సమన్వయం కుదిరేనా?

ABN , First Publish Date - 2022-10-08T08:52:26+05:30 IST

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి ఒక్కసారిగా పరీక్ష సమయం ఎదురైంది.

సమన్వయం కుదిరేనా?

  • అటు రాహుల్‌ పాదయాత్ర.. 
  • ఇటు మునుగోడు ఉప ఎన్నిక ..
  • మధ్యలో కాంగ్రెస్‌ ఉక్కిరి బిక్కిరి
  • ఉధృత ప్రచార సమయంలోనే తెలంగాణలో రాహుల్‌ పాదయాత్ర 

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి ఒక్కసారిగా పరీక్ష సమయం ఎదురైంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రేసులో కొనసాగే విషయంలో కీలకమైన మునుగోడు ఉప ఎన్నికలు, దేశంలో కాంగ్రెస్‌ భవిష్యత్తుకు కీలకమైన రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ఒకేసారి వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 17న నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తవుతుంది. అక్కడి నుంచి ప్రధాన పార్టీల పోటా పోటీ ప్రచారం ముమ్మరం కానుంది. నవంబరు 3న పోలింగ్‌ ఉంటుంది. మరో వైపున భారత్‌ జోడో యాత్రలో భాగంగా ఈ నెల 24న రాహుల్‌ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. 15 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. అంటే మునుగోడు పోలింగ్‌కు వారం ముందు తెలంగాణలోకి ప్రవేశించనున్న రాహుల్‌ పాదయాత్ర.. పోలింగ్‌ పూర్తయి ఫలితాలు వెలువడిన తర్వాత కూడా కొనసాగనుంది. అయితే ఇటు రాహుల్‌గాందీ పాదయాత్ర, అటు మునుగోడు ఉప ఎన్నిక పార్టీకి అత్యంత కీలకమైనవి కావడంతో రెంటినీ సమన్వయం చేసుకోవడం టీ కాంగ్రెస్‌ నేతలకు సవాలుగా మారింది. 


వాస్తవానికి గత ఉప ఎన్నికలకు భిన్నంగా మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ముందే ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పటికే క్షేత్రస్థాయి ప్రచారాలనూ నిర్వహిస్తోంది. స్థానిక నేతల అభిప్రాయాలు, సర్వేల ఆధారంగా అభ్యర్థిని నిర్ణయించిన నేపథ్యంలో ఈ విషయంలో సానుకూలత కూడా ఉంది. అయితే కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలతో ఆర్థిక పరంగా పోటీ పడలేక పోతున్నామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఆ రెండు పార్టీలూ ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పలు మార్లు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌కు వారం ముందు ప్రారంభం కానున్న రాహుల్‌ పాదయాత్ర.. మునుగోడు ఉప ఎన్నికకు ఉపకరిస్తుందా? లేక సమస్యలు సృష్టిస్తుందా? అన్న చర్చ కూడా కాంగ్రె్‌సలో నడుస్తోంది. పార్టీ రాష్ట్ర నాయకత్వ మంతా రాహుల్‌ పాదయాత్ర ఏర్పాట్లపైనే దృష్టి కేంద్రీకరిస్తే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. అదే సమయంలో రాహుల్‌ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తే.. ఉప ఎన్నికలపై అది సానుకూల ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాలూ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ఉప ఎన్నికల ఫలితం తర్వాతా రాహుల్‌ పాదయాత్ర తెలంగాణలో కొనసాగనున్న నేపథ్యంలో.. ఆ ఫలితం ప్రభావమూ రాహుల్‌ యాత్రపైన పడే అవకాశం ఉందంటున్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రె్‌సకు సానుకూల ఫలితం వస్తే రాహుల్‌ పాదయాత్రకు ప్రజల నుంచి ఆదరణ మరింత పెరుగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. చేదు ఫలితం ఎదురైతే.. దాన్ని అడ్వాంటేజీగా తీసుకుని రాహుల్‌ పాదయాత్రపైన బీజేపీ, టీఆర్‌ఎ్‌సలు మాటల దాడులు పెంచే అవకాశం ఉంటుందనీ అభిప్రాయపడుతున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నికలు, రాహుల్‌ పాదయాత్రకు ముడి పెట్టడం సరికాదని,  రాహుల్‌ గాంధీ చేపట్టిన పాదయాత్ర.. బీజేపీ విచ్ఛిన్నకర విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసే విశాలమైన దృక్పథంతో చేపట్టిన యాత్ర అని పార్టీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. 


నేడు గాంధీభవన్‌కు ఖర్గే

ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేసిన కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే  శనివారం గాంధీ భవన్‌కు వస్తున్నారు. ఉదయం 10 గంటలకు నేరుగా గాంధీభవన్‌కు చేరుకుని మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడే ఉండి పార్టీ ముఖ్యనేతలు, పీసీసీ సభ్యులను ఓటు వేయాలని కోరనున్నారు. కాగా.. ఖర్గేకు మద్దతుగా ఓటు వేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఆయన అన్ని విధాలుగా తగిన వ్యక్తి అని, హైదరాబాద్‌ రాష్ట్రానికి చెందిన వాడిగా ఆయనకు తెలంగాణలో సమస్యలూ తెలుసునని పేర్కొన్నారు.

Updated Date - 2022-10-08T08:52:26+05:30 IST