ప్యాకేజీ పెంచున్‌ గిరాకీ

ABN , First Publish Date - 2020-06-04T05:51:47+05:30 IST

ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ వ్యాపారాలకు నిధులను అందిస్తుంది. సరఫరా అవరోధాలను అధిగమించడానికి తీసుకున్న చర్యలు గిరాకీని పెంచుతాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాగూర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. విశేషాల్లోకి వెళితే...

ప్యాకేజీ పెంచున్‌ గిరాకీ

ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ వ్యాపారాలకు నిధులను అందిస్తుంది. సరఫరా అవరోధాలను అధిగమించడానికి తీసుకున్న చర్యలు గిరాకీని పెంచుతాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాగూర్‌  ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. విశేషాల్లోకి వెళితే..


ప్యాకేజీలో ప్రభుత్వం కొత్తగా ప్రకటించింది జీడీపీలో ఒక శాతం కూడా లేదు. రిజర్వు బ్యాంకు తీసుకున్న చర్యలను కూడా ప్యాకేజీలో కలిపేశారు. దీనిపై ఏమంటారు?

ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం రూ.20.97 లక్షల కోట్ల విలువైన చర్యలు ప్రకటించింది. ఈ నిధులు బడ్జెట్‌, రుణ సంస్థల ద్వారా నేరుగా వస్తాయి. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ, వ్యాపారాలు నిలదొక్కుకుని కొనసాగడానికి నిధుల కొరత ఉండదు. నిధులు ఎవరికి అవసరమో వారికి అందుతాయి. ఇతర ప్రభుత్వాలు ప్రకటించిన ప్యాకేజీలు ఎలా ఉన్నాయో భారత ప్రభుత్వ ప్యాకేజీ కూడా అలానే ఉంది. చిన్న, మధ్య సంస్థల వ్యాపారాల కోసం రూ.3 లక్షల కోట్లతో అత్యవసర రుణ నిధిని ప్రకటించాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ్‌సకు కేటాయింపు రూ.లక్ష కోట్లకు పెంచాం. సొంత రాష్ట్రాలకు వచ్చిన వలస కూలీలకు ఈ నిర్ణయం ఉపాధి కల్పిస్తుంది. ఈ చర్య 300 కోట్ల పనిదినాలను సృష్టించగలదని భావిస్తున్నాం. 


పౌరుల చేతిలోకి నగదు వచ్చే ప్రత్యేక చర్యలేమీ తీసుకోలేదు. వినియోగ గిరాకీ ఎలా పెరుగుతుంది?

సరఫరాను పెంచడానికి తీసుకున్న చర్యలు గిరాకీని సృష్టిస్తాయి. పీఎం గరీబ్‌ కళ్యాణ్‌ ప్యాకేజీ ద్వారా 9 కోట్ల మందికి రూ.18,000 కోట్లు చేరాయి. 20 కోట్ల జన్‌ ధన్‌ ఖాతాల ద్వారా మహిళలకు రూ.20,000 కోట్లు లభించే విధంగా చేశాం. ఇటువంటి చర్యలు గిరాకీని పెంచుతాయి. 


ఈ ఏడాది జీడీపీ క్షీణిస్తుందని.. ప్రతికూల వృద్ధిరేటు నమోదు కాగలదని ఆర్‌బీఐ పేర్కొంది. జీడీపీ -5 శాతం క్షీణించగలదని క్రిసిల్‌ అంచనా వేస్తోంది. ప్రభుత్వం దీన్ని ఎలా భావిస్తోంది?

అనేక చర్యలు, సలహాలు తీసుకున్న అనంతరం కోవిడ్‌-19 సంక్షోభాన్ని అధిగమించడానికి రూ.20.97 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించాం. తగిన చర్యలు తీసుకున్నాం. ప్రస్తుత పరిస్థితులను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. 


లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రాల ఆదాయాలు 80 శాతం వరకూ తగ్గాయి. సంక్షోభం నుంచి రాష్ట్రాలు బయటపడేందుకు కేంద్రంఏమైనా మద్దతు చర్యలు తీసుకుంటుందా?

