భూముల వేలం ప్రజాప్రయోజనాలకేనా?

ABN , First Publish Date - 2021-06-16T06:26:23+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం మరొకసారి ప్రభుత్వ భూముల అమ్మకానికి తెరలేపింది. ఇప్పుడు జరుగుతున్నది బహిరంగ వేలం మాత్రమే. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి వివిధ రూపాలలో...

భూముల వేలం ప్రజాప్రయోజనాలకేనా?

తెలంగాణ ప్రభుత్వం మరొకసారి ప్రభుత్వ భూముల అమ్మకానికి తెరలేపింది. ఇప్పుడు జరుగుతున్నది బహిరంగ వేలం మాత్రమే. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి వివిధ రూపాలలో పెద్ద ఎత్తున భూ బదిలీ జరుగుతూనే ఉంది. ప్రభుత్వ భూముల వేలం అనేదాన్ని కేవలం ఆదాయం సమకూర్చుకునే ప్రక్రియగా చూడకూడదు. అందులో అంతకన్నా లోతైన సామాజిక, ఆర్థిక, వ్యవస్థాగత అంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ వేలంలో ఒక పెద్ద భూ దందా దాగి ఉంది. 


గత ఏడు సంవత్సరాల నుంచి సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక పార్కులు, ఫార్మా సిటీ, ఫుడ్ పార్కులు, జౌళి పార్కుల పేరు మీద లక్షల ఎకరాల భూమిని సామాన్య రైతుల నుంచి ప్రభుత్వం తన సార్వభౌమ అధికారాన్ని ఉపయోగించి సేకరిస్తోంది. అంతే కాకుండా గత మూడు నాలుగు సంవత్సరాలలో రైతు వేదికలు, వైకుంఠ దామాలు, రెండు పడకల గదుల ఇళ్ల పేరు మీద పేదలకు చెందిన భూములను నోటీసు, నష్టపరిహారం కూడా ఇవ్వకుండా గుంజుకున్న ఘటనలు కొన్ని వందలు జరిగాయి. కొన్ని చోట్ల రైతులు ఆత్మహత్యలకు సైతం ప్రయత్నించారు. మరికొన్ని చోట్ల, ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో, చట్టంలో వెసులుబాటు లేకపోయినా రెండు పడకల గదుల ఇళ్ళ కోసం, దళితులకు భూమి ఇవ్వడం కోసం, తమకు అనుకూలురైన పెద్దల దగ్గర తక్కువ ధర కలిగిన భూములు తీసుకుని, వారికి ఎక్కువ ధర కలిగిన భూములను బదులుగా ఇచ్చారు. అక్కడ మాత్రం భూమికి భూమి పథకం అమలు చేశారు. వారికి భూమి ఇవ్వటానికి అవసరమైతే అసైన్మెంట్ దారుల నుంచి మోసపూరితంగా, బలవంతంగా లాక్కున్నారు. కానీ చట్టంలో వెసులుబాటు ఉన్నా, సాగునీటి ప్రాజెక్టుల్లో పూర్తిగా భూములు కోల్పోయిన సన్న చిన్నకారు రైతులకు ఒక్క ఎకరం భూమి కూడా కల్పించలేదు. పూర్తిగా భూమి మీదే ఆధారపడి బతికే వారికి, సేకరించిన భూమికి బదులు భూమి కల్పించే ఆలోచన చేయకుండా, వారికి రిజిస్ట్రేషన్ విలువల ప్రకారం నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుందీ ప్రభుత్వం. ఆ నష్టపరిహారం బహిరంగ మార్కెట్‌లో ఉన్న విలువ కన్నా 5 నుండి 10 రెట్లు తక్కువ ఉంటుంది. అందుకోసమే గత ఏడు సంవత్సరాలలో ఒక్కసారి కూడా భూముల మార్కెట్ విలువను సవరించలేదు. దాంతో ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారంతో తమకు ఇంతకు ముందున్న భూమిలో పావు వంతు కూడా కొత్తగా భూమిని కొనుక్కోలేని పరిస్థితి ఉంది. తద్వారా గత ఏడు సంవత్సరాలలో లక్షలమంది చిన్న సన్నకారు రైతులు పూర్తి భూమి లేని వారుగా లేదా అంతకుముందు కన్నా తక్కువ భూమి కలిగిన వారుగా మారారు. అంటే పేదల నుంచి ప్రభుత్వానికి చవకగా ఎకరానికి 5 నుండి 10 లక్షల విలువకు భూములు బదిలీ అయ్యాయి. శాసన   సభలో మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తంలో మారుమూల ప్రాంతాల్లోనూ ఎకరానికి 10 లక్షలు తక్కువ లేదని, మిగిలిన ప్రాంతాలలో భూమి విలువ ఎకరాకు 50 లక్షల నుండి కోటి రూపాయల వరకు పెరిగిందని సెలవిచ్చారు. తద్వారా తనే లక్షల రైతు కుటుంబాలకు కొన్ని వేల కోట్ల రూపాయల మేరకు అన్యాయం చేసినట్లు ఒప్పుకున్నారు.


