బడ్జెట్‌ పెట్టడం ఇలాగేనా?.. సర్కారును కడిగేసిన కాగ్‌

ABN , First Publish Date - 2022-09-22T10:05:12+05:30 IST

బడ్జెట్‌ పెట్టడం ఇలాగేనా?.. సర్కారును కడిగేసిన కాగ్‌

బడ్జెట్‌ పెట్టడం ఇలాగేనా?.. సర్కారును కడిగేసిన కాగ్‌

ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం.. పారదర్శకత లేదు

వైసీపీ సర్కారును కడిగిపారేసిన కాగ్‌

2020-21 ఆర్థిక విధానాలపై  నివేదిక 


అమరావతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం 2020-21లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వహించిన తీరును కాగ్‌ తన నివేదికలో కడిగి పారేసింది. ముఖ్యంగా బడ్జెట్‌ ప్రక్రియపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అతి కీలకమైన బడ్జెట్‌ను పెట్టడం ప్రభుత్వానికి చేతకావడం లేదని దుయ్యబట్టింది. రెవెన్యూ వ్యయాన్ని క్యాపిటల్‌ వ్యయంగా చూపించారని, ఇది ఆర్థిక నిబంధనల ఉల్లంఘనేనని స్పష్టంగా పేర్కొంది. ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న లక్షల పీడీ ఖాతాల వల్ల ఆర్థిక వ్యవస్థలో స్పష్టత, పారదర్శకత లోపించిందని, ఆ పీడీ ఖాతాలను ఎత్తేయాల్సిన అవసరం ఉందని కాగ్‌ తన నివేదికలో అభిప్రాయపడింది. జీఎ్‌సడీపీలో ఏపీ టాప్‌ అని సీఎం జగన్‌ గత శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. అయితే గత ఐదేళ్లతో పోల్చితే 2020-21లో నమోదైన 1.58 శాతం వృద్ధి రేటే అతి తక్కువని కాగ్‌ కుండబద్దలు కొట్టింది. రెవెన్యూ లోటు భారీగా ఉందని, విపరీతమైన అప్పులతో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి తూట్లు పొడిచారని పేర్కొంది. పంచాయతీలకు సంబంధించి కరెంటు బిల్లుల చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని స్పష్టం చేసింది. అలాగే, ఒక కార్పొరేషన్‌కు మరో కార్పొరేషన్‌కు మధ్య లావాదేవీలు జరిగాయని, ఏపీఎ్‌సడీసీ నుంచి మరో 8 కార్పొరేషన్లకు డబ్బుల బదిలీ జరిగిందని పేర్కొంది. కంపెనీల చట్టం ప్రకారం ఒక కార్పొరేషన్‌ నుంచి మరో కార్పొరేషన్‌కు డబ్బులు బదిలీ చేయకూడదు. అది చట్ట విరుద్ధం కూడా. ఖర్చులకు సరిపడా ఆదాయం లేక తాత్కాలికంగా ఆర్‌బీఐ నుంచి తీసుకునే వేస్‌ అండ్‌ మీన్స్‌ అప్పుల విషయంలో జగన్‌ సర్కార్‌ అన్ని పరిమితులు దాటేసిందని విమర్శించింది. సాధారణంగా వాడుకోవాల్సిన పరిమితి కంటే 73.16 శాతం ఎక్కువగా వాడినట్టు కాగ్‌ తన నివేదికలో వెల్లడించింది. 


రూ.86,259 కోట్ల అప్పు దాచివేత 

2021 మార్చి నాటికి కార్పొరేషన్ల ద్వారా తీసుకునే ఆఫ్‌ బడ్జెట్‌ అప్పులు రూ.86,259.82 కోట్లకు చేరుకున్నాయి. ఈ అప్పులను రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్‌ డెట్‌లో చూపడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక లోటు లెక్కించే సమయంలో రూ.86,259 కోట్ల అప్పును కాగ్‌ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ అప్పును కూడా రుణాలకు కలిపితే రాష్ట్ర పబ్లిక్‌ డెట్‌, ఆర్థిక లోటు మరింత పెరుగుతాయి. ఇలా అప్పులు దాచడం అసెంబ్లీ పర్యవేక్షణ బాధ్యతను, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని కాగ్‌ హెచ్చరించింది. 


