పదోన్నతులివ్వకుండానే పైపోస్టుల్లోకి!

ABN , First Publish Date - 2021-09-17T09:29:58+05:30 IST

శుసంవర్ధకశాఖలో అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేయడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టడం ..

పదోన్నతులివ్వకుండానే పైపోస్టుల్లోకి!

నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు

పశు సంవర్ధకశాఖ ఉద్యోగుల విస్మయం

దృష్టిపెట్టని ప్రభుత్వ పెద్దలు

(అమరావతి- ఆంధ్రజ్యోతి): పశుసంవర్ధకశాఖలో అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేయడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ శాఖలో కీలకమైన అదనపు డైరెక్టర్లకు రెండున్నరేళ్లుగా పదోన్నతులు కొరవడ్డాయి. అర్హులకూ పదోన్నతులు కల్పించలేదు. కానీ పదోన్నతులు ఇవ్వకుండానే నలుగురు అదనపు డైరెక్టర్లను డైరెక్టర్‌ పోస్టుల్లోనే కొనసాగిస్తున్నారు. మూడు నెలల క్రితం 18మంది డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్‌ డైరెక్టర్లుగా ఉద్యోగోన్నతి కల్పించిన ప్రభుత్వం.. అదనపు డైరెక్టర్ల విషయంలో కనీసం శాఖాపరమైన పదోన్నతుల కమిటీ(డీపీసీ)ని కూడా ఏర్పాటు చేయకుండా, వారినే డైరెక్టర్‌ పోస్టుల్లో నియమించడం గమనార్హం. యానిమల్‌ హెల్త్‌, వెటర్నరీ ప్లానింగ్‌, లైవ్‌స్టాక్‌ అడిషనల్‌ సీఈవో, స్మైల్‌ అనే సంస్థతో సహా నాలుగు అదనపు డైరెక్టర్‌ పోస్టులున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అయిదుగురు అదనపు డైరెక్టర్లు ఉన్నారు. వీరిలోఒకరు వెటర్నరీ డైరెక్టర్‌గా ఉండగా, మిగిలిన నలుగురు పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో, అదనపు సీఈవోగా, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీగా, స్మైల్‌ సంస్థ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర విభజనలో ఏపీకి కేటాయించిన ఆరో అదనపు డైరెక్టర్‌ పోస్టు ఖాళీగా ఉంది.


ఈ అదనపు డైరెక్టర్‌ తనను తెలంగాణ కే కేటాయించాలని కోర్టుకెళ్లారు. ఏపీలో ఉన్న అయిదుగురు అదనపు డైరెక్టర్లలో ఇద్దరు.. వెటర్నరీ డైరెక్టర్‌ పోస్టును గతేడాది కొన్ని నెలలు నిర్వహించారు. సీనియార్టీ పరంగా నాలుగో అదనపు డైరెక్టర్‌ అయిన అధికారి వెటర్నరీ డైరెక్టర్‌ పోస్టులో కొనసాగుతున్నారు. తెలంగాణ నుంచి రావాల్సిన అదనపు డైరక్టర్‌ ఏపీకి వస్తే, వీరి జాబితా ఆరుకు చేరుతుంది. కాగా నాలుగు డైరెక్టర్‌ పోస్టులకు ఐదుగురు అర్హులున్నా.. పదోన్నతులు కల్పించకుండానే డైరెక్టర్‌ స్థాయి పోస్టుల్లో కొనసాగించడం గమనార్హం. ప్రభుత్వ పెద్దలు ఈ అంశంపై దృష్టి పెట్టకపోవడంపై పశుసంవర్ధకశాఖ ఉద్యోగులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-09-17T09:29:58+05:30 IST