సామాన్య రైతుల దగ్గర నుండి భూములు తీసుకునేటప్పుడు పాత రిజిస్ట్రేషన్ విలువల ఆధారంగా భూములకు విలువ కట్టడం, లేదా నష్టపరిహారం కూడా ఇవ్వకుండా కుట్రపూరితంగా, బలవంతంగా భూములను గుంజుకోవడం చేసి, తన దగ్గర ఉన్న భూములు అమ్ముకునేటప్పుడు మాత్రం వేలం వేసి అత్యధిక ధరకు అమ్ముకుంటోందీ ప్రభుత్వం. ఇది భూ దందా కాదా? మరి ఫార్మాసిటీ, పారిశ్రామిక పార్కుల కోసం భూ సేకరణ చేపడుతున్న యాచారం, జహీరాబాద్ ప్రాంతాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికవసతుల కార్పొరేషన్  (టిఎస్ఐఐసి) బహిరంగ వేలం ద్వారా రైతుల నుండి భూములు కొనుగోలు చేయచ్చు కదా. అదే టిఎస్ఐఐసి, డెక్కన్ ఇనఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌లు ఏళ్ల క్రితం ప్రజా ప్రయోజనం పేరు మీద ఎకరా 2-3 లక్షల రూపాయల లోపు ధరతో పేదల నుంచి, ప్రభుత్వం నుంచి భూములను సేకరించి, ఇప్పుడు కోట్ల రూపాయలకు వాటిని బహిరంగ వేలంలో అమ్ముకుంటున్నాయి. ఆ వేలంలో సామాన్య రైతులు, మధ్యతరగతి వారు పాల్గొని కొనగలరా? ఈ మొత్తం ప్రక్రియ ద్వారా సామాన్య, పేద రైతుల నుండి భూములను తక్కువ ధరకు తీసుకుని వాటిని పెద్ద మొత్తంలో కొనగలిగిన పెట్టుబడిదారీ సంస్థలకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ధారాధత్తం చేస్తుంది. వారు తమ సొంత డబ్బులతో ఏమీ వాటిని కొనరు. బ్యాంకుల నుండి కోట్ల రూపాయల ప్రజా ధనాన్నే ఋణంగానో, షేర్ మార్కెట్ల నుండి వచ్చిన పెట్టుబడులతోనో వాటిని కొంటారు. మళ్ళీ ఆ భూములనే తనఖా పెట్టి వందల కోట్ల అప్పులు తీసుకుంటారు. ఆ తరువాత బ్యాంకు ఋణాలను చెల్లిస్తారనే నమ్మకం ఏమీ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఇందూ ప్రాపర్టీస్, లేపాక్షి భూముల విషయంలో చేసిన పని అదే. అనేక సెజ్‌లు, పారిశ్రామిక పార్కుల విషయంలోనూ జరిగిందిదే.


