మంత్రి వార్నింగ్ ఇచ్చినా మారని వైసీపీ ఎమ్మెల్యే..!

ABN , First Publish Date - 2020-09-20T17:16:29+05:30 IST

పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షంలో లాగానే కష్టాలు పడాల్సిన దుస్థితి ఆ నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నాయకులకు నెలకొంది. పార్టీ జెండాలు మోసి కష్టాల నుంచి...

మంత్రి వార్నింగ్ ఇచ్చినా మారని వైసీపీ ఎమ్మెల్యే..!

పార్టీ అధికారంలోకి వచ్చినా  ప్రతిపక్షంలో లాగానే కష్టాలు పడాల్సిన దుస్థితి ఆ నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నాయకులకు నెలకొంది. పార్టీ జెండాలు మోసి కష్టాల నుంచి పార్టీని గట్టెక్కించిన తమను కాదని, ఇతర పార్టీలవారికి, సొంత సామాజికవర్గానికి ఆ ప్రజాప్రతినిధి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. జిల్లా మంత్రి వద్దకెళ్లి తమ కష్టాలు మొరపెట్టుకున్నా లాభం లేకపోయింది. సదరు ఎమ్మెల్యేని ఆ మంత్రి ఎన్నిసార్లు హెచ్చరించినా.. ఆయన తీరులో మాత్రం మార్పు లేదు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన ప్రవర్తనలో పరివర్తన తేవడానికి ఆ మంత్రి ఏం చేశారు?


చిత్తూరులో అధికార వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌ అయింది. వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి జెండాలు మోసిన తాము.. పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షంలో మాదిరిగానే కొనసాగాల్సిన దుస్థితి నెలకొందని నియోజకవర్గంలోని చాలామంది ద్వితీయశ్రేణి నాయకులు మదనపడుతున్నారు. ఇదే తరుణంలో తమ సొంత సామాజికవర్గం వారిని తప్ప పార్టీలోని ఇతర క్యాడర్‌ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ ప్రచారాన్ని ఖండించేందుకు, కౌంటర్ ఇచ్చేందుకు ఆయన అనుచరులు క్యూ కడుతున్నారు. దీంతో చిత్తూరు ఆరణి శ్రీనివాసులు వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.


వారు ఏ పార్టీవారైనా సరే..

నిజానికి ఆరణి శ్రీనివాసులు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి వరుసగా రెండుసార్లు ఓడారు. చివరకు 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసి ఫ్యాన్ గాలితో గట్టెక్కారు. అయితే గతానికి భిన్నంగా ఆయన ప్రవర్తనలో ఇప్పుడు మార్పు కనిపిస్తోందట. గత ఎన్నికల్లో ఆయన గెలుపుకోసం పలువురు నాయకులు, వివిధ సంఘాలు వారు తీవ్రంగా కృషిచేశారు. అలాంటిది ఇప్పుడాయన తీరుతో వారందరూ దూరం అయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. తన సామాజికవర్గానికి చెంది.. వారు ఏ పార్టీవారైనా సరే.. అలాంటి వారికే అన్నింటా పెద్దపీట వేస్తున్నారట. ఈ విషయంలో ఆరణి శ్రీనివాసులుపై స్వపక్ష నేతలు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.


అడిగేదే ఆలస్యం అన్నట్టుగా...

పార్టీలోనే కాకుండా.. తన నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విభాగాల్లోనూ ఆరణి శ్రీనివాసులు సామాజికవర్గం వారికి అడిగేదే ఆలస్యం అన్నట్టుగా పనులు జరుగుతాయట. జిల్లా పరిషత్ కార్యాలయ ఉద్యోగుల బదిలీలు, కూరగాయల మార్కెట్ తరలింపు, కార్పొరేషన్ కార్యాలయం, మైనింగ్ వంటి వ్యవహారాల్లో తన అనుచరులకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్. ఇక పోలీసుశాఖలోనూ ఇదే ధోరణితో ఎమ్మెల్యే ప్రవర్తిస్తున్నారట. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ జెండాలు మోసిన వారికి కాకుండా ఇతర పార్టీలకు చెందిన తన సామాజికవర్గం వారికి ఆఖరి క్షణంలో టిక్కెట్లు కేటాయించారని విమర్శలు వినిపిస్తున్నాయి. అది కూడా తనకు అనుకూలమైన వారికే పార్టీ టిక్కెట్లు దక్కేలా చేశారని ఆరణి శ్రీనివాసులుపై ఆరోపణలున్నాయి.


మంత్రి పెద్దిరెడ్డి కూడా...

ఇలా ఆరణి ధోరణిపై ఆగ్రహంగా ఉన్న అసంతృప్త నాయకులు.. తమ ఆవేదనను జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరకెళ్లి వెళ్లగక్కారట. అయితే మంత్రి పెద్దిరెడ్డి చెప్పినా ఎమ్మెల్యే ఆరణి తీరులో మార్పు రాలేదట. ఆయన ప్రవర్తనలో పరివర్తన తీసుకురాలేక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా సతమతం అవుతున్నారని పార్టీ వర్గాలవారు చెవులు కొరుక్కుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై అనుచరులు మాత్రం.. ఆయన అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నారు. మొత్తంమీద చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ధోరణి.. జిల్లా వైసీపీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన తీరులో మార్పు తెచ్చేందుకు మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర నిర్ణయాలు తీసుకునే అవకాశముందనే చర్చ జరుగుతోంది. మరి ఈ పరిస్థితి మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

Updated Date - 2020-09-20T17:16:29+05:30 IST