రాష్ట్రాల అధికారాల్లో జోక్యమే..!

ABN , First Publish Date - 2022-01-25T06:50:30+05:30 IST

రాష్ట్రాల అనుమతి లేకుండానే ఐఏఎస్‌ అధికారులను

రాష్ట్రాల అధికారాల్లో  జోక్యమే..!

  • ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
  • ఐఏఎస్‌ల ఏకపక్ష డెప్యుటేషన్‌ ప్రమాదకరం.. క్యాడర్‌ రూల్స్‌ సవరణను విరమించుకోవాలి
  • కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలకు విఘాతం.. ఇది రాజ్యాంగాన్ని మార్చడంతో సమానం
  • దొడ్డిదారిన మార్పులు ఎందుకు?.. ధైర్యముంటే పార్లమెంటులో ఆమోదించుకోండి
  • ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ


హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల అనుమతి లేకుండానే ఐఏఎస్‌ అధికారులను డెప్యుటేషన్‌ మీద కేంద్ర ప్రభుత్వ సేవలకు తీసుకెళ్లేందుకు క్యాడర్‌ రూల్స్‌ను సవరించే ప్రయత్నాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది కేంద్ర, రాష్ట్రాల సంబంధాలను దెబ్బ తీస్తుందని హెచ్చరించారు. సహకారాత్మక సమాఖ్య విధానానికి తూట్లు పొడిచే ఇలాంటి ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.


‘ఆల్‌ ఇండియా సర్వీసె్‌స(క్యాడర్‌)రూల్స్‌-1954’ను సవరించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రతిపాదన రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎస్‌ అధికారుల పనితీరును, ఉద్యోగ స్వరూపాన్ని మార్చివేసేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ప్రకటించారు. రాష్ట్రాల్లోని ఐఏఎస్‌ అధికారులు నిర్వహించే క్లిష్టమైన విధులు, ప్రత్యేక బాధ్యతల దృష్ట్యా వారిని కేంద్రానికి డెప్యుటేషన్‌ మీద తీసుకెళ్లడానికి రాష్ట్రాల అనుమతి తీసుకోవాలంటూ ప్రస్తుత నిబంధనలు సూచిస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రాల, సంబంధిత అధికారుల అనుమతితో పని లేకుండా చేయడానికి డెప్యుటేషన్‌ అధికారాన్ని కేంద్రం లాగేసుకొనే కొత్త ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ ప్రతిపాదనలను అమల్లోకి తెస్తే రాష్ట్రాలు నామమాత్రపు వ్యవస్థలుగా మిగిలిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా రాష్ట్రాల్లోని ఐఏఎ్‌సలను తన నియంత్రణలోకి తీసుకోవడమే అవుతుందని వ్యాఖ్యానించారు.


ఒకరకంగా రాష్ట్ర అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పట్ల అధికారుల జవాబుదారీతనాన్ని పెంచాల్సింది పోయి... వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేలా, వేధింపులకు గురిచేసేలా ఈ ప్రతిపాదన ఉందని చెప్పారు. ఆర్టికల్‌ 312 ప్రకారం పార్లమెంటు అఖిల భారత సర్వీసుల చట్టాన్ని చేసిందని, దానికి అనుగుణంగానే కేంద్రం క్యాడర్‌ రూల్స్‌ తెచ్చిందని కేసీఆర్‌ ప్రస్తావించారు. సమాఖ్య నీతిని పలుచన చేసేలా క్యాడర్‌ రూల్స్‌ను మారుస్తున్నారని, ఇది కేంద్ర రాష్ట్రాల సంబంధాలకు సంబంధించి భారత రాజ్యాంగాన్ని సవరించడమే తప్ప మరొకటి కాదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వానికి ధైర్యముంటే దొడ్డిదారిన కాకుండా పార్లమెంటు ద్వారా సవరించాలని సవాల్‌ చేశారు.


రాజ్యాంగ నిర్మాతలు దూరదృష్టితో రాజ్యాంగంలో రాష్ట్రాల హక్కుల గురించి ఆర్టికల్‌ 368(2)ను పొందుపర్చారని చెప్పారు. క్యాడర్‌ రూల్స్‌ సవరణ ద్వారా రాజ్యాంగస్ఫూర్తిని మంటగలపడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య పరిపాలనా పరమైన సర్దుబాటుకు ఇది గొడ్డలిపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల్లో ఐఏఎస్‌ అధికారులను సమతుల్యతతో వినియోగించుకోవడానికి ప్రస్తుతం ఉన్న క్యాడర్‌ రూల్స్‌ సరిపోతాయని చెప్పారు. పాలనా పరమైన పారదర్శకత, సమాఖ్య నీతిని కొనసాగించేలా ప్రతిపాదిత సవరణనను ఉపసంహరించుకోవాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.


Updated Date - 2022-01-25T06:50:30+05:30 IST