ప్రస్తుతం అమ్మకానికి పెట్టిన భూములు ఎటువంటి ప్రజా ప్రయోజనానికి పనికి రావని, ప్రభుత్వం వాటిని ఆక్రమణల నుండి రక్షించలేకపోతుందనే కారణాలతో అమ్ముకుంటోంది. అంటే ఈ రాష్ట్రంలో ఇంక ఏ ప్రజా ప్రయోజనాలు మిగల లేదని అర్థమా? పేదలకు, మధ్యతరగతికి కావలసిన ఇళ్ళు, స్కూళ్లు, దవాఖానాలు, హాస్టళ్లు, సౌచాలయాలు, కమ్యూనిటీ హాళ్లు, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రజల ఉమ్మడి అవసరాలకు కావలసిన వసతులు, శ్మశానాలు, రైతులకు కావలసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు, గిడ్డంగులు వంటి వాటికేవీ ఇవి పనికి రావా? ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఆహార పరిశ్రమల పార్కులకు ఇవి పనికి రావా? ఒక పక్క ఇవే ప్రయోజనాల కోసం రైతుల నుండి తక్కువ ధరకు బలవంతంగా భూ సేకరణ చేస్తూ లేదా అద్దె భవనాలలో వాటిని నడుపుతూ మరొక పక్క తన దగ్గర ఉన్న భూములను ఎక్కువ ధరకు అమ్ముకోవడం ఒక ప్రజా ప్రభుత్వం చేయదగిన పనేనా? సామాన్య ప్రజలకు ఇళ్లు కల్పించడానికి ఉద్దేశించిన హౌసింగ్ బోర్డు భూములు కూడా ఇప్పుడు వేలంలో అమ్మకానికి పెట్టింది. అంటే ఈ రాష్ట్రంలో ఇంక సొంత ఇల్లు అవసరం ఉన్న పేదలు ఎవరూ లేరనా? డబుల్ బెడ్ రూమ్స్‌ పథకం ఇంక అటకెక్కినట్టేనా?


ప్రభుత్వ భూమి అంటే అది పేదల పక్షాన ప్రభుత్వం ధర్మకర్తగా వ్యవహరించి విస్త్రత ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలని. అంటే వ్యవసాయ భూమి అయితే పేదలకు భూ పంపిణీ చేయడం, ఇతర భూమి అయితే పేదలకు, సామాన్యులకు అందుబాటులో ఇళ్లు, ఇతర సామూహిక అవసరాలైన విద్య, వైద్యం, మౌలిక వసతులకు, వారి వృత్తులకు ఉపయోగపడే అవసరాలకు ఉపయోగించడం. తరువాతి తరాలకు ఒక ఆసరాగా అందించడం. ప్రస్తుతం వేలం వేయబోతున్న భూములపై ప్రయోజనాలకు వేటికీ అవసరం లేదనే నిర్ధారణకు ప్రభుత్వం ఎలా వచ్చింది? అటువంటి పారదర్శక, భాగస్వామ్య అధ్యయనం ఏమయినా చేసిందా, జిల్లాల వారీగా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు, స్థానిక సంస్థలు ఆ మూల్యాంకనంలో భాగస్వాములు అయ్యారా? స్థానిక ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారా? అటువంటి ప్రక్రియ ఏమీ చేపట్టకుండా ఈ భూములు ఎటువంటి ప్రజా ప్రయోజనాలకు అవసరం లేదనే నిర్ణయానికి ఎలా వచ్చారు? అంటే భవిష్యత్తులో ఇంక ఏ ప్రజా ప్రయోజనానకి భూమిని సేకరించరా? అలాగే సదరు భూములను రక్షించుకోవడం కష్టమవుతుందనే కారణం. అసలు ఎవరి నుండి రక్షించవలసి వస్తుంది? విలువైన ఖాళీ ప్రభుత్వ భూములను అధికార పార్టీ వారు, వారి తాబేదార్లు కాకుండా ప్రస్తుతం మరెవరైనా కబ్జా చేయగలరా? వేలం వేయడం ద్వారా వారి నుండి ఈ భూములు కాపాడబడతాయా లేక వేలం పేరు మీద వారికే చవకగా కట్టబెట్టడం జరుగుతుందా? ఈ ప్రశ్నలకు అతి సామాన్యులు కూడా సరైన సమాధానం చెప్పగలరు. ఇది పాలనా లేక భూ దందానా ప్రభుత్వం స్పష్టం చేయాలి. 


