Abn logo
Oct 12 2021 @ 01:08AM

అప్పులతో ‘5 ట్రిలియన్’ సాధ్యమా?

కొవిడ్ మహమ్మారి కారణంగా గత ఏడాది మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 8 శాతం తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం భారీమొత్తాలను అప్పుగా తీసుకుంది. అప్పులు ఉచితంగా ఇవ్వరు కదా. తీసుకున్న అప్పులకు పెద్ద మొత్తంలోనే వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ఇందుకు భావి ప్రభుత్వం భావితరాల వారిపై అధిక పన్నులు విధించడం అనివార్యమవుతుంది. గత తరాలవారు తీసుకున్న రుణాలపై వడ్డీ, అసలు మొత్తాన్ని చెల్లించేందుకు భావితరాల వారు పన్నుల భారాన్ని మోయక తప్పదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రభుత్వం భావితరాల వారికి అన్యాయం చేస్తోంది. ఈ అన్యాయాన్ని నివారించేందుకు ప్రభుత్వానికి రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి- ఇప్పుడే ప్రజలపై భారీ పన్నులు విధించడం; రెండు–ప్రభుత్వ వ్యయాలను గణనీయంగా తగ్గించడం. కొవిడ్ మహమ్మారితో దేశ ఆర్థికవ్యవస్థలకు వాటిల్లిన భారీనష్టాలను తట్టుకోవడానికై ప్రభుత్వం అదనపు రాబడిని తప్పనిసరిగా సమకూర్చుకోవాలి. ఇందుకు వర్తమాన తరం వారిపై భారీగా పన్నులు విధిగా విధించవలసి ఉంది. 


అప్పుతో సమకూర్చుకున్న ధనాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారనేది ద్రవ్యలోటులోని రెండో అంశం. అప్పు చేసిన డబ్బును రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. ఒక వ్యాపారస్థుడు ఉదాహరణగా ఈ విషయాన్ని వివరిస్తాను. ఒక కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు వ్యాపారస్థుడు అప్పుచేస్తాడు. ఆ అప్పుతో ఏర్పాటు చేసే ఫ్యాక్టరీ వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. డబ్బుపెట్టిన వ్యాపారి భవిష్యత్తులో లాభాలు ఆర్జిస్తాడు. ఆ భావి ఆదాయంతో చేసిన అప్పుపై వడ్డీని, అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించగలుగుతాడు. ఇటువంటి పరిస్థితిలో సంబంధిత వ్యాపారి తన కుటుంబానికి చెందిన భావి తరాలపై ఎటువంటి ఆర్థికభారాన్ని మోపడు. ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు అప్పు తీసుకోవడమనేది సరైన పద్ధతి. దానివల్ల ఆ వ్యాపారస్థుని కుటుంబం శీఘ్రగతిన అభివృద్ధి చెందుతుంది. ఒక వ్యాపారస్థుని ఆదాయం రూ.1,00,000 అనుకుందాం. అతడు రూ.3 లక్షలు అప్పు తీసుకుని కేవలం లక్ష రూపాయలతో కాకుండా రూ.4 లక్షల వ్యయంతో ఫ్యాక్టరీని నెలకొల్పుతాడు. రూ.4 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీతో సమకూరే ఆదాయంతో వడ్డీ, అసలు మొత్తాన్ని తీర్చగలుగుతాడు. అప్పును ఇలా సద్వినియోగం చేయడం వల్ల బహుళ ప్రయోజనాలు సమకూరతాయి. అలా కాకుండా తీసుకున్న అప్పును విదేశీ విహారయాత్రలకో లేదా హై–ఫై ఆఫీసుకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకో ఉపయోగిస్తే అదనపు ఆదాయమేమీ సమకూరదు. కేవలం లక్ష రూపాయల మదుపుపై సమకూరే ఆదాయంతోనే అతడు భవిష్యత్తులో వడ్డీ, అసలు మొత్తాన్ని చెల్లించవలసిన అగత్యమేర్పడుతుంది. భవిష్యత్తులో అతని ఆదాయం స్వల్పస్థాయిలో మాత్రమే ఉంటుంది.


ఇదే తర్కం ప్రభుత్వం చేసే అప్పులకూ వర్తిస్తుంది. ఒక హైవే నిర్మాణం కోసం ప్రభుత్వం అప్పు తీసుకుంటే భవిష్యత్తులో దేశ ఆదాయం మరింత అధికమవుతుంది. హై వే నిర్మాణానికి పూనుకున్నప్పుడు తొలుత సిమెంట్, ఉక్కు, యంత్రాలకు డిమాండ్ పెరుగుతుంది. సిమెంట్, ఉక్కు, యంత్రాల ఉత్పత్తిదారులు ప్రభుత్వానికి వస్తుసేవల పన్ను (జీఎస్టీ) మొదలైనవి చెల్లిస్తారు. సిమెంట్ ఉత్పత్తి మొదలైన కార్యకలాపాలతో పాటు హైవే నిర్మాణం వల్ల కొత్త ఉద్యోగాలు సృష్టి అవుతాయి. కార్మికులు, ఉద్యోగులు మార్కెట్ నుంచి సరుకులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఫలితంగా మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుంది. 


అప్పు చేసిన సొమ్మును ప్రభుత్వోద్యోగుల వేతన భత్యాల చెల్లింపులకు ఉపయోగిస్తే బంగారం, విదేశీ ఆస్తుల కొనుగోళ్లు మొదలైనవి పెరుగుతాయి. ప్రభుత్వోద్యోగుల వినియోగ అవసరాలు వారి ప్రస్తుత వేతనభత్యాలతోనే తీరుతాయి. అదనంగా సమకూరే ఆదాయాన్ని ఏ మాత్రం వినియోగ అవసరాలకు ఉపయోగించవలసిన అవసరం లేదు. గమనార్హమైన విషయమమేమిటంటే ఇలాంటి వ్యయాల వల్ల ప్రభుత్వానికి, తీసుకున్న అప్పును తిరిగి చెల్లించేందుకు అవసరమైన అదనపు ఆదాయమేమీ సమకూరదు. ప్రభుత్వ ఆదాయంలో ఎదుగుదల ఉండదు. ఆదాయం తగ్గిపోవడంతో వడ్డీ, అసలు మొత్తం చెల్లింపులు మోయలేని భారమవుతాయి.


కొవిడ్ మహమ్మారితో వాటిల్లిన ఆర్థికనష్టాలు బాధాకరమైనవే, సందేహం లేదు. అయితే ఆ నష్టాలను ఎదుర్కోవడానికై అప్పుల ద్వారా అదనపు నిధులు సమకూర్చుకోవాలనుకోవడం వివేకవంతమైన నిర్ణయం కాదు. ఆ అప్పుల పర్యవసానాలు భావితరాలకు సమస్యాత్మకంగా పరిణమిస్తాయి. ప్రస్తుత వినియోగ వ్యయాల కోసం చేసే అప్పులు తప్పకుండా దేశ ఆర్థికవ్యవస్థ పెరుగుదలపై భవిష్యత్తులో ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ కఠోర వాస్తవాన్ని విస్మరించడం తగదు. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా రూపొందించాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ లక్ష్య పరిపూర్తిలో తీవ్రజాప్యానికి చేస్తాయి.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మరిన్ని...