కేంద్రం నిధుల కొరతను ఎదుర్కొంటున్నా.. పన్నుల ఆదాయం కేటాయింపు రూపంలో రాష్ట్రాలకు రూ.92,077 కోట్లు బదిలీ చేశాం. కోవిడ్‌-19 కట్టడికి రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ రూ.4,113 కోట్లు అందించింది. నిత్యావసర వస్తువులు, టెస్టింగ్‌ ల్యాబ్‌లు, కిట్ల రూపంలో రూ.4,300 కోట్లు సాయం చేశాం. రాష్ట్రాల వేస్‌ అండ్‌ మీన్స్‌ పరిమితిని రిజర్వు బ్యాంకు పెంచింది. కేంద్రం నుంచి రాష్ట్రాలు తీసుకునే రుణ పరిమితిని రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3 నుంచి 5 శాతానికి పెంచాం. దీని వల్ల రాష్ట్రాలకు అదనంగా రూ.4.28 లక్షల కోట్లు రుణంగా తీసుకునే వెసులుబాటు లభిస్తుంది. జీఎ్‌సటీ పరిహారం కింద రూ.15,340 కోట్లు అందించాం. 


ఎంఎ్‌సఎంఈ రుణ గ్యారంటీ పథకాన్ని అమలు చేయడానికి బ్యాంకులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి?

గత వారంలో బ్యాంకుల అధిపతులతో ఆర్థిక మంత్రి సమావేశం అయ్యారు. ఎంఎ్‌సఎంఈ రుణ గ్యారంటీ పథకం అమలుపై బ్యాంకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వ్యాపారాలకు, ఎంఎ్‌సఎంఈలకు  బ్యాంకులు ఇచ్చిన రుణాలపై రోజువారీ నివేదికలు తెప్పించుకుంటున్నాం. బ్యాంకులు కొన్ని సూచనలు చేశాయి. అవసరమైనప్పుడు వాటిని అమలు చేస్తాం.


వ్యవసాయం వంటి ప్రత్యేక రంగాలకు భవిష్యత్తులో ప్రత్యేక చర్యలు ఏమైనా ఉంటాయా?

సంస్కరణలు నిరంతర ప్రక్రియ. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో చర్యలు తీసుకుంటాం. పరిశ్రమలు, ఇతర భాగస్వాముల నుంచి ఎప్పుడూ సలహాలు, సూచనలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. 

ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వ దృక్పథం ఏమిటి?

ప్రభుత్వ దృష్టి అంతా ఉద్యోగావకాశాల కల్పన పైనే.  వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడానికి ప్యాకేజీలో కూడా చర్యలు తీసుకున్నాం. ఈ నిర్ణయాలు కొత్త ఉద్యోగావకాశాలను కల్పిస్తాయి. కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సూక్ష, చిన్న, మధ్య స్థాయి సంస్థలకు అండగా నిలిచేందుకు ప్యాకేజీలో పెద్దపీట వేశాం. 


ఉద్దీపన చర్యలు అమలు చేయడానికి ఎంత సమయం పడుతుంది? 

ప్యాకేజీలో ప్రకటించిన చర్యలు వేగంగా అమలు చేయడానికి నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నాం. కొన్ని ఇప్పటికే అమలయ్యాయి. బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీల కోసం ఉద్దేశించిన 3 పథకాలకు ఇప్పటికే కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని వల్ల వ్యాపారాలకు నిధుల లభ్యత ప్రారంభమవుతుంది. రూ.3 లక్షల కోట్ల రుణాలకు నూరు శాతం గ్యారంటీ అందించే నేషనల్‌ క్రెడిట్‌ గ్యారంటీ ట్రస్ట్‌ కంపెనీ నిర్వహణ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుత కష్టకాలంలో ప్రజలకు, వ్యాపార సంస్థలకు ఎటువంటి అవరోధాలు ఎదురుకాకుండా పని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌)


Updated Date - 2020-06-04T05:51:47+05:30 IST