిసరాలను కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు మనమే బాధ్యులం’ అనడం అభ్యంతరకరం. ఇలాంటివే ఇంకొన్ని ప్రచారంలోకి వచ్చిన భావనలను చూద్దాం. ‘మనం మన శత్రువుని కలిశాం, అతడు మనమే’... ‘ప్రజలే కాలుష్యం చేస్తారు. ప్రజలే దానిని ఆపగలరు’... ‘తుపాకులు ప్రజలను చంపవు, ప్రజలే ప్రజలను చంపుతారు’... వీటిపై వివరణాత్మక విశ్లేషణకే ఈ స్పందన.


పర్యావరణ ప్రజా ఉద్యమాలను పక్కదోవ పట్టించడానికి చేసిన కార్పొరేట్ ప్రయత్నాలకివి ప్రతీకలు. ఆంగ్లంలో దీనిని డిఫ్లెక్షన్ అంటారు. నిజమైన కారకుల నుంచీ, పరిష్కారాల నుంచీ ప్రజల దృష్టి మరల్చడం లక్ష్యం. పొగాకు కంపెనీలు తమ హానికర వ్యాపారాన్ని నిషేధించకుండా, నియంత్రించకుండా నిరోధించే ప్రయత్నంలో వాడిన వ్యూహం నుంచి పుట్టుకొచ్చినవి. ఇవి విధాన నిర్ణేతలైన పాలకుల అధికారం, రాజకీయం, కార్పొరేట్ల ఉత్పత్తి నిర్ణయాల వల్ల గాక కేవలం తమ వల్లనే జరుగుతున్న హాని అనే అపరాధభావాన్ని ప్రజలలో కలిగించి వారిని నిర్వీర్యం చేస్తాయి. అమెరికాలోని వెర్మాంట్ రాష్ట్రంలో వాడేసిన పానీయ సీసాలను విచ్చలవిడిగా పొలాలలో పారవేయడంతో, ఆ గాజుముక్కలు గడ్డి మేసే ఆవుల మరణానికి కారణమయ్యాయి. ఆ రాష్ట్ర చట్టసభలో మూడవ వంతు ఉన్న రైతుల డిమాండ్ మేరకు వాడి పారేసే సీసాలపై నిషేధం విధించింది ఆ చిన్న రాష్ట్రం. తమ వ్యాపారానికి రానున్న ప్రమాదాన్ని గుర్తించిన సీసాలు తయారుచేసే కంపెనీలు, డిక్సీ కప్, పానీయ కంపెనీ కోకాకోలా తదితరులతో కలిసి ‘అమెరికాని అందంగా ఉంచుదాం’ అనే నాన్ ప్రాఫిట్ సంస్థని 1953లో ప్రారంభించారు. ఇది ‘స్వచ్ఛభారత్’కి ఆరు దశాబ్దాల ముందు. ఆ సంస్థ ఉద్దేశ్యం తమ వ్యాపారాలకి ఇబ్బంది లేకుండా, ఆర్థిక భారం లేకుండా, పారవేసే సీసాల సమస్యకి పరిష్కారం చూపడం. అందుకోసం వారు ప్రసార మాధ్యమాలలో ప్రజాసేవా ప్రకటనలు ఇచ్చేవారు. వాటి సారాంశం చెత్తకు మనమే బాధ్యులమనే భావన ప్రజలకు కలిగించడం.


