Abn logo
Aug 4 2020 @ 01:17AM

అభిరాముడే అందరి దేవుడా?

Kaakateeya

మానవోత్తముడు, హిందూమత పుణ్యపురుషుడు శ్రీరాముడికీ, అబ్రహామిక్ మతాల (జుడాయిజం, క్రైస్తవం, ఇస్లాం) పుణ్య పురుషుడు ఇబ్రహీమ్‌కు మధ్య అసాధారణ సామ్యాలు ఉన్నాయి. అబ్రహామిక్ మతాల ప్రపక్తలు ఆదాము, నహ్‌లు భారత్‌లో నివసించారని రాంపూర్ పండితుడు సయద్ తరీఖ్ అబ్దుల్లా ఘంటాపథంగా నిరూపించారు. అబ్రహామ్ సైతం భారత్‌లో నివసించిన వాడా? హిందువుల రాముడికి అబ్రహామ్‌కు ఉన్న పోలికలు ఆశ్చర్యం కలిగిస్తాయి.


ఇబ్రహీమ్ (ఈయనే క్రైస్తవ మత గ్రంథం బైబిల్‌లో అబ్రహామ్‌గా సుప్రసిద్ధుడు) అసలు పేరు అబ్రామ్. అబ్-రామ్ అంటే ‘ఫాదర్ రామ్’ అని ఆర్థం. అలా ‘రామ’ అనే నామం ఇబ్రహీమ్ అనే పేరులో నిక్షిప్తమై వున్నది. అదే విధంగా దశరథ, తేరాహ్; సీత, సారా; లక్ష్మణ, లోట్ పేర్ల మధ్య కొట్టొచ్చిన సామ్యం ఉన్నది. రాముడు తన భార్య సీత, సోదరుడు లక్ష్మణుడితో వనవాసానికై దక్షిణాదికి వెళ్ళాడు. అలాగే అబ్రహామ్ కూడా తన భార్య సారా, మేనల్లుడు లోట్‌తో దక్షిణాదికి వెళ్ళాడు. రాముని భార్య సీత అపహరణకు గురై రావణుని చెరలో ఉన్నది. రాముడు రావణునిపై యుద్ధం చేసి, అతన్ని సంహరించి, సీతను విముక్తం చేశాడు. భార్య, తమ్ముడితో పాటు మళ్ళీ అయోధ్యకు చేరుకున్నాడు. అదే విధంగా అబ్రహామ్ భార్య సారాను బలవంతంగా ఫారో రాజసౌధానికి తీసుకువెళ్ళారు. ఫారోను జయించి, అతని చెర నుంచి సారాను విముక్తం చేసి ఆమెతో కలిసి తాము నివసించే అయికి అబ్రహామ్ తిరిగొచ్చాడు. అయోధ్య, అయి పేర్ల మధ్య సామ్యాన్ని గమనించారా? ఇవీ, ఇంకా ఎన్నో సారూప్యాలు ఆసక్తికరంగా ఉంటాయి. అబ్రహామ్ తండ్రి తేరాహ్ ‘ఉర్ చాల్డియా’ అనే ప్రదేశంలో నివసించాడని బైబిల్ చెబుతున్నది. ఆ ‘ఉర్’ ఇరాక్ లోని ‘ఉర్’ ఒకటేనని అబ్రహామిక్ మతాలు పూర్తిగా విశ్వసిస్తున్నాయి. అయితే ఇరాక్ లోని ‘ఉర్’ మాత్రమే కాదు, ఆ పేరుతో ఉన్న కాన్పూర్, నాగపూర్, రాంపూర్ మొదలైన అనేక ప్రదేశాలూ కూడా మనకు తెలుసు. 


