గిరిజనంపై మత్తు

ABN , First Publish Date - 2021-07-13T08:37:36+05:30 IST

మైనింగ్‌ మాఫియా రోజుకో పంథాను అనుసరిస్తోంది. నిన్న విశాఖ జిల్లాలో లేటరైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా సమావేశం పెట్టడానికి చూసిన కొందరిని బెదిరించడంతోపాటు డబ్బులు ఎర చూపింది.

గిరిజనంపై మత్తు

  • లేటరైట్‌పై నోరు మెదపకుండామందు, వేట మాంసంతో విందు
  • ‘తూర్పు’లో మాఫియా కొత్త ఎత్తు


రౌతులపూడి, జూలై 12: మైనింగ్‌ మాఫియా రోజుకో పంథాను అనుసరిస్తోంది. నిన్న విశాఖ జిల్లాలో లేటరైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా సమావేశం పెట్టడానికి చూసిన కొందరిని బెదిరించడంతోపాటు డబ్బులు ఎర చూపింది. ఇప్పుడేమో విశాఖలో తవ్విన లేటరైట్‌ను డంప్‌ చేస్తున్న తూర్పుగోదావరి జిల్లాలో రౌతులపూడి మండలం లో కొందరు గిరిజనులకు తెలంగాణ నుంచి తెచ్చి న మద్యం, వేట మాంసంతో విందు ఇచ్చారు. ఈ సమయంలో సెల్‌ఫోన్లు లేకుండా జాగ్రత్తపడ్డారు. లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ తరలించుకుపోతున్నారనే వార్తలు, ఈ తరలింపు కోసం 14 కిలోమీటర్ల మే అడవులు కొట్టి రహదారులు వేసిన ఫొటోలు బయటకు రావడం ఇప్పటికే మైనింగ్‌ మాఫియాను ఆత్మరక్షణలో పడేసింది. దీంతో అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ ఆదివారం విందు ఏర్పాటుచేశారు. 


ఈ విందు కోసం దబ్బాదితోపాటు చుట్టు పక్కల గిరిజన గ్రామాల ప్రజలకు పిలుపు అందింది లేటరైట్‌ పని చేస్తున్న ఒక వ్యక్తి వివా హం సందర్భం వంకతో విందు ఇచ్చినట్టు తెలిసిం ది. అంతేకాదు.. లేటరైట్‌ వ్యవహారాలకు ఇప్పుడు కీలకంగా మారిన వ్యక్తి పుట్టినరోజు వచ్చే ఆదివారం కావడంతో ఆ పేరుతో గిరిజనులకు భారీస్థాయిలో విందు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా మహిళలకు కానుకలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఇటీవల టీడీపీ బృందం పర్యటించిన సందర్భంలో గిరిజనులు చాలామంది లేటరైట్‌ ప్రతినిధులు, అధికారులపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుత రహదారిని స్థానికులతో పనులు కాకుండా యంత్రాలతో నిర్మించారని వెలుగులోకి రావడంతో గిరిజనుల్లో చైతన్యం మొదలైంది. ఈ నేపథ్యంలో గిరిజనులు లేటరైట్‌ లారీలను అడ్డుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న లేటరైట్‌ ప్రతినిధులు విందులతో గిరిజనులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - 2021-07-13T08:37:36+05:30 IST