ధరిత్రీ దినం మొదటి వార్షికోత్సవానికి 1971లో చేసిన ‘ద క్రైయింగ్ ఇండియన్’ అనే రెండు నిముషాల ప్రకటన పరిశీలిద్దాం. ఈ ప్రకటనకయిన ఖర్చుని 75 కార్పొరేషన్లు, అందులో ప్రధానంగా కోకాకోలా, పెప్సికోలా భరించాయి. ప్రకటనలో అమెరికా తెగ ఇండియన్ ఒక దోనెలో కూర్చుని తెడ్డు వేసుకుంటూ ముందుకెడుతూ ఉంటాడు. పక్కన నీటిలో చెత్త, కనుచూపు మేరలో ఫ్యాక్టరీ గొట్టాల నుంచి దట్టమైన పొగ. ఒడ్డుకు చేరితే చుట్టూ చెత్త. రెండడుగులు ముందుకు వేసి నిలబడితే పక్క రోడ్డుపై వేగంగా వెళుతున్న కారు కిటికీ నుంచి విసిరిన చెత్త సంచి అతని కాళ్ళపై పడి చిరిగి చెల్లాచెదురు. అది చూసిన అతని ముఖంలో విషాదంతో కుడి కంటి నుంచి ఒక కన్నీటి బొట్టు చెక్కిలి మీదకి జాలువారుతుంది. ఆ సమయంలో వెనుక నుంచి ఒక గొంతు ‘ప్రజలే కాలుష్యం చేస్తారు, ప్రజలే దానిని ఆపగలరు’ అని పలుకుతుంది.


ఇది అమెరికా ప్రజలని కదిలించింది. ప్రత్యేకించి చిన్నపిల్లలని. చెత్త తొలగించడం ఒక ఉద్యమంగా సాగింది. అంటే అంత విజయవంతంగా తమ బాధ్యతని, ప్రజలు తమదిగా అంగీకరించేలా చేయగలిగారు. దీనికి నేపథ్యం వివిధ రాష్ట్రాలలోని ‘బాటిల్ బిల్లులు’. వాటి ప్రకారం ప్రతి బాటిల్‌కీ కొంత రుసుము డిపాజిట్ చేయాలి. ఆ బాటిల్ తిరిగి ఇవ్వగానే చిల్లర దుకాణదారు డిపాజిట్ తిరిగి ఇచ్చేయాలి. బాటిళ్ళను సేకరించి తిరిగి ఇచ్చినందుకు టోకు వ్యాపారి చిల్లర దుకాణదారుకి కొంత సొమ్ము చెల్లించాలి. చెత్తలో చేరకుండా తిరిగి వచ్చిన బాటిళ్ళ పునర్వినియోగ బాధ్యత పానీయ కంపెనీలది. ఆ బాధ్యతని స్వీకరించడం భారంగా భావించిన కార్పొరేట్లు ‘బాటిల్ బిల్లులు’ చట్టాలు గాకుండా నిర్వీర్యం చేయడానికి ఈ పక్కదోవ వ్యూహాన్నెంచుకున్నారు. విజయులయ్యారు. ప్రజలు మోసపోయారు. ఫెనిస్‌డనవే అనే చరిత్ర ప్రొఫెసర్ ఇలాటి మోసపూరిత విధానాలను అధ్యయనం చేసి ‘సీయింగ్ గ్రీన్’ అనే పుస్తకం రాశారు. క్లైమేట్ సంక్షోభంలో శిలాజ ఇంధన పాత్ర తిరస్కరిస్తూ ఇంధన కంపెనీలు వాడుతూ వస్తున్న పక్కదోవ వ్యూహాన్ని ప్రొ. మైఖేల్ మాన్ ‘ద న్యూ క్లైమేట్ వార్’ అనే రచనలో వివరిస్తూ ‘ద క్రైయింగ్ ఇండియన్’ గురించీ రాశారు. ‘మన పరిసరాలను కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు మనమే బాధ్యులం’ అన్నది ఇదే కోవకు చెందుతుంది. రెండు దశాబ్దాలకు పైగా పర్యావరణ పత్రిక నడుపుతున్న ఈ వ్యాస రచయిత్రి కార్పొరేట్ భావజాల ఉచ్చులో నుంచి బయట పడకపోవడం బాధాకరం. ఆమె స్థాయిని బట్టి ఆమె చెప్పినది సత్యమని నమ్మి, ప్రజలు తమది కాని తప్పుని తమనెత్తిపై వేసుకోవాలా?

డా. కలపాల బాబూరావు

Updated Date - 2022-07-14T06:02:08+05:30 IST