అబ్రహామ్ నివసించిన ఉర్ అనే ప్రదేశం బహుశా భారతదేశంలోనే ఉండి ఉండవచ్చు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రకారం ఇబ్రహీమ్, అతని కుమారుడు ఇస్మాయిల్‌లు ఒక ఆరాధనా మందిరాన్ని నిర్మించారు. అది మక్కాలో ఉన్నదే అయివుంటుందని మన ముస్లిం సోదరులు విశ్వసిస్తున్నారు. మక్కాలో ఆరాధనా మందిరాన్ని నిర్మించేందుకు ఇబ్రహీమ్ ఇరాక్లోని ఉర్ నుంచి కాకుండా భారతదేశంలోని ఉర్ నుంచే వెళ్ళి వుంటారు.


హిందూమతానికి, అబ్రహామిక్ మతాలకు మధ్య ఒక ప్రధాన వ్యత్యాసం ఉన్నది. హిందువులు భగవంతుడిని విగ్రహ రూపంలో పూజిస్తారు. యూదులు, క్రైస్తవులు, ముస్లింలు విగ్రహారాధనను ససేమిరా ఒప్పుకోరు. వారు ఒకే అగోచర భగవంతుడు లేదా అల్లాహ్‌ను ఆరాధిస్తారు. శ్రీరామచంద్రుని కాలంలో హిందూ మత పరిస్థితులు కూడా అదే విధంగా ఉండేవి. ‘యోగ వాసిష్ఠం’ ప్రకారం యువ రాముడు ఒకసారి పుణ్యయాత్రలు ముగించుకుని అయోధ్యకు తిరిగివచ్చిన తరువాత ప్రాపంచిక వ్యవహారాలలో పూర్తిగా అనాసక్తుడవుతాడు. ఈ జగత్తు ఒక మిథ్య అయినప్పుడు ప్రాపంచిక వ్యవహారాలలో పాల్గొనడం వల్ల ప్రయోజనమేముందని నిర్లిప్తుడు అవుతాడు. ఈ కనిపించే విశ్వం ఒక ఎండమావి అయితే మనుషులు మరీచికల వైపు ఎందుకు పరుగిడాలని ప్రశ్నిస్తాడు. అప్పుడు వశిష్ఠ మహాముని రాముడికి సత్యాన్ని వివరిస్తాడు. ఈ యావత్ విశ్వమూ బ్రహ్మన్ అనే ఒక మహా శక్తితో పరివ్యాప్తమై వున్నదని, బ్రహ్మన్ ఎంత సత్యమో ఈ విశ్వం కూడా అంతే సత్యమని వశిష్ఠుడు స్పష్టం చేస్తాడు. కనుక నిర్లిప్తత విడనాడి ప్రాపంచిక కర్తవ్యాలను నిర్వర్తించమని ప్రేరేపిస్తాడు. ఈ విశ్వంలోని -ధరిత్రి, వృక్షాలు, బంధువులు- ప్రతి దానిలోను బ్రహ్మన్‌ను చూడమని చెబుతాడు. వశిష్ఠుని బోధతో రాముడు ప్రాపంచిక వ్యవహారాలలో పాల్గొనకూడదన్న ఆలోచనను విరమించుకుంటాడు. ఆధ్యాత్మిక నిర్లిప్తతను విడనాడుతాడు. లోకకల్యాణానికి దోహదం చేసే పనులకు పూనుకుంటాడు. 


ఈ విశ్వంలో ఒకే ఒక్క బ్రహ్మన్ ఉన్నదని, మరేదీలేదనేదే వశిష్ఠుడు చాటిన సత్యం. హిందూ బ్రహ్మన్ భావన బైబిల్ భగవంతుడు, ఖురాన్ అల్లాహ్‌లతో సమానమైనది. రాముడు, ఇబ్రహీం పోలికలను యింకా పరిశోధించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 సార్వత్రక ఎన్నికల సందర్భంగా వారణాసిని ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా రూపొందిస్తానని హామీ ఇచ్చారు. అయోధ్యను సైతం అలా అభివృద్ధిపరచడంతో పాటు సకల మతాల పుణ్యయాత్రల గమ్యంగా రూపొందించాలి.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Advertisement
Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...