2002–03లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెలంగాణ రెవెన్యూ చట్టంలో సవరణ తెచ్చి ప్రభుత్వ భూములను వేలం ద్వారా అమ్మటానికి అవకాశం కల్పించింది. అప్పుడు ఇదే చంద్రశేఖర్ రావు గారు, ఆంధ్రా నాయకులు తెలంగాణ భూములు కొల్లగొట్టటానికి తెలంగాణ చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆ చట్ట సవరణను వ్యతిరేకించారు. యావత్తు తెలంగాణ సమాజం, ఉద్యమకారులు ఆయన వెంట నిలిచారు. ఇప్పుడు అదే చట్ట సవరణను ఆసరా చేసుకుని భూములను తెగనమ్ముతున్నారు. మరి ఇది తెలంగాణ ప్రజల, ప్రయోజనాల కోసం పని చేసే ప్రభుత్వమేనా? ఈ భూములు అమ్మటం ద్వారా మహా అయితే వచ్చేది 10,000 కోట్లు. అయితే అది ఒక్క సంవత్సరంలో ప్రభుత్వం చేసిన అప్పులపై కట్టే వడ్డీకి కూడా సరిపోదు. మరి వచ్చే సంవత్సరం ఏం అమ్మి వడ్డీలు కడుతుందో ప్రభుత్వం చెప్పాలి. సాగునీటి ప్రాజెక్టుల్లో చేతుల మారిన కమీషన్లంత కూడా ఈ భూములమ్మితే రాదు. నిజాయితీ ఉంటే ఆ డబ్బును సమకూర్చుకోవడం ప్రభుత్వానికి ఒక లెక్క కాదు. కాని ఇది కేవలం అదనపు నిధులు కోసం చేసే పని కాదు. ఇది ఒక పెద్ద కుట్రపూరిత చర్య, భూ దందా. సమాజంలోని ఆర్థిక అంతరాలను, సమతుల్యతను తీవ్రంగా ప్రభావితం చేసే అంశం. ఒక పక్క పేదలను, సామాన్యులను భూమి నుండి దూరం చేస్తూ, తన చర్యల ద్వారా భూమి ధరలను విపరీతంగా పెంచి వేసి, సామాన్యులెవ్వరూ గుంట భూమి కొనలేని పరిస్థితి కల్పించి, ఉన్న ప్రభుత్వ భూములన్నీ కొనగలిగిన బడా పారిశ్రామిక, రియలెస్టేట్ పెట్టుబడిదారులకు, ముఖ్యంగా తనవారికి, ధారా దత్తం చేసి, తద్వారా ఇప్పటికే ఆ చుట్టుపక్కలగల వారి భూముల విలువలు అమాంతం పెరిగేలా చేయడమే ఈ భూమి అమ్మకాల ఉద్దేశం. ఈ మొత్తం ప్రకియలో తమ వారి సంపద మరిన్ని రెట్లు పెరుగుతుంది. తమ రాజకీయ అధిపత్యం మరింత సుస్థిరమవుతుంది. 

రవి కుమార్

న్యాయవాది

Updated Date - 2021-06-16T06:26:23+05:30 IST