సొంత సవరణలూ ఉల్లంఘన 

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం కేంద్ర చట్టం అయినప్పటికీ 2020 డిసెంబరులో జగన్‌ ప్రభుత్వం దీనికి కొన్ని సవరణలు చేసింది. ఈ సవరణలు 2020 ఆగస్టు 30 నుంచే అమల్లోకి వస్తాయని చెప్పింది. ఇదే సవరణలను 2015-16 నుంచి 2020-21 వరకు వర్తింపజేశారు. 2020లో సవరణలు చేసి 2015-16 నుంచి అమలు చేయడమేంటనేది కాగ్‌ ప్రశ్న. పోనీ... రాష్ట్ర ప్రభుత్వం ఈసవరణలకు ఏమైనా కట్టుబడి ఉందా అంటే అదీ లేదు. ఆర్థిక లోటు, జీఎ్‌సడీపీలో అప్పుల శాతం అంశాల్లో ఈసవరణలనూ ఉల్లంఘించిందని కాగ్‌ పేర్కొంది. 


పరిమితి దాటిన అప్పులు 

2003-04లో కేంద్రం చేసిన ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్రం అప్పులు ఏ ఏడాది కూడా జీఎ్‌సడీపీలో 25 శాతానికి మించకూడదు. 2018లో  కేంద్రం ఈ చట్టానికి మరో సవరణ చేసింది. అన్ని రాష్ర్టాల అప్పులు, దేశం అప్పులు కలిపి దేశ జీడీపీలో 60 శాతం మించకూడదు. అందులో 40 శాతం కేంద్రానివి ఉండొచ్చని సవరించింది. అంటే జీఎ్‌సడీపీలో రాష్ర్టాల అప్పులు 20 శాతానికి మించకూడదు. కానీ 15వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం ఏపీ పబ్లిక్‌ డెట్‌ రాష్ట్ర జీఎ్‌సడీపీలో 34 శాతం ఉన్నాయి. వీటికి కార్పొరేషన్ల గ్యారెంటీ, నాన్‌ గ్యారెంటీ అప్పులు కూడా కలుపుకొంటే ఆ శాతం మరింత పెరుగుతుందని 15వ ఆర్థిక సంఘం నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ అప్పు పెండింగ్‌ బిల్లులతో కలిపి రూ.8.5 లక్షల కోట్లు ఉంది. జీఎ్‌సడీపీ అంచనా రూ.10.85 లక్షల కోట్లు. జీఎ్‌సడీపీలో ఈ అప్పుల శాతం 75 శాతం నుంచి 80 శాతం వరకు ఉన్నాయి. 


చేతకావడం లేదు

రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్‌ పెట్టడం, నిర్వహించడం చేతకావడం లేదని కాగ్‌ విమర్శించింది. ఖర్చులు అంచనా వేయడంలో, నిధులు కేటాయించడం ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌కు మించి ఖర్చు చేస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, దీన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీనికి కారణం అడిగితే ఏజీ కార్యాలయానికి ప్రభుత్వం సమాధానం ఇవ్వడం లేదని కాగ్‌ పేర్కొంది. జవాబుదారీతనం లోపించిందని విమర్శించింది. 


పీడీ ఖాతాలను మూసేయాలి: రాష్ట్రంలో పీడీ ఖాతాల వల్ల ఆర్థిక వ్యవస్థలో స్పష్టత, పారదర్శకత లోపించాయని కాగ్‌ తీవ్రవ్యాఖ్యలు చేసింది. 2020-21లో బడ్జెట్‌లో మూడోవంతును ఈ పీడీ ఖాతాలకు మళ్లించారని పేర్కొంది. ఆ పీడీ ఖాతాల ఓనర్లు అంటే వివిధ ప్రభుత్వ సంస్థల కమిషనర్లు, ఎండీలు వాడుకోలేదని వెల్లడించింది. కానీ, ఖర్చు ఎక్కువ జరిగినట్టు కనిపిస్తోందని, దీనిపై అసెంబ్లీ పరిశీలన లోపించిందని కాగ్‌ వ్యాఖ్యనించింది. సీఎఫ్‌ ఎంఎస్‌ వ్యవస్థకు ముందు, ఆ వ్యవస్థ వచ్చాక పీడీ ఖాతాల్లోని బ్యాలెన్స్‌ సరితూగడం లేదని పేర్కొంది. ఈ పీడీ ఖాతాల వల్ల బడ్జెట్‌ ప్రక్రియ హాస్యాస్పదమైందని, వీటిని మూసేయాల్సిన అవసరముందని కాగ్‌ తెలిపింది. 2020-21లో భారీ రెవెన్యూ లోటు కనపడుతోందని కాగ్‌ తెలిపింది. ఇది 35,541 కోట్లు ఉందని వెల్లడించింది. కార్పొరేషన్‌ అప్పులను పరిగణనలోకి తీసుకోకుండా లెక్కిేస్తనే ఇంత భారీ రెవెన్యూ లోటు తేలింది. కార్పొరేషన్ల అప్పులు రూ.86,259 కోట్లును పరిగణనలోకి తీసుకుంటే మరింత పెరుగుతుంది. స్పెషల్‌ బిల్లుల విషయంలో వివరణ అడిగితే ప్రభుత్వం అబద్ధం చెప్పిందని కాగ్‌  స్పష్టం చేసింది. 


ఆదుకున్న కేంద్రం

2020-21లో రాష్ట్ర సొంత ఆదా యం - రూ.57,409 కోట్లు. జీఎ్‌సడీపీలో దీని వాటా 5.82ు. అంతకుముందు ఏడాదితో పోల్చితే సొంత ఆదాయం తగ్గింది. కానీ మొత్తం ఆదాయం 2019-20 కంటే 2020-21లో 5.5 శాతం మేర పెరిగింది. కేంద్రం నుంచి నిధులు గ్రాంట్లు, పన్నుల్లో వాటా రూపంలో, జీఎ్‌సటీ పరిహారం రూపంలో ఎక్కువ నిధులు వచ్చాయి. దీంతో రాష్ట్ర సొంత ఆదాయం తగ్గ్గినా మొత్తం ఆదాయం పెరిగిందని కాగ్‌ పేర్కొంది. 


ఆర్థిక నిబంధనలకు విరుద్ధం  

రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలు సృష్టించి, వాటి ద్వారా ప్రభుత్వానికి ఏదైనా ఆదాయం వచ్చే పనులపై పెట్టిన ఖర్చును క్యాపిటల్‌ వ్యయంగా పరిగణిస్తారు. కానీ, జగన్‌ ప్రభుత్వం  రెవెన్యూ వ్యయాన్ని క్యాపిటల్‌ వ్యయంగా చూపించే ప్రయత్నం చేసిందని, ఇది ఆర్థిక నిబంధనలకు విరుద్ధమని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. 2020-21లో కొన్ని పథకాలపై చేసిన ఖర్చును జగన్‌ ప్రభుత్వం క్యాపిటల్‌ వ్యయంగా ప్రకటించి కాగ్‌కు పంపింది. దీన్ని కాగ్‌ ఆక్షేపించింది. 2020 జూలై 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రూ.6,278 కోట్లు ఖర్చయిందని, దీన్ని క్యాపిటల్‌ వ్యయం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి తమకు పంపిందని కాగ్‌ చెప్పింది. ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇస్తే లబ్ధిదారుడికి క్యాపిటల్‌ వ్యయం అవుతుంది కానీ, రాష్ర్టానికి ఎలా అవుతుందని కాగ్‌ ప్రశ్నించింది. రూ.6,278 కోట్లను రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ వ్యయం కింద చూపించాలని సూచించింది. 



Updated Date - 2022-09-22T10:05:12